Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా బాగానే వుంది -
గాయపడటానికి ఈ దేహం నాది కాదు
కోల్పోవడానికి ఈ సంపద నాది కాదు
గుప్పిట్లో పట్టుకున్న క్షణాలు
జ్ఞాపకాలుగా జారిపోతుంటాయి
నువ్వు నేను, నీది నాది అనుకున్నవన్నీ
కన్నీటి చుక్కలుగా ఆవిరై పోతుంటాయి
అన్నీవుండి అంగ వస్త్రాలు కనుమరుగై
మరుగున వున్న నగత్వం ఎదురుపడినపుడు
అంతా సహజంగానే వున్నట్టనిపిస్తుంది !
చూపుకు దూరమైన క్షణాన అల్లికలు
మరిచి పోవడం సహజమే
చూపు దూరమైన క్షణాన దగ్గరితనం
మరుపు రావడం సహజమే
సహజత్వాలు సహజంగా వుండడం కూడా బాగానే వుంది
అసహజత్వాల గుంపులో సహజత్వం
కాటగలిసిపోవడం కూడా సహజమే..
అంతా బాగానే వుంది
నాదనుకున్న నేల మరుభూమికి మారి నాదవుతున్నందుకు
అస్తిత్వాలకు వారసత్వాలు దారులు వేసి మరలుతున్నందుకు - బాగానే వుంది
విలాసాలు నావనుకున్నప్పుడు విలాపాలు స్వంతమవుతుంటాయి
స్వంతమనుకున్న నావి పరాయీకరణంగా రూపుదాల్చుతూ వుంటాయి
ఐనా, నేను నేను గానే వున్నాను; నువ్వు నువ్వుగానే వుండు
సమయానికనువుగా పిలుపులో స్వరం మారినా,
నా పాత పేరులోనే తియ్యదనం వుంది
కొత్త బంధాలు వెలుగుతూ ఉద్వేగపరిచినా,
సంధ్యా సమయంలో కాంతిని కోల్పోతూ వుంటాయి
పచ్చని నారుమడి నుండి బీడు భూమిలోకి నెట్టివేయబడుతున్నా -
అన్నీ సహజంగానే వున్నట్టు
భ్రమలు ఆవహిస్తూ వుంటాయి
ఐనా బాగానే వుంది .. అంతా బాగానే వుంది
ప్రయాణంలో చిట్టచివరి క్షణం
శిథిలాలై మిగిలిన పురాస్మృతులతో సమాధిలోకి వెళ్లడం
చాలా చాలా బాగానే వుంది
- డా. రూప్ కుమార్ డబ్బీకార్, 91778 57389