Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరూ ఎవరికి సహకరించరు గానీ
ఎవరికి వారు సహకరించే వాళ్ళను సమకూర్చుకుంటారు.
తన లోపని దాన్ని వాళ్ళతో పంచుకునేట్లు ప్రవర్తిస్తారుగానీ
లోపలి దానికి వెలుపలి ప్రతినిధులుగా మారుతారు
అన్ని విధాల శాయశక్తులా
వాళ్ళ వాళ్ళ భావనా బంట్రోతులై పోతారు
కొంతకాలం వాళ్ళని స్నేహితులంటారు గానీ
తర్వాత తర్వాత శిష్యులై పోతారు
ఆ తర్వాతే ప్రియశిష్యులుగా రూపమెత్తుతారు
ఈ తొమ్మిది పాదాలు చాలు మువ్వా శ్రీనివాసరావు కవిత్వానికి ఎంతటి క్యాన్వాస్ ఉందో తెలుస్తుంది. కవిత్వం అంటే పదాడంబరం కాద. అలంకారాలు, ప్రతీకలు కాదు. కవిత్వంలో కవిత్వం ఏతాత్వికతను విప్పి చెబుతుందో అదే కవిత్వం. మువ్వా అచేతనుడు కాదు. శ్రీరంగం శ్రీనివాసరావు నుంచి మువ్వా శ్రీనివాసరావు రూపుదిద్దుకున్న కవి. డొంక తిరుగుడు లేని కవి. నిబద్ధంగా మొదలైన కవి. లోలోపల భావోద్విగ బలం ఉండబట్టే గొప్పగా గెటాన్ అవుతున్నాడు. లోపలి కవితా ప్రపంచాన్ని సువిశాలం చేసుకోదగిన సృజనాత్మకత ఔన్నత్యాన్ని విస్తారంగా పెంచుకుంటూ వస్తున్నాడు. చాలా ఏళ్ళ క్రితం దేవిప్రియ వెంట రమ్మంటే శమ్మం వెళ్ళాను. ఆ రోజు తొలిసారిగా మువ్వా శ్రీనివాసరావును చూసాను. నాకు ఖమ్మమంటే ఒక అఫ్సర్ ఒక సీతారాం. ఒక ప్రసేన్ తప్ప మరొకరు తెలియదు. మువ్వా నేటికి వారితోనే కాదు అనేక కవులతో విస్తరిస్తూ వచ్చాడు. మువ్వా కవిత్వం తప్ప ఆయన పెద్దగా తెలిసిన వాణ్ణి కాదు. నేటికి కూడా ఆయన కవన కళతో ఉన్న బంధమే ఎక్కువ. ఆయనకు ఎన్ని బంధాలు సాహిత్య వారసులతో ఉన్నాయో తెలియదు.
చలం, శ్రీశ్రీ ఉద్యమాలు ఎన్ని విస్తరించినా విశ్వనాథ కాలం తిరగబడుతూనే ఉంది. కుబుసం విడిచిన సహస్రఫణ్‌గా రూపొందుతుంది కదా! అగ్రరాజ్యాల ధనసర్పం దానికి తోడవుతుంది కదా! ఈ సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితిని తనదైన నిఘా గుణంతో వ్యంగ్యంగా అధిక్షేపిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
అప్రమత్తంగా ఉందాం
అందిన కాడికి ఏసుకుందాం
పేరు పాలకులకు
పెత్తనం మాత్రం ఎల్లవేళలా మనకే
విముక్తి వియ్యంకులు అయితీరాలి
ప్రపంచమంతా విస్తరించిన ధనధిపత్య క్రూరత్వాన్ని ఎత్తి చూపడంలో బలమైన వ్యంగ్యం ఉంది. మువ్వా ఇంటి పేరు వ్యంగ్యం కావచ్చు. పానుగంటి సాక్షి సంపుటాలను నమిలి జీర్ణం చేసుకున్న కవి కావచ్చు.
శ్రీనివాస్ ఒకే విధమైన కవిత్వం రాయడు. అరసం, విరసం, స్త్రీవాద, దళిత వాద, బహుజనవాద రంగులన్నీ ఆయన కవిత్వంలో ప్రకాశవంతంగా అగుపిస్తాయి. ఆయనలో కవిత్వం మొక్కలా చిగురి స్తుంది. మారాకులు వేస్తుంది. కాలం వెంట నడుస్తుంది. మనుగడ సాగిస్తుంది. సముద్రంలోని అలలు కొన్ని తన అంతర్భాగంలో తల దాచుకుంటాయి గానీ మరికొన్ని నేలను ముద్దాడి అదృశ్యమవుతాయి గానీ మనలో ఎప్పటికప్పుడు దృశ్యమానమవుతున్నట్లే మువ్వా కవిత్వం ఉంటుంది. కొన్ని అలలు - ఒడిసి పట్టుకుని సంభాషణ కవిత్వంలో దర్శనమిస్తాయి. ఆ దర్శనమిచ్చే కవిత్వంలోని కొన్ని కొన్ని పాదాలు మనలో సరికొత్త భావనకు స్ఫూర్తినిస్తాయి.
రెండు చేతులతో శ్రామికులు ఏకమైతే తప్ప పనితనపు నైపుణ్యం ప్రపంచానికి తెలియదు. శ్రమ సౌందర్య పూల పరిమళ గాలిలో ప్రపంచం నడవాలి కదా! ''మనిషిని మనిషిగా మార్చేయ్యడానికి ఎవరైనా నాలుగు కవితా వాక్యాలు ఇస్తారా'' అని అడుగుతాడు కవి. ఆయనను మనిషిని మనిషిగా మార్చే కవన గుళికలు ఉన్న కవిగా నేను తప్పక చెబబుతాను. సగం వూరు నిద్రపోకుండా పైశాచిక భాషని అనువదిస్తున్నదన్న స్పృహ కవికి ఉండబట్టే రైతు సేద్యగుణం ఆయన కవన సేద్యానికి ఉంది. చాలా కవితలు ప్రజలెత్తిన బోనంలాగే ఉన్నాయి. కాలం కన్నీళ్లు ఒక రకంగా లేవు. దొంగ కన్నీళ్ళే అందరి ప్రశంసలు పొందుతున్న కాలం కదా! సగటు మనిషి కన్నీళ్ళను గ్లోబల్ గ్రామం చూరుకింద కుంభవృష్టిలా కురుస్తున్నా పట్టించుకోని యాంత్రికతను బద్దలుకొట్టే చింతబరిగెల్లాంటి కవితా విల్లంబులు ఆయన దగ్గర ఉన్నాయి. పోగొట్టుకున్న దాన్ని గుర్తించడంలోనే కాదు పొందుతున్న దాంట్లో ఏది సున్నితమైందో సువిశాలమైందో చూపుతాడు.
శ్రీనివాస్ కవితలు నన్నెందుకో ప్రేమతో పలకరిస్తాయి. బాల్యం అక్కున చేర్చుకుంటుంది, సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల విధ్వంసమవుతున్న జీవితం ఆలింగనం చేసుకుంటుంది. ఆయన కవిత్వంలో ప్రజా వ్యవస్థ ఉంది. దాన్ని దిగమింగే వ్యవస్థ ఉంది. బాధ్యతా రాహిత్యంగా దిగమింగే వ్యవస్థ విధ్వంసాన్ని ఎత్తిచూపడంలోని సృజనాత్మక భావోద్విగత పాఠకుని హృదయానికి విడమరిచి చెబుతుంది. సంపన్నుల కాలుష్య భూతాన్ని ఎందెందు ఎంత వుందో విడమరిచి చూపుతుంది. గతం మీది కన్నా వర్తమానం మీదే దాని అమానవీయతను సంఘటనలు సంఘటనలుగా సందర్భాలు సందర్భాలుగా కథనం చేయడం వల్ల పాఠకుని హృదయం జూలు దులుపుతుంది.
శ్రీనివాస్‌కు కవిత్వం తెలుసు. యాక్టివిస్టుగా జీవించాల్సిన తత్త్వం తెలుసు. ఆవేశాల మిశ్రమంలోంచే సహజ రంగుల్ని వెతుక్కునే బుద్ధినీ హృదయాన్ని తాత్త్విక గుణానుభూతిని వెతుక్కునే స్వభావాన్ని మనలో నింపాలన్న ఆయన ప్రయత్నం నాకెందుకో నచ్చింది. భావానుభవ అమృతాన్ని రోజూ సేవించే ఛారులాగా ఆయన కవితతు తాపుతాయి. వెలుగుల మెత్తదనం అల్లుకుపోతుంది. కొన్ని కొన్ని పద విరుపులు నాకు అర్థంకాలేదు గానీ కొన్ని కొన్ని ద్రవీభూతం చేశాయి. కవి తనకేమీ తెలియనట్టు రాస్తాడు గానీ ఏదో నేర్చుకోమన్నట్టుగానే నేర్పుతుంది ఆయన కవిత్వం. మువ్వా కవితలు కొన్ని సాగదీసినట్లు కాసేపు అనిపిస్తుంది కానీ ఏదో భావజాల శక్తేదో పరిపూర్ణత వైపు నడుపుతుంది. రంగనాయకమ్మ శైలిలోని సాగదీసే తత్త్వం శ్రీనివాస్ కవిత్వంలో ఉందేమో మనసుపెట్టి పట్టుకుంటే మంచిది. సాధారణ పాఠకునికి సాగదీసే క్యాన్వాస్ అవసరమేమో గుర్తించాలి.
మువ్వా రాసిన దయ్యాల మాణిక్యమ్మ ముసలమ్మ మరణం రాసిన కట్టమంచి గుర్తుకువచ్చాడు. అలా జ్ఞాపకం రావడం వల్లే ఆనుకుంట నేను మాణిక్యమ్మ పనితనంలో ఈదగలిగాను. కుందుర్తి, శీలా వీర్రాజు వచన కథా కావ్యాలగుణం శ్రీనివాస్‌లో ఎగిరి గంతేసినట్లుంది. బీజప్రాయమైన కథను తీసుకుని ప్రబంధ కవులు వర్ణనలు చేసినట్లే మాణిక్యమ్మ లేదు గానీ శ్రీశ్రీ భిక్షువర్షీయసి లాగా ఉందనిపిస్తుంది. మాణిక్యమ్మ గురజాడ పూర్ణమ్మకు వారసురాలు. గురజాడ వస్తువు వేరు. రూపం వేరు. అలాగే శ్రీశ్రీ భిక్షువర్షీయసీ వస్తువు వేరు. వారి కవితల పక్కన నిలబడదగిన కవిత దయ్యాల మాణిక్యమ్మ అని చెప్పాలని ఉంది. కవి 'దయ్యాల మాణిక్యమ్మ కాదామె, ధైర్యాల మాణిక్యమ్మ' అంటూనే 'నేనిప్పుడు అందరికీ పంచుతోంది ఆమె నాకిచ్చిన ప్రేమలో వాటాయే కదా' అంటాడు. ఇది సాధారణ సరళ పాదాలే గానీ వీటిలో కవిత్వం గుభాళించింది. మాణిక్యమ్మ మనుమడి ప్రేమలోని వాటాను ప్రపంచానికి పంచడం కాదు ప్రతి మనుమడు చేస్తున్న పనీ చేయాల్సిన పనీ అదే మరి.
శ్రీనివాస్ అమ్మ మీదే కాదు భార్య మీద అంత బాగా రాసిన కవిత 'గెలుపంతా ఆమెదే' నన్న కవిత. స్త్రీవాదులు కవికి తప్పక అభిమానుల్ని చేసే కవిత. 'నన్ను నేను ఎన్నిసార్లు భాగించుకున్న స్వార్థ శేషం మిగుల్తూనే వుంద'న్న భావన ఆధిపత్య పురుషుల్లోంచి తొలిగిపోతేనే దాంపత్య బంధాలు గట్టిపడతాయనే హెచ్చరిక కూడా ఈ కవిత చేసింది.
శ్రీనివాస్ వైరాయణం రామాయణమంత విస్తృతమైన వచన కవితా శతకం లేదా శతక కావ్యం. ఇది ఆంగ్లంలోకి అనువాదమైతే బాగుండు. ప్రపంచ కవుల్ని కదిలించిన కరోనా మీది కవిత్వం ఇది. దేవీప్రియ రోజుకో రన్నింగ్ కామెంట్రీ రాసాడు. ఆయన చెల్తే చెల్తే లాంటిదైనా ఆయన కామెంట్రీలు వేరు. శ్రీనివాస్ కరోనా కామెంట్రీలు వేరు. కవి దేశం కాని దేశం వెళ్ళి లాక్డౌన్లో చిక్కుకుని చేసేది ఏమీ లేక రోజూ రోజూ 'కరోనా... జన్మమేనీది' అంటూ రాసి దాదాపు మూడు వేల పాఠకులకు వాట్సాప్ ద్వారా దాని తాలుకు కలిగిన సంభాషణా త్మక సవ్వడిని ఎత్తిచూపాడు. ఏ కావ్యం సంపాదించుకోలేని పాఠకుల్ని వైరాయణం సంపాదించుకుంది. కరోనా కవన ధ్వని సంభాషణలో కవి తంతా సాగింది. క్యాన్వాస్ విస్తృతంగా వ్యాపించింది. ఒక చోట 'ఆకాశం రెక్కలు లేని వలస పక్షి. భూగోళం పాదాలు లేని ప్రయాణికురాలు. సూర్యుడు కళ్ళు లేని చూపుకాపరి. చంద్రుడు చర్మం లేని స్పర్శ జ్ఞాని. అన్నీ ఉన్నాయనుకున్న మనుషుల నిప్పుడు అరుగులు దాటి, అరడుగు వెయ్యలేని అంధకారంలోకి నెట్టేస్తుంది కదా! కరోనా... కారణ జన్మమే నీది' అంటూ తోచిందల్లా రాసాడు గానీ అందరికీ తోచింది అదే మరి. కవి కదా! ఈ వచన కవితా శతకాన్ని ముగిస్తూ- 'నదులు కన్న కలలలు పంట పొలాలలో; కవులు కన్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి. మా శేషేంద్ర కల నిజమైతే నేడో రేపో కనబడకుండా కొట్టుకుపోతావు. ఎంతయినా కరోనా... మారణ జన్మమే నీది' అంటాడు. ఒక వ్యాక్సిన్ విఫలమైన వేళ వేలకొలది ప్రభవించును. కరోనా నీవు మరణించక తప్పదు అంటాడు. ఒక్కో వచన కవితా శతక పద్యం వేమన శతక పద్యాలకు సమీపమైనవే.
కవి నిత్యం ముల్లకంచలను దాటే శక్తినీ సమాజాన్ని పరిశుభ్రం చేసుకునే నైపుణ్యాన్ని అందించాలి. కవి సూర్యుడి లాంటి వాడు. సామాజిక చీకటిలోయల్లోకి వెలుగుల్ని ప్రసరింపచేయాలి. శ్రీనివాస్ కవిగా సఫలీకృతుడవుతున్నాడనీ భావిస్తున్నాను. ఆధునిక సమస్త వ్యామోహాల కాలుష్యాల నుంచి తట్టుకునే శక్తినీ భ్రమల ప్రపంచాన్ని ధిక్కరించే సాహసాన్నీ నిరంతరం స్వేచ్ఛగా నిర్భయంగా మునుముందుకు నడిచే యోధుని నడకనీ మరింత అందుకుని పరిణత కవిగా సాగాలని చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పాలనిపిస్తుంది. వస్తు ఐక్యతలోను ఊహాశక్తిలోను భాషలోను నిర్మాణ సామర్థ్యంలోనూ కవిత్వపు ఎత్తుగడలోను, ప్రతీకల్ని వాడడంలోనూ నడకలోనూ ముగింపులోనూ రాబోయే కాలానికి సైతం నిలబడే కవిత్వం రాయాలని ఆకాంక్షిస్తున్నాను.
- డా. నాళేశ్వరం శంకరం, 9440451960