Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను పోయినప్పుడు
వస్త్రానికి బదులు
ఓ కాగితాన్ని కప్పండి
కవిత రాసుకుంటాను
సిరాబుడ్డినీ, పెన్నునొకదాన్ని
బ్యాగులో వుంచండి
మనసులో
ముల్లు గుచ్చుకున్నప్పటి పాటో
గాయపడిన గజలో
గుండెలోయలనుండి జాలువారొచ్చు
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను
పసుపూ-కుంకుమ పులిమి
భయానకంగా మార్చకండి
నన్నందరూ గుర్తుపట్టాలి మరి!
దండలతో మూసెయ్యకండి
నాకు ఎలర్జీ!!
ఆ రేకులతో ఏ దార్నైనా
మెత్తగా పరవండి
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నచ్చదు
సామాన్లేవీ పారేయొద్దు
అడిగిన వాళ్లకిచ్చేయండి
బ్యాండ్ వాళ్ళను
ఓల్డ్ మెలొడీస్ వాయించమనండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
టైమంటే టైమే!
మంగళవారమో! అమంగళవారమో!!
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
బడికి కబురు పెట్టండి
నే బతికిన క్షణాలు తలుచుని
వాళ్లు సెలవిచ్చుకుంటారు
దింపుడుకళ్లం దగ్గర
చెవులు గిల్లుమనేలా పిలవకండి
తలుచుకునేవారెవరో నాకు తెలుసు
డబ్బుకు ఇబ్బందక్కరలేదు
పక్కవాళ్ల కొట్లో ఖాతా ఉంది
అన్ని రోజులూ ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి!
మట్టిలో కప్పెట్టకండి
పురుగూ పుట్రా భయం!
కాస్త చూసి తగలబెట్టండే...
చుట్టుపక్కల మొక్కలుంటాయేమో!
గంధపు చెక్కలతో కాలడం కంటే
జ్ఞాపకమై పరిమళించడమే
ఎక్కువ నాకు
పనిలో పని!
నా నవ్వులూ కన్నీళ్ళు
ఆవిరైపోతున్న కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉన్నట్టుంటుంది
తనివితీరా విన్నట్టుంటుంది
- బైరి ఇందిర