Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాషా శాస్త్రాలకే కాదు
సామాజిక శాస్త్రాలకూ
అనర్థ కాలమిది
అర్థాలు మారిపోతున్నాయి!
అతనో గొప్ప దేశ భక్తుడంటే
ఉప్పొంగి పోవలసిన పని లేదు
అతను ఎవరితో జత గట్టాడో
గమనించాల్సిన అవసరముంది!
అతని జాతీయ వాద ప్రసంగం విని
రోమాలు నిక్కబొడిపించుకోనక్కర్లేదు
ఆవిరైపోతున్న జాతి సంపద కింద
అగ్గెవరు రాజేశారో కనిపెట్టాల్సిన పని ఉంది!
ప్రపంచ ధనికుల జాబితాలో
మనవాడుంటే మీసాలు తిప్పాల్సిన పని లేదు
గుడ్డి వెలుతుర్లో బ్యాంకుల దివాళా తనాన్ని
తడిమి చూసుకోవాల్సిన వేళన్న మాట!
జాతి అభివృద్ధి అంతా
పేక మేడల్లా కూలిపోతున్నా
మేకపోతు గాంభీర్యం వీడడం లేదంటే
మన నెత్తి మీద ప్రమాద సూచిక ఎగురుతున్నట్లే!
హింసను నమ్మిన వాడు
హింసకే బలైనట్లు
కార్పోరేట్ల చంకనెక్కిన వాడు
ఆ ఇనుప కౌగిళ్ళలోనే నలిగిపోతాడు!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261