Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎత్తైన
ఆ భూరుహాల నీడల దాపున్నే
నిద్ర-
మృదువైన
ఆ పూల బాసల ఎద మీదనే
తూనీగల వేడిముచ్చట్లు-
సొగసైన
ఆ కలలపున్నమి తలాపున్నే
ఎర్రకవాతు-
నడవాల్సిన ప్రాగ్దిశను మోస్తూ
సుతారమైన ఆ గాలి లయల్లోనే లోయల్లోనే
ఉరిమిన వసంత మేఘం-
ఒకరిద్దరం కాదు
వందలు వేలు
చేతుల్లో జెండాలతో
ఛాతీ మీద ఆశయాలతో
గొంతు నిండా నినాదాలతో
కర్కశత్వాన్ని
అశక్తం చేసే
అమరత్వం సాధించే పొలిమేర చేరుకున్నాం
మనుషుల పటం రూపుదాల్చిందిక్కడే-
అనుకున్నట్టే తెల్లవారేది
పంచుకున్నట్టే
ఎవరి పౌరుషాన్ని
వాళ్లు భుజాలకెత్తుకున్నాం
ఎవరి కర్తవ్యాల్ని
వాళ్లు వీపున వేసుకున్నాం-
ఒక్కో బృందం
ఒక్కో దిక్తటికి
ఒక్కో ఆవేశం
ఒక్కో కాంతి సంవత్సానికి
అప్పుడు చూడాలి
వెనుక నుంచో ముందు నుంచో
పక్కల నుంచో పైనుంచో వేకువ అంచునుంచో
'వాళ్లు గెలుస్తున్నారు'అనే
ధీర తటిల్లతాంత వాక్యం
ప్రతి నాలుక మీదా
ప్రకృతి నుదురు మీదా
జాగృత లిపి-
పొద్దు నెత్తిమీదుంది
ఎక్కడా ఏదీ గురి తప్పకుండా గతి మారకుండా
కోటను ఎక్కాం
కొమ్ముగొట్టాం-
మాపుకు ముందో మహత్తర సన్నివేశం
అంతఃపురం తలుపులు బార్లా తెరచుకున్నాయి
అహంకారం శీర్షాసనం వేసింది
దురాగతం గుండె వ్రయ్యలయ్యింది
చరిత్రకు కొత్త పుటను కుట్టింది కలం
కళలకు గజ్జెకట్టాయి ఊర్లు-
వెనుకట ఎప్పుడో చార్వాకుల కాలం నాడు
కాలిబాటలో పురుడు పోసుకున్న నెత్తుటిపాట
బడిపిల్లలకో నెమలీక అయ్యింది
ఆ ఊరేగింపుతో
భూమి
సామాన్యుడి చుట్టూ తిరగడం మొదలైంది-
మా తాత చెప్పిన
ఈ ఒక్క కతే ఇంత బాగుంటే
ఇంకెన్ని కతలు
చెట్ల కింద తపస్సులో కూర్చున్నవో-
అభివృద్ధి మాట అటుంచితే
చెట్లను కూలుస్తుంటే
నాకెందుకో
చరిత్రను కూలుస్తున్నట్టే అనిపిస్తుంది.
- డా.బెల్లి యాదయ్య, 9848392690