Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖచ్చితంగా వంద సంవత్సరాలు.. ఆ రోజుల్లో పెద్ద సంచలనం.. ఉన్నవ లక్ష్మీ నారాయణ 'మాలపల్లి' నవల. ఈ నవల నేటికీ సాహిత్యాభిమానులనూ అలరించటానికి కారణం, నవలలోని పాత్రల సజీవత్వం. మానవుడు ఎన్నెన్ని సంఘర్షణలకు లోనవుతాడో, ఆయా పాత్రల ద్వారా రచయిత వివరించిన విధానం ఎంతో ఉత్తేజభరితంగా వుంటుంది. ఈ నవల 1922 ప్రథమ ముద్రణ నాటికి మనం బ్రిటీషు దాస్య శృంఖలాల కిందనే మగ్గుతున్నాం. ఎన్ని ముద్రణలు పొందినదో, వివరాలు లేకపోయినా, ఈ వంద సంవత్సరాలలో చాలా ముద్రణలు పొంది వుండవచ్చు. ఈ నవలకు ముందుగా 'మాలపల్లి'తో పాటు 'సంగ విజయం' పేరు కూడా నిర్ణయించుకుని, చివరగా 'మాలపల్లి' నే ఖరారు చేసినట్లు రచయిత తన పరిచయంలో పేర్కొనటం గమనించవచ్చు.
'మాలపల్లి' నవలలో పట్టుదలలు వున్నాయి. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పోరాటం చేస్తే విజయం తథ్యమనే సందేశం వుంది. మానవ బలహీనతలూ వున్నాయి. ఒక 'మాలదాసరి' అనేది అట్టడుగు కులం అనే భావన. ఆనాటి అగ్రకుల అతిశయం ప్రధానంగా వుంది. మాలదాసరి అనే పంచమ కులానికి చెందిన ఒక ఇంటి పెద్ద రామదాసు. తన సర్వస్వాన్ని కోల్పోయినా, స్థిత ప్రజ్ఞుడిగా తన భావోద్రేకాలను అణచుకున్న విధానం గురించి, ప్రధానంగా వివరించిన ఈ నవల ఆసాంతం ఆలోచింపజేస్తుంది. అందుకే 'మాలపల్లి' నవల చెరిగిపోని సజీవ చిత్రిక నేటికీ.
అలాగే, నిమ్న జాతుల పట్ల అగ్రకులాల అహంకారంతో పాటు, అదే అగ్ర వర్ణానికి చెందిన రామానాయుడు అనే వ్యక్తి సంగంలో ప్రధానపాత్ర వహించడం ఈ నవలలో ప్రధానంగా వివరించబడింది. రామదాసు కాలక్రమేణా, అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొని, తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయినా 'ధర్మం' ప్రకారం యోగేంద్రుడుగా అవతరించిన విధానాన్ని రచయిత చాలా గొప్పగా చెప్పాడు.
ఒక విధంగా మాలపల్లి నవల రామదాసు జీవన ప్రయాణం. అతని జీవన పయనంలో ఎన్నో ఆర్తితో నిండిన ఘటనలు, ఆస్తికవాదంలో వున్న డొల్లతనాన్ని కూడా ఈ నవలలో ప్రశ్నించటం జరిగింది. రామదాసు కూతురు జ్యోతి, తన అంతర్మధనంతో 'దేవుడి గుడిలోకి రానీయరు... దేవుడి గుడిలోకి మనం ప్రవేశించాలంటే దేవుడి పేరిట మనమే గుడి కట్టాలా' అని. సమాధానం లేని ప్రశ్న తల్లి మాలక్ష్మిని అడుగుతుంది. అంటరానితనం, వివిక్ష, విచక్షణా జ్ఞానాన్ని పాతర వేస్తే ఆయా పాత్రలమధ్య ఎటువంటి ఆలోచనలు రేకెత్తుతాయో కదా! అనిపిస్తుంది.
'మాలపల్లి' నవలలో ఒక పురాతనమయిన శక్తి దేవాలయం గురించి రచయిత చెప్పిన విధానాన్ని తరచిచూస్తే, ఆనాడు కూడా శిల్ప కళల గురించి, శిల్పుల పని తనాన్ని గురించి సామాన్యజనంలో కూడా ఎటువంటి పరిశీలనాత్మక చర్చ జరిగిందో కదా అని అనిపిస్తుంది.
'మాలపల్లి' నవలలో రామదాఉస రెండవ కుమారుడు 'సంగమదాసు' విప్లవభావాలు కలవాడు. ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకున్నవాడు. ఒక విధంగా కూలి జనాల సమ్మెలకు నాయకత్వం వహించి, అగ్రకులానికి చెందిన చౌదరికి కంటగింపుగా మారిన వ్యక్తి. అతడొక శక్తిగా భావించబడినవాడు. పస్తులుండయినా, సమ్మెలకు దిగాలని, తమ తమ హక్కులను కాపాడుకోవాలని జనులకు జాగృతం చేసే పాత్ర సంగమదాసుది. దేవుడి ఉనికినే ప్రశ్నించే హేతువాద దృక్పథం అతనిది.
రామదాసు కుటుంబ బాంధవ్యాల త్యాగశీలన గురించి ఎంతో గొప్పగా చెప్పాడు ఈ రచయిత. ఎన్ని కష్టాలు వచ్చినా భీతి చెందని వ్యక్తుల సమూహంలా రామదాసు స్వగ్రామం మంగళాపురంలోని నల్లమోతు వారి కుటుంబానికి చెందిన అగ్రకులస్థుడు రామన్న చౌదరికి ఒక మనస్తత్వం. చౌదరి దాష్టీకాన్ని, అతని అత్యాశను, అతని పీడనను విలనిజంగా రూపుదిద్దిన రచయితనే, చౌదరి కుటుంబానికి సంబంధించిన, స్వయాన అతని కుమారుడు రామానాయుడును గంజాయి వనంలో తులసి మొక్కలా చిత్రిక కట్టాడు. ఒక మానవత్వం కలిగిన, బాధ్యత గల పౌరుడిగా అతని వ్యక్తిత్వాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళాడు ఉన్నవ.
తండ్రి బాటన ఎప్పుడూ నడవలేదు రామానాయుడు. అందుకే చౌదరి భార్య, రామానాయుడి తల్లి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడిస్తుంది. చౌదరిని ఉద్దేశించి... 'తండ్రి మాలవాడిని మిద్దెలో పెడితే, కొడుకు మేడ మీద పెట్టాడు' అని., కూలిజనాన్ని చైతన్యపరచిన సంగమదాసు కనీస కూలి గురించి వాదిస్తూ చౌదరి మానవత్వాన్ని తట్టిలేపే ప్రయత్నంచేస్తే దానికి చౌదరి జవాబు చాలా కఠినంగా వుంటుంది. 'నువ్వు శ్రీరంగ నీతులు ఇన్ని చెపుతావు కానీ కూలి వాడికి కడుపు నిండా అన్నముంటే పని చేస్తాడటోరు.. ఒక పక్క కాస్త కాలుతుంటే పనికోసం దేవులాడుతాడు కానీ, కడుపు నిండితే పని మట్టే.. నీకేమి తెలుసు, పిల్లకాకివి...' అని అంటారు.
చౌదరి దృక్పథ:లో కూలి వాళ్ళు అలగాజనం. మాలకులం అంటే 'వివక్ష'. అటువంటి ఇంట మట్టిలో మాణిక్యంలా రామానాయుడు తండ్రి దృష్టిలో ఆ అలగా జనపు సంగానికే వత్తాసు పలుకుతూంటాడు. ఆ రోజుల్లో సైతం 'ఆంగ్ల' విద్యను ఆరోగ్యకరంగా భావిస్తూ, అదే నాగరికమని తలచిన జనులుండారని అర్థమవుతోంది.
తండ్రి చౌదరి కూలి పనులలోనూ వివక్ష చూపటం రామానాయుడును బాధిస్తుంది. వందేళ్ళ క్రితం ఉద్యమాలలోనే వర్ణ విభజనమనే మహా సౌధం శిథిలమయిందిగా, ప్రభుత్వం పరాధీనం కాగానే క్షత్రియ వృత్తులు కనుమరుగయినవిగా క్షత్రియులు ఎవరికి వారు తమకునచ్చిన వృత్తులలో నిమగమయినట్లుగా ఆనాటి కాలమాన పరిస్థితులను సందేశాత్మకంగా వివరించిన విధానం రచయిత నేర్పుకు ప్రతీక. కూలీవాడు సహితం, తన ఓటిచ్చి ప్రభుత్వాన్ని నడపటమే ఉత్తమ పాలనా మార్గంగా, ఆనాటి ప్రభుత్వ ధర్మం చెప్పిందని ద్యోతకమవుతోంది.
సంగమదాసు తన ఉపన్యాసములలో అతి మేధాశక్తి ప్రదర్శించిన విధానం సహజంగానే వుంది. ధనిక ప్రభుత్వం అట్టడుగు వర్గాల వారికి, ఎలా పీడనగా తయారయిందో, ఆ స్థితిని మార్చుకుని 'అలగాజనం' ఎలా తమ పంథాను ఎన్నుకుందో వివరిస్తూ, అంతర్జాతీయంగా నెలకొన్న స్థితిగతులను సంగమదాసు భావనల ద్వారా వివరింపచేసిన విధానం ఆలోచనాత్మకంగా వుంటుంది. అమెరికా, ఫ్రాన్సు దేశాలలో క్షత్రియ వర్గమూ, మత పీఠములూ పూర్తిగా నశింపచేసి ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయటానికి బహు ప్రయత్నాలు జరిగనవనీ, ఇటలీ దేశములో ధనికుల యంత్రాగారాలు కూలీలు స్వాధీనపరచుకుని చివరకు ఉభయులూ రాజీ పడ్డారనీ, రష్యా దేశంలో (సోవియట్) పంచాయతీ ప్రభుత్వం స్థాపింపబడినదనీ, వీరి ఉద్యమానికి బోల్షె విజయమనే విశేష జనుల అభిప్రాయమని అర్థం చెప్పాడు. ప్రజాప్రభుత్వాలు ఆ విధంగానే నెలకొనాలని వాంఛించాడు.
సమసమాజస్థాపన జరగాలంటే, కొందరు అన్నవస్త్రాలు లేక మలమలమాడటం, మరికొందరు భోగములలోనూ, దుర్వసనములలోనూ తూగటం తగదని, సృష్టిలో వున్న వస్తు భాండారం అనుభవించటానికి అందరకూ సమాన హక్కు వున్నదనీ, ఆనాటి నూతన ధర్మకర్త లెనిన్ సిద్ధాంతాలను బహుళ ప్రచారం గావించటానికి, విప్లవపంథాలో పయనించింది ఈ నవల. చౌదరి అహాన్ని ప్రశ్నించిన సంగమదాసును, చౌదరి హతమార్చిన విధానం, తాను చేసిన హత్యను కప్పి పుచ్చుకోవడానికి వివిధ మార్గాల ద్వారా అతను ప్రయత్నించిన విధానంలో సఫలమయినా, బతుకు భయభయంగానే గడపటం, నేటి వర్తమాన పరిస్థితులకూ దర్పణం పడుతోంది.
ఈ 'మాలపల్లి' నవల స్వాతంత్య్రానికి పూర్వం, బ్రిటీషు వారి పాలనలో రచింపబడినందున, ఆ ప్రభుత్వం ఈ 'మాలపల్లి' నవలను నిషేధించింది. అందుకు కారణం, ఈ నవలలో రూపుదిద్దబడిన తిరుగుబాటు బావుటాను ఎగరవేసిన పలు పాత్రలు, కార్మికోద్యమాలు చేసేవారిని సెటిల్మెంట్లకు తరలిచటం, అక్కడ నుంచి వారికి వివిధ కారాగృహాలకు తరలించటం, అక్కడ పారిశుద్ధ్య, పాయి ఖానా దుర్భర స్థితులు ఎంతో సవివరంగా వివరించాడు రచయిత. రామదాసు కూతురు జ్యోతి, అప్పాదానుల ప్రణయం, బ్రిటిషు ఉద్యోగి పౌలు బారి నుంచి తప్పిం చుకోడానికి జ్యోతి బలవన్మరణానికి పాల్పడటం, అది భరిం చలేక అప్పాదాసు సహగమనం, ఆ వాగులోనే చేయటం గురించి హృదయ విదారకంగా వివరించాడు రచయిత.
'మాలపల్లి' నవలలో మరో ప్రధాన పాత్ర తక్కెళ్ళ జగ్గడిది. రాబిన్హుడ్ వంటి పాత్ర ఇది. అక్రమార్జనా పరుల, ధనికుల గృహాలపై, వాణిజ్య సముదాయాలపై, తన పటాలంతో దాడి చేయటం జగ్గడు పాత్ర స్వరూపం. అతను బ్రిటీషు వారికి, భీకర పోరాటంలో, పోరాట పటిమ చూపి, క్షతగాత్రుడుగా దొరికిపోయాక, రామదాసు పెద్దకొడుకు వెంకటదాసే తక్కెళ్ళ జగ్గడుగా తేలుతుంది. ఇటు కారాగారాల జీవితం ఆనాడు ఎలా వుండేదో, సవివరంగా వివరించిన రచయితనే, కారాగారాలలోని రాజకీయాల గురించి కూడా విశ్లేషనాత్మకంగా తెలియచెప్పాడు.
రామదాసుతో పాటు చెరసాల జీవితం అనుభవించిన, అతని భార్య మాలక్ష్మమ్మ కూడా మరణించడంతో, యావత్తు కుటుంబాన్ని కోల్పోయిన రామదాసు జీవితంలో ఒంటరితనం ఆవహించుకుంటుంది.
భారతదేశానికి స్వరాజ్యం వచ్చిన తరువాత, రాజకీయ ఖైదీలందరూ కారాగారాల నుంచి విడుదల అవుతారు. దేశంలో పలు మార్పులు సంభవిస్తాయి. పలు చట్టాలు రూపొందుతాయి.
శాశ్వత కార్యక్రమాలకు సిద్ధమైన రామదాసు, రామా నాయుడు 'విజయ కళాశాల' నిర్మించి గురుకులంగా మారుస్తారు. రామదాసు మౌనిగా రూపాంతరం చెందుతాడు. పలువురు తమ తమ భూ విరాళాలను ప్రకటిస్తారు. ఈ విధంగా 'మాలపల్లి' నవలనకు 'సంగవిజయం' అనే పేరు కూడా తగినదే. బహుజనులు జనజీవన స్రవంతిలో భాగమవుతారు. తరతమ బేధాలకు అతీతంగా జనులొక్కటిగా జీవనం గడపసాగారు. ఎన్నో చట్టాలు వచ్చాయి. సంస్కరణలు ప్రజల జీవితంలో మమేకం అయినాయి. కార్మికోద్యమం ఘన విజయం సాధించింది. అందులో ముఖ్యమైనది ఫ్యాక్టరీ చట్టం 'గిర్నీ' కూలీల చేత రోజూ ఎనిమిది గంటల కంటే ఎక్కువగా పని చేయించకూడదనేది కఠిన నిబంధన.
జీవితంలో, జీవనంలో అనేక పార్వ్శాలు, భావోద్రేకాలు ఇంకా మొక్కవోని ఆత్మవిశ్వాసం విజయం సాధించటం, మరెన్నో వాటిని సృజించింది ఈ 'మాలపల్లి' నవల. కోపతాపాలను సహించటం, వివక్షను ఎదుర్కొవటం, సహనశీలత గురించి ఆసాంతం పలు సందేశాలకు జవాబుదారీగా నిలిచింది. ఒక విధంగా ఈ నవలకు కథా నాయకుడు అట్టడుగు జాతికి చెందిన 'రామదాసు'. వంద ఏండ్లు గతించినా ఈ 'మాలపల్లి' నవల ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. అభ్యుదయం అంటే ఏమిటో తెలుపుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, మౌనంగా అన్నింటినీ ఎలా భరించాలో వివరిస్తుంది.
అందుకే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల 'మాలపల్లి' సాహితీ ప్రపంచంలో నేటికీ సజీవంగా వున్నది. శతాబ్ధం తరువాత కూడా.. 'మాలపల్లి' నవలా సాహిత్యం బ్రిటీషు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారి, నిషేదపు టుత్తర్వులు జారీ చేయబడినాయంటే 'కలం' 'బలం' ఎటువంటిదో దిక్సూచీలా విశదమవుతుంది.
- పంతంగి శ్రీనివాసరావు, 9182203351