Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడాదికోసారి వచ్చే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం తెలుగు నేలపై ఘనంగా జరగడం చూస్తుంటాం. ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలానికి తక్కువే ఉండదు. బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని యునెస్కో 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. ఈ లక్ష్యాలతో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలి.
మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది?
మన రాష్ట్రంలో మాతృభాష పరిస్థితి దినదిన గండంగా ఉంది. దీనికి నూరేళ్ల ఆయుష్షు పోయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
బడిలో పరిస్థితి ఎలా ఉంది?
పిల్లలు చదవడం, ఉపాధ్యాయులు బోధించడం ఏ మాధ్యమంలో ఉండాలి? ఇది మాతృభాషకు సంబంధించిన నిత్య జీవిత సమస్య. తరగతి గదిలో బోధనకు సంబంధించిన సమస్య. బోధనకు సంబంధించిన సమస్య అనడం కన్నా విద్య విజ్ఞానాలకు సంబంధించిన సమస్య అనడం సముచితం. విద్యా విజ్ఞానాలు మాతృభాషలోనే బోధించాలన్న అంతర్జాతీయ విధానాలకు విరుద్ధంగా మన రాష్ట్రంలో చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కస్తూరి రంగన్ మాతృభాషలోనే ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన కొనసాగాల్సిన అవసరాన్ని పదే పదే చెప్పారు. అత్యంత క్లిష్టమైన విషయాలను సుబోధకంగా చెప్పారు. అన్నమాచార్యుల వారు చెప్పినట్లు వెల సులభము, ఫలమధికము అన్నట్లుగా మాతృభాషలో విద్యాబోధన వల్ల కలిగే ఫలితాలను కస్తూరి రంగన్ విస్తృతంగా చెప్పారు. ఇది నేర్చుకోవడానికి సంబంధించిన సమస్య అని ఆయన చెప్పినా కూడా వీటన్నిటినీ పెడచెవిన పెట్టి మన దోవన మనం పోతున్నాం. అందువల్ల బడిలో మాతృభాష ఒక భాషాంశంగా మార్కులు తెచ్చుకునే సబ్జెక్టుగానే మిగిలిపోయే ప్రమాదంలో పడింది. భాషా పరమైన అంశంగా మారటం అనేది భాషకి గడ్డు రోజులు వచ్చినట్టు సూచించే మొదటి ప్రమాద సూచిక.
ఏలుబడిలో.. పరిస్థితి ఎలా ఉంది?
రెండవ అంశము నిత్య జీవితంలో ప్రజలు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని తెలుసుకునేందుకు వాటిని అనుసరించేందుకు, ఆలోచించేందుకు, ప్రశ్నించేందుకు వాళ్లు అత్యున్నతమైన లేదా అతి శ్రేష్టమైన హక్కుని కలిగి ఉంటారు. పాలనా వ్యవహారాలకు సంబంధించిన జీవోలు మొదలైనవన్నీ కూడా జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలో కూడా నిరాఘాటంగా భాషా ప్రయుక్త రాష్ట్రమని పేరుగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సాగుతున్న విషయం. మనం ఎవరం నిరూపించాల్సిన అవసరం లేదు. కోర్టులో కొన్ని నిత్యసత్యాలుగా భావించే అంశాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇవాళ ఫలానా తేదీ అని నిరూపించక్కర్లేదు. ఇవాళ ఫలానా ఏడాదని నిరూపించాల్సినా అవసరం లేదు. అలాగే తను మనిషి అని నిరూపించక్కర్లేదు. ఇలాంటివన్నీ కూడా ఎలాగా నిరూపించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాలన భాషలో కనుమరుగవుతున్న వృత్తాంతం కూడా మనకి కనపడుతోంది. ఉదాహరణకి ఒక అరడజన్ జీవోలు కూడా భాషలో తేలేని స్థితి మనకు ఉంది. మొత్తం రాష్ట్ర ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటివరకు తీసుకుంటే ఒక రెండు శాతం మించి జీవోలు ఇవ్వలేని దుస్థితి. మన పాలనా వ్యవహారాలన్ని ఇంగ్లీష్ వాడు ఉన్నప్పటికన్నా ఉత్సాహంగా మనం ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఈ రకంగా నిత్య జీవితాన్ని కూడా ప్రభావితం చేసే పాలన వ్యవహారాల్లో కూడా గండం వచ్చింది.
మూడోది న్యాయ వ్యవహారాలు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక చిన్న చిన్న సమస్యలు కూడా కోర్టుల ముందుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కోర్టులు - రెవెన్యూ కోర్టులు, న్యాయానికి సంబంధించిన కోర్టులు. రెండు రకాల కోర్టుల్లోని వ్యవహారాలు అంటే విచారణ దగ్గర నుంచి వాగ్మూల నివేదికలు చేయడం వరకు అన్నింటికీ మొదట ఇంగ్లీషులో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం తరపున పని చేసే పోలీసు యంత్రాంగంలో కూడా చాలావరకు నివేదికలు, విచారణకు సంబంధించినంతవరకు ఇంగ్లీషులోనే జరుగుతున్న విషయం మనకి స్పష్టంగా తెలుసు. అందువల్ల న్యాయ వ్యవహారాల్లో ముఖ్యంగా రైతులు కూలీలు నిరుపేదలు సాధారమైన చిక్కులు తెలియనటువంటి వారు, చదువుకున్న వారిలో ఉపాధ్యాయులు, అధికారులు కూడా న్యాయస్థానాల ముందు నీళ్లు నములుతూ నిలబడి నిర్వీర్యంగా, నిస్తేజంగా నిలబడాల్సిన దుస్థితి వస్తోంది. ఇది న్యాయ వ్యవహారాలకు సంబంధించిన విషయం.
నాలుగవది శాసన నిర్వహణ వ్యవహారాలకు సంబంధించిన విషయం.. శాసన నిర్మాణంలో ముఖ్యంగా శాసన నిర్మాణంలో జరిగే, శాసనసభలో ప్రవేశ పెట్టే చర్చలు తెలుగులో జరిగినప్పటికీ కూడా రూపొందించేటటువంటి చట్టం ఇంగ్లీష్లోనే రూపొందిస్తున్నారు. నిజానికి అధికార భాషా సంఘం తర్వాత ఇచ్చినటువంటి జి నాయర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సర్కులెట్స్లో చీఫ్ సెక్రటరీ పేర్కొన్నది శాసన నిర్మాణంలో బిల్లులు కూడా తెలుగులో ప్రవేశపెట్టాలి. కానీ తెలుగు కాపీని శాసన సభ్యులకు మాత్రమే ఇస్తున్నారు. అది అధికారిక కాపీ తెలుగు వాళ్లకు ఎక్కడా దొరకదు. ఏ తెలుగువాడైనా తనకు తెలుసుకోవా లనుకున్నా దానికి తెలుగు గెజిట్ కాపీలో దొరకు రాజ పత్రాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే ముద్రించబడి ఉంటాయి. శాసన నిర్మాణం అయినటువంటి బిల్స్ అన్ని కూడా ఇంగ్లీషులోనే వస్తూ ఉంటాయి. ఏదో దానికి సంబంధించిన నామమాత్రపు అనువాదాలు మాత్రమే ఉంటున్నాయి. దీన్ని ఎవరైనా పరిశీలించుకోవచ్చు. నిత్య జీవితంలో మాతృభాష ఈ రకంగా కనుమరుగవుతుంది.
గుడిలో పరిస్థితి ఎలా ఉంది?
తర్వాతది గుడి.. గుడిలో మనకి నవవిధ ప్రక్రియల గురించి ప్రధానంగా సంప్రదాయాల్లో చెప్తారు. వందనం, కీర్తనం, శ్రవణం ఇవన్నీ చెప్తారు. వీటిల్లో అన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి ఉదయం స్వామి వారి మేలుకొలుపు దగ్గర నుంచి సాయంత్రం పవళింపు సేవ పర్యంతం ఆరగింపు పవళింపు సేవ అన్ని జరిగేంత వరకు ప్రతి దానికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. మన పూర్వీకులు అందరూ కూడా దేవాలయాల్లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
ఇవాళ కూడా తమిళనాడులో శివాలయంలో తేవారంలు కృష్ణ ఆలయంలో పాశురములను పాడుతూ ఉంటారు. ఆయా సందర్భాల్లో సన్నివేశాల్లో కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోయి మొత్తం కేవలం సంస్కృతంలో శబ్దాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. భక్తులకు ఆధ్యాత్మికవేత్తలకు మమ అనుకోడానికి మాత్రమే పనికొచ్చే అంశంగా గోత్ర నామాలు చెప్పుకునే అంశంగా గుడి ఉంది. గుడిలో పాడే కీర్తనలు కూడా మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాయి.
రాష్ట్రం బయట తెలుగు పరిస్థితి ఏమిటి?
గతంలో ప్రవాస ఆంధ్రులకు వారి మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వారు ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇతర ఇరుగుపొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న తెలుగువారి పిల్లల చదువు సంధ్యల కోసం నిధులు కేటాయించడం మానేశాయి. ఇప్పటివరకు చెప్పినవన్నీ నిత్య జీవితంలో మాతృభాష విషయంలో ఎదురవుతున్న సమస్యలు.
అనువాదం.. అవసరం!
మరొక ప్రధానమైన సమస్య ఈ శతాబ్దానికే సమస్యగా ఉన్న విషయం అనువాదం. ఆధునిక విషయాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సహాయకారిగా ఉండేది అనువాదం. కొత్త విషయాలు ప్రజానీకానికి అందాలంటే ప్రత్యేకంగా అనువాద విభాగం ఉండాలి. పదకోశాలు తయారవుతూ ఉండాలి. మన దేశంలో ఇది జరగాల్సినంతగా జరగడం లేదు.
విదేశాలను చూసి నేర్చుకోలేమా?
ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. చైనాకు సంబంధించిన ఒక విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఒక ప్రొఫెసర్ ఒక కొత్త అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ చైనా విద్యార్థిని ఉద్దేశించి ''ఈ విషయం చాలా కొత్తది! బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు'' అని రెండు మూడుసార్లు అనేసరికి ఆ చైనా విద్యార్థి ''లేదండి! ఈ విషయం మాకు ముందే తెలుసు!'' అన్నాడు. ఆ ప్రొఫెసర్ ఆశ్చర్యపోయి ''ఇది ఎలా సాధ్యం?'' అని అడిగాడు. దానికి ఆ విద్యార్థి ''ఆ అంశానికి సంబంధించి అనువాద గ్రంధాలు మా భాషలో ఉన్నాయి'' అని చెప్పాడు. తీరా చూస్తే ఆ విషయం లోకంలోకి వచ్చి గట్టిగా వారం కూడా కాలేదు. అంటే చైనా వాళ్లు అనువాద విషయంలో అంత వేగంతో ఉన్నారు అని అర్థమవుతుంది. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో చైనా డాక్టర్లు ఇంజనీర్లు ముందంజలో ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ఒక కొత్త విషయం ప్రపంచంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అది చైనా భాషలోకి అనువదింప బడటం ఆశ్చర్యకరం. ఈ విషయంలో మనం వెనకబడి ఉండటానికి కారణం దీన్ని ఒక సమస్యగా గుర్తించకపోవడం. ఇది అభివృద్ధికి దోహదం చేస్తుందన్న విషయాన్ని గమనించకపోవడం. ఏ ప్రభుత్వాలు దీన్ని గట్టిగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఆంగ్లంపై మోజు తగ్గేదే లేదా?
నిత్యజీవితంలో కాకుండా అనువర్తిత విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రదర్శన కళలు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం మొదలైన వాటి విషయంలో మహానగరం, పల్లెటూరు అనే తేడా లేకుండా పరిచయ వాక్యాలన్ని ఆంగ్లంలోనే కొనసాగడం గమనించాలి. కళాకారులు కవులు పాడే పాట, చెప్పే కవిత తప్పించి మిగతా అంశం అంతా ఆంగ్లంలోనే కొనసాగుతోంది.
సమాజంలో కాస్త గొప్పవారిగా పేరుపొందిన వ్యక్తులు పరస్పరం కలుసుకున్నప్పుడు, వారు వేదికల మీద మాట్లాడేటప్పుడు కచ్చితంగా ఆంగ్లంలో మాట్లాడితేనే గౌరవం అన్న భావన ప్రబలంగా ఉండి పోయింది. దాదాపు అర్ధ శతాబ్దం కిందట పానుగంటి లక్ష్మీ నరసింహారావు స్వభాష పేరుతో వెలిబుచ్చిన ఆవేదన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో కూడా వేదిక మీద ఇచ్చే ప్రదర్శనలు, తల్లిదండ్రులతో జరిపే సంభాషణ ఆంగ్లంలోనే కొనసాగుతోంది.
నిత్య వ్యవహారంలో తిష్ట వేసిన ఆంగ్లం!
వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలు, సంపన్నులు.. ఇలా అన్ని రకాల కుటుంబాలలో రోజువారి వాడకంలో ఉన్న పదాలు ఆంగ్లమయం అయిపోతున్నాయి. అన్నం బదులుగా రైస్, నీళ్లు అనడానికి వాటర్, ఉప్పు అనడానికి సాల్ట్ ఇలా ఎన్నో పదాలు ఇంగ్లీష్ వే వాడుతున్నారు.
ఇలా జరుపుకుందామా?
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? కేవలం ఒక వేడుకగా జరుపుకోవాలా? ఒక నిమిషం తెలుగులో మాట్లాడటం, తెలుగు వైభవాన్ని కీర్తిస్తూ కొన్ని పద్యాలు గేయాలు ఆలపించుకోవడం.. ఇంత మాత్రమేనా? నిర్మొహమాటంగా చెప్పాలంటే ఇది ఎలా ఉందంటే పనసకాయ దొరికింది కదా అని తద్దినం పెట్టినట్టుగా ఉంది.
ఇవన్నీ చూస్తుంటే ఇటీవలే స్వర్గస్తులైన విశ్వనాథ్ 'ఓ సీత కథ' సినిమాలోని ఒక సన్నివేశం గుర్తొస్తోంది. అందులో రమాప్రభ పాత్ర అమాయకమైనది. పక్క వాళ్ళ ఇంట్లో గారెలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళింట్లో వారి తండ్రి తద్దినం కాబట్టి. అప్పుడు ఆ అమ్మాయి మన ఇంట్లో కూడా తద్దినం ఎప్పుడు పెట్టుకుంటామో! నాన్న ఎప్పుడు పోతారో అనుకుం టుంది. ఇప్పుడు జరిగే, జరుగుతున్న భాషా దినోత్స వాలు కూడా ఇలాగే ఉన్నాయి. వీటివల్ల ఏ ప్రయోజనం ఒనగూరదు. కనీసం ఈ ఒక్కరోజైనా మాతృభాష ఎదు ర్కొంటున్న గండాలను తప్పించడానికి ఏం చేయాలి? సమస్య కళ్ళల్లోకి నేరుగా ఎలా చూడాలి అని దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.
నిజానికి భాష ప్రాతిపదికగా ఒక రాష్ట్రాన్ని కోరుకున్న మొదటి రాష్ట్రం మనది! ఇటీవలి చరిత్రలోకి తొంగి చూసినా ఆ నిజాలన్నీ తెలుస్తాయి. కానీ మనం చరిత్రను నేర్చుకోం! చరిత్ర నుంచి నేర్చుకోం అని భీష్ముంచుకుని కూర్చున్న వారిని ఏం చేయగలం?
రాజు కన్నా మొండివాడు బలవంతుడు అంటారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు రాజు, మొండివాడు ఒకరే కావడం విశేషం! ప్రాప్తం ఉన్న తీరానికి పడవ పోతోంది.
- ముక్తేశ్వరరావు
విశ్రాంత ఐఏఎస్ అధికారి