Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహితీ వనంలో తనదైన ప్రత్యేక శైలితో ముందుకు రానిస్తున్న కవయిత్రి జవేరియా కలం నుంచి జాలువారిన అక్షర కవితా ప్రవాహం చిగురించిన చెట్టు. కవిత్వం రాసినట్టుగా లేదు. అమృత ప్రాయమైన అక్షరాలను ప్రతి చిగురాకులో మొలిపించినట్టుగా, పదాలకు పూల పరిమళాలు అద్దినట్టుగా, వాక్యాలు నెమలి నాట్యాన్ని మరిపించినట్టుగా, మాయమైన మనిషి జాడను వెతుకుతున్నట్టుగా, కవిత్వసారం భూసారాన్ని మించినట్టుగా, ధిక్కార స్వరాన్ని నలు దిక్కులకు వినిపించినట్టుగా, ఫలాలు మంచిని పంచినట్టుగా, ఆకులు ఆశా దీపాన్ని వెలిగించినట్టుగా, అభివృద్ధి పేరుతో వేర్లను పెకిలించి, కార్లకు దారి పరుస్తున్న వ్యవస్థను కోటి గొంతులతో హెచ్చరించినట్టుగా ఉంది. చెట్టు నీడను మరచి సెల్‌ఫోన్ జాడలో పరిభ్రమిస్తున్న మనుషులను కచ్చితంగా సంస్కరించే కవిత్వం చిగురించిన చెట్టు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయిన జవేరియా సరళమైన పదాలతో పదునైన భావాలు పద పదములో పలికించారు. వీరిది నీతిని నిలబెట్టి అవినీతిపై పోరాడే దమ్మున్న కవిత్వం రాయి పడగానే తల ముడుచుకునే తాబేలు లాంటి సమాజంలో అన్యాయంపై పోరాడే ధైర్యం ఉన్న కవిత్వం, మందుగుండు లాంటి అక్షర తూటాలు పేల్చే అసలు సిసలైన కవిత్వం. అన్నం తినడం మానేసి యువత గుట్కాలు మింగుతుంటే ముచ్చెమట లతో గుండె ఆగిపోతుంది అంటూ మాతృ ప్రేమను ప్రకటిస్తూ, మాతృభూమి ప్రేమని చూపిస్తున్న మహో న్నత వ్యక్తిత్వం నింపుకున్న నిండైన నిండు ప్రేమ తనది.
నిత్య సత్యాన్వేషణ చేసే జవేరియా అబద్ధాలపై అప్రకటిత యుద్ధం ప్రకటిస్తుంది. అబద్ధాలతో సహజీవనం చేస్తున్న సమాజంలో ఆచితూచి అడుగులు వేయాలని కరోనా వైరస్ కంటే కల్తీ వ్యక్తులే ప్రమాదమని హితబోధ చేస్తుంది. నిజాన్ని నిలువెత్తు శిలువ వేసిన ఈ వ్యవస్థలో అపాయం తప్పించే ఉపాయాన్ని తన సత్యాన్వేషణ కవితలో చెబుతుంది.
కవిత్వం అంటే అక్షర కుదింపుకాదు జీవితమదింపు. జీవితమంటే ఇదేనా అనే కవితలో లోతైన జీవిత తాత్వికతను బంధించి ''బుద్ధి లేని వాడికి ఎద్దు దొరికితే ఎద్దు ఉన్న వాడికి ఏమో బుద్ధి లేకుండా పోయింది'' అనే అక్షరాలు చమత్కారంగా ప్రయోగించి పాఠకుల హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
అరచేతిలో వైకుంఠం అనే కవితలో సెల్ఫోÛన్ సామాజిక జీవనంపై చూపిస్తున్న ప్రభావం చక్కగా కవిత్వీకరించారు. పిల్లలు సైకిల్ ట్యూబ్‌తో ఆడుకునేవారు నేడు యూట్యూబ్‌కు అతుక్కు పోయారు. గూగుల్ గురువైన ఈ రోజుల్లో మనిషిని పుస్తకానికి దూరం చేసి ఫేస్‌బుక్‌కి దగ్గర చేశారు.
సూది మందు అనే కవితలో కరోనా నేర్పిన పాఠాలను గురించి మూతికి మాస్కు ధరించి చేతికి శానిటైజర్ పూసుకున్న విధానం గురించి చక్కగా అక్షరాల్లో బంధించారు. ''ఆరడుగుల దూరాన్ని పాటించే నేను ఆమడ దూరం ఉండమంటూ సైగలతోనే అందర్నీ అప్రమత్తం చేస్తాను.'' భయానక దృశ్యాన్ని అక్షర ఫొటోగ్రఫీతో చూపించారు.
విజయం వరిస్తుంది అంటూ యువతకు కొండంత భరోసానిస్తూ ప్రకృతి సత్యాలను రుజువుగా చూపిస్తుంది. కన్నీరు కార్చే హృదయాలకు కాంతి దీపం వెలుగులు పంచుతుంది. ''కదం తొక్కిన ప్రతిచోట కదన రంగాన్ని తలపిస్తున్నావు'' అంటూ ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది. కవిత్వం అంటే కత్తుల అలికిడి ఎత్తిన పిడికిలి కదా. జవేరియా కవిత్వం ఓ నిశ్శబ్ద విప్లవం.
చిగురించిన చెట్టు అనే శీర్షికతో రాసిన కవిత శిఖరాగ్ర అంచులకు చేరింది. పదాలకు పదును పెట్టి ఆలోచనలు అక్షర ఆయుధా లుగా మలిచిన తీరు అమోఘం. మానవ త్వపు పరిమళాలు, మట్టి సువాసనలు కలగలిపిన కవిత్వం చిగురించిన చెట్టు. ''మోడు బారిన మనిషి జీవితం ఇప్పుడు చెట్టులా చిగురిం చాలి మానవత్వం లేని చోట మనుషుల జాడ తెలియాలి''. కవిత్వం అంటే వరవడి కాదు నడవడి. పొడి పదాలతో గుండెల్లో తడి నింపినది జవేరియా కవిత్వం. ''ఐక్యమత్యం లోపించినచోట ఏకత్వం అనే మంత్రం చదవాలి'' అనే పదాల సమూహం జవేరియా విశాల హృదయానికి తార్కాణం. వ్యక్తి కవిత్వం చూస్తే వారి వ్యక్తిత్వ జాడ తెలుస్తుంది. జవేరియాది చెట్టులా ఎదిగి ఒదిగి ఉన్న వ్యక్తిత్వ కవిత్వం. నిరుపేద జీవితా లలో ఆశల జ్యోతులు నింపే ఆక్సిజన్ లాంటి కవిత్వం.
గుడ్డి దీపం అనే కవితలో పేదరికంపై రాసిన వాక్యాలు చదువుతుంటే బోరున విలపి స్తున్నట్టుగా అనిపిస్తది. అధునాతన సౌకర్యాలు ఎన్ని ఉన్నా పేదరికాన్ని పారదోలే ప్రణాళిక ఒక్కటీ లేదా అని ఆలోచింపజేస్తది. రాతి యుగంలో లేని పేదరికం రాకెట్ యుగంలో ఎందుకు ఎగబాకింది అని ఏడిపిస్తది. అంగారక గ్రహంపై అన్వేషణ కొనసాగుతున్న ఆకలి కేకలు ఎందుకు వినిపిస్తున్నాయని మనసును ప్రశ్నిస్తది. ''నిరుపేదవాని పూరి గుడిసెలో గుడ్డి దీపం సైతం ఉండలేక ఇకపె వెలగనంటది. నల్లటి చీకటి నింపి ఆరిపోతుంది'' అంటూ పాఠకులను పాలకులను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ఈ సమస్యకు సమాధానాలు ఎన్నో చెప్పవచ్చుగాని పరిష్కార మార్గాలు ఒక్కటి లేదా అని గుండె బరువెక్కుతది.
కవిత్వం అంటే పన్నీరు కాదు, కన్నీరు. ఈ కవిత చదువుతుంట నయనాలలో నయాగరా జలపాతమే పొర్లుతున్నట్టు అనిపిస్తది.
అరవై రెండు విభిన్న కవితలు ఉన్న జవేరియా మూడవ పుస్తకం చిగురించిన చెట్టు ప్రతి ఒక్కరి గుండెల్లో పదిల పర్చుకోవాల్సిన పుస్తకం. మస్తిష్కంలో భద్రపరచుకోవాల్సిన పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జన్యువును ప్రభావితం చేసే ఓ మంచి పుస్తకం.
- సాదే. సురేష్
9441692519, 7013481947