Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం కన్నా అనువాదం గొప్పగా ఉండటం మంచి దేనా? అనువాదకునికి వచ్చే ప్రశం సలలో, అనువాదం అనువాదంలా లేదు మూలంలాగానే ఉంది అనేది అత్యంత సంతృప్తికరమై నది. మూలంలోని ఆత్మ (spirit) అనువాదంలో ప్రతిబింబిత మైంది, అనువాదం చాలా సాఫీగా హాయిగా సాగింది, అనువాదం గొప్ప గా ఉంది... మొదలైనవి కూడా అనువాదకునికి ఆనందాన్నిచ్చే ప్రశంసలే. నిజా నికి ఈ మూడింటిలోని సారాంశం మొదటిదైన 'అనువాదంలాగా లేదు' అనే వ్యాఖ్య కు చాలా వరకు వర్తిస్తుంది. ఇక అనువాదం మూలం కన్నా గొప్పగా ఉంది అనే ప్రశంసకు అనువాదకులు పొంగిపోతారు. కానీ నిజా నికి అది అనుచితమైన లేదా దోషభూయిష్ఠమైన (improper or defective) అనువాదాన్ని సూచిస్తుంది. కాబట్టి, వాస్తవానికి అటువంటి వ్యాఖ్య అనువాద కుడిని చింతింపజేయాలి!
మూలం ఏ స్థాయిలో ఉంటే అనువాదం అదే స్థాయిలో ఉండటం (అంటే అంతే గొప్ప గా ఉండటం) అవసరం. కొంచెం అటుయిటుగా ఉంటే ఫరవాలేదు కాని, ఒక ఔత్సాహిక (amateur) కవి రాసిన దాన్ని చేయి తిరిగిన సుప్రతిష్ఠిత కవి రచన స్థాయికి తీసుకువెళ్లే విధంగా అనువదించకూడదు. స్వర్గీయ నోముల సత్యనారాయణ ఈ వ్యాస రచయితతో ''మీరు మూలం కన్నా బాగా అనువదిస్తున్నారు. అది మంచి విషయం కాదు'' అని రెండు మూడుసార్లు చెప్పారు. మరొక పేరు మోసిన అనువాదకుడు కూడా ఒక జూమ్ మీటింగ్‌లో అనువాదకులం దరినీ ఉద్దేశిస్తూ ఇదే మాట అన్నారు. వీరిద్దరి ఉద్దేశంతో నేను ఏకీభవిస్తున్నాను.
ఇక్కడ శీర్షిక నుంచి కొంచెం పక్కకు జరిగి, అనువాదం గురించి సాహితీపరులలో ఉండే ఒక అభిప్రాయాన్ని క్లుప్తంగా చర్చించాలనుకుంటున్నాను. అదేమిటంటే, వచనాన్ని అనువదిం చడం కంటె కవిత్వాన్ని అనువదించడం కష్టమైన పని అని అంటుంటారు చాలా మంది. జనరల్‌గా చూస్తే ఈ వ్యాఖ్య సరైనదే. కవిత్వంలోని భావ సౌకుమార్యాన్ని, భావోద్వేగాన్ని, భావశబ్ధలతను తర్జుమా చేయడం అంత సులభంకాదు. పైగా మూలకవి తాలూకు మూడ్‌ను, టోన్‌ను, స్టైల్ ను(శైలిని) లక్ష్యభాషలోకి కచ్చితత్వంతో తీసుకు పోవాలి. ఇది సులభమైన విషయం కాదు. ఎందుకంటే, కవితా పంక్తులు సంపూర్ణ వాక్యాలు కావు. వాటిలో కొన్ని సార్లు కర్త, కర్మ లేదా మరి కొన్ని భాషాంగాలు ఉండకపో వచ్చు. నిజానికి ఈ అంశమే కవిత్వా నికి శోభను చేకూరుస్తుందని చెప్పవచ్చు. కవితా పంక్తి సంపూర్ణ వాక్యం కాకపో వడమనేది వ్యాకరణ పరంగా అనువాదాన్ని సులభ తరం చేస్తుంది. కానీ దీనికి విరుద్ధం గా, వచనంలో ఉండే సంపూర్ణ వాక్యాలు వ్యాకరణపరమైన కచ్చితత్వాన్ని డిమాండ్ చేస్తాయి. దాన్ని వంద శాతం కరెక్టుగా నెరవేర్చడం సులభం కాదు. లక్ష్య భాష అనువాదకుని మాతృభాష కానప్పుడు ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి ఉదాహరణలుగా ఎన్నో సూక్ష్మాంశాలను చూపవచ్చు. At - in; ago - back; each - every; that - which; talk to - talk with; from - since - for; agree to - agree with; every day - everyday; so - hence - therefore; alright - all right; already - all ready; overwhelmed by - overwhelmed with; tired of - tired with; came by - came on - came in; send by - send through; sometime - some time - sometimes... వీటిలో ఏది సందర్భం ప్రకారం సరైనదో చెక్ చేసుకోవాలి. ఇట్లాంటివి వందకు పైగానే ఉంటాయి! ఏదో ఒక పదాన్ని పెట్టి రాస్తే వచనంలో వంద శాతం కచ్చితత్వం రాదు. ఈ సమస్య కవిత్వానువాదంలో అంతే తీవ్రంగా ఉండదు. కారణం మళ్లీ అదే. కవితా పంక్తులు సంపూర్ణ వాక్యాలు కాకపోవడం. దీనికి తోడు ఆంగ్ల కవిత్వంలో వ్యాకరణ దోషాలను వచనంలోని దోషాలను తీసుకున్నంత సీరియస్‌గా తీసుకోరు విమర్శకులు. అనువాదకుడు కూడా కవి అయి వుంటే అతనికి కవిత్వానువాదంలో ఇబ్బంది కొంచెం తక్కువగా ఉండే అవకాశముంది. వ్యాకరణపరమైన కచ్చితత్వాన్ని కవిత్వంలో కన్న వచనంలోనే ఎక్కువ ముఖ్యమైనదిగా భావిస్తారు ఆంగ్లభాషలో. కవిత్వం లో సౌందర్యాన్ని సాధించడం కోసం సంక్షిప్తీకరణ (abridgement or shortening) అవసరం కనుక - అంటే పంక్తులు సాధ్యమైనంత తక్కువ నిడివిని కలిగి ఉండాలి కనుక - వ్యాకరణాన్ని వచన రచనలో పట్టించుకున్నంతగా కవితా రచనలో పట్టించుకోరు. ఉదాహ రణకు ఒక కవితా పంక్తిలో ఒకే రకానికి చెందిన నామవాచకాలు గానీ విశేషణాలు గానీ వరుసగా వస్తే, చివరి పదానికి ముందు and పెట్టకపోయినా దాన్ని సీరియస్‌గా తీసుకోరు. ఈ కవితా పంక్తిని పరిశీలించండి: He was angry, upset, sad.కానీ దీన్నే వచనంలో రాసినప్పుడు లేదా అనువాదంగా పొందు పరచినప్పుడు, upset తర్వాత కామా, and తప్పక రాయా ల్సిందే. రాయకపోతే అది భాషాదోషం కిందికి వస్తుంది. అదే విధంగా articlesను ముఖ్యంగా The ని (దీన్ని బ్రిటీష్ ఇంగ్లిష్ ప్రకారం definite article అనీ, అమెరికన్ ఇంగ్లిష్ ప్రకారం definite article అనీ అంటారు) కవితలో కచ్చితంగా
పాటించాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు దాన్ని/వాటిని మానుకోవచ్చు. కానీ వచనంలో మాత్రం తప్పక రాయాలి. ఆంగ్ల భాషలో The వాడకం అన్నింటికన్న కష్టమైనది. దీని గురించి సి.పి.బ్రౌన్, ''తెలుగు ప్రాంతంలో The ని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో పదివేల మందిలో ఒక్కరికి కూడా సరిగ్గా తెలియదు'' అన్నాడు. ఇది ఈ వ్యాసరచయిత విషయంలో సైతం వాస్తవం. ఆయన అలా అన్నందుకు మనం ఉడుక్కోవాల్సిన అవసరం లేదు!
ఇంకొక చర్చనీయమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. అదేమి టంటే, కొన్ని రచనలు అనువాదానికి లొంగవు అనే అబిప్రాయం. దీన్ని మొన్నమొన్నటి దాకా ఎక్కువ మంది ఖండించ లేదు. కానీ ఇప్పుడు ఖండిస్తున్నారు. అనువాదకునికి సత్తా ఉంటే ఏ రచననైనా చాలా వరకు సంతృప్తికరంగా అనువదించవచ్చు అనే అభిప్రాయం రోజురోజుకు మరింతగా బలాన్ని పుంజుకుంటోంది. జేమ్స్ జాయిస్ ఇంగ్లిష్‌లో రాసిన Ulysses నవల చైతన్య స్రవంతి (Stream of Consciousness) శిల్పంలో ఉంది. దీన్ని అనువదించడం కష్టం. కానీ ఈ నవల ఫ్రెంచ్, చైనీస్ మొదలైన ఎన్నో భాషలలోకి అనూదితమైంది. మరి అది ఎలా సాధ్యమైంది? ఈ మధ్యనే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను పొందిన గీతాంజలి శ్రీ నవల రేత్ సమాధి. దీన్ని ఇంగ్లండుకు చెందిన Daisy Rockwell ఆంగ్లంలోకి అనువదించారు. అప్పట్నుంచి అనువాదం గురించిన చర్చలు ఇంటర్నెట్లో పుంఖానుపుంఖంగా వెలువడు తున్నాయి. రేత్ సమాధిలో కూడా భాష అక్కడక్కడ కొరకరాని కొయ్యగా ఉన్నదనీ, అయినా మూల రచ యిత్రితో సంప్రదింపులు జరుపుతూ దాన్ని చాలా వరకు సంతృప్తికరంగా అనువదించాననీ చెప్పారు అను వాదకురాలు. కాబట్టి అనువాదకునికి తగినంత ప్రతిభ, సామర్థ్యం ఉంటే, కొన్ని రచనలు అనువాదానికి లొంగవు అనే అభిప్రాయం వీగిపోతుంది, అంటున్నారు. ఇది వాస్తవమే అనిపిస్తున్నది. అనువాదం గొప్పగా ఉండాలంటే ముందు భాష మీద మంచి పట్టు ఉండటం చాలా అవసరం. స్వంత (అనువాదాలు కానటువంటి) రచనల్లో భాషాపరమైన కచ్చితత్వం ఉంటేనే అనువాదాల్లో కూడా accuracy సిద్ధిస్తుంది.
- ఎలనాగ