Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిరంకుశ పాలనకు నిలువునా
సమాధి కట్టిన రోజు
తెలంగాణ జాతి యావత్తు
హర్షించిన రోజు
నిజాం చెర నుండి
భారత్లో కలిసిన రోజు'' గురించి ఉద్వేగంతో కవిత్వం రాస్తున్నాడు బైతి దుర్గయ్య. రాయప్రోలు సుబ్బారావులా దేశభక్తి గురించో, కృష్ణశాస్త్రిలా అవ్యక్త ప్రేయసి గురించో, 'మో'లా మార్మికంగానో కవిత్వం రాయకుండా భైతి దుర్గయ్యకు Date and events తో ఏం పని? పోరాటాల గురించి, విలీనాల గురించి విభజనల గురించి ఏంయావ? ఉత్తుంగ తరంగంలా చిందులేస్తున్న నయా దేశభక్తి గురించో, వెలిగిపోతుందంటున్న భారత్ గురించో నిజం చేస్తానంటున్న పాలకుల make in India గురించో కాకుండా ఒక తెలంగాణా కవి సెప్టెంబరు 17 గురించి, జూన్ 2 గురించి ఎందుకాలోచిస్తాడు? చరిత్రలో వెనక్కు నడిచి 1969 గురించి 1956 గురించి, 1323 గురించి ఎందుకు స్మరించుకుంటాడు? ఎందుకంటే ...
తెలంగాణా సమాజం ఒక ప్రయోగశాల. తెలంగాణ ప్రజలది అభద్రతా జీవనం. ఇక్కడి కవి కూడా అంతే ! ఇక్కడి కవి ప్రజల మనిషి. ఒక హన్మంతు, దాశరథి, కాళోజి, గోరటి వెంకన్న లాగానే దుర్గయ్య కూడా ఇక్కడి చరిత్ర కుదిపిన కుదుపులను ఆకళింపు చేసుకొని ప్రజల పక్షం వహించిన వాడు. మలిదశ ఉద్యమంలో సకల జనులతో నడిచినవాడు. అందుకే ఇక్కడి యువతకు విద్యాబుద్ధులతో పాటు పోరాటపు దారులు చూపిన ఉస్మానియానూ సంభోదిస్తూ ....
''ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటాలకు
పురుడు పోసిన గడ్డ
ఉన్నత విద్యాస్థాయిని విశ్వవీధుల్లో
నిలిపిన జయకేతనం
చరిత్ర గమనాన్ని తిరగరాసిన మేధావులను
అందించిన చదువులమ్మ గుడి
దేశాన్ని ఏలే నాయకులకు ఓనమాలు
దిద్దించిన రాజకీయ బడి'' అని సహేతుకంగా సలాం చేస్తాడు. అందుకే ఆయన కవిత్వంలో స్పష్టత, సూటి దనం ఉంటుంది. కవిత్వం మార్మికంగా ఆలోచనా త్మకంగా, గవేషణానంతరం వ్యక్తమయ్యేదిగా ఉండాలనే కొందరి పాశ్చాత్య విమర్శకులకు భిన్నంగా ఉంటుంది. చంధస్సుకు మాత్రలకు సూత్రాలు, నిబంధనలు నిర్వచనాలకు దుర్గయ్య ఒదగడు.Poetry is the Language of imagination అన్న హజిట్ నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినపుడు 41 కవితలున్న ఈ సంపుటిలో కవి ఊహాస్థాయి కవిత్వ పాఠకులకు అత్యంత సులభంగా అందుతుంది. ఊహాశక్తి ప్రకటనమే కవిత్వమన్న షెల్లీ మాట ఇక్కడ గుర్తుకు వస్తుంది.
క్లుప్తత, స్పష్టత భైతి దుర్గయ్య కవిత్వ లక్షణాలు. ఆయన మొదటి కవితా సంపుటి అక్షర సేద్యం,ప్రస్తుత సంపుటి 'అలుకు మొలకలు' ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి .41 కవితలలో ప్రతి కవిత 20-25 పాదాలకు లోపు ఉంటుంది. వాడుక భాషలోనే కవిత్వం ప్రజలకు చేరుతుందనే ప్రగాఢమైన నమ్మకమున్న ఆధునిక కవులందరి లాగానే దుర్గయ్య కూడా నిత్యవ్యవహార భాషలో కవిత్వం రాసాడు. స్థానీయత దుర్గయ్య కవిత్వంలోని మరొక ప్రధాన లక్ష్యం. 'అలుకు బోనం' అనే కవిత తెలంగాణ రైతు కుటుంబానికి మాత్రమే సంబంధించిన వస్తువు. బోరు బావుల మీద రాసిన కవిత, బతుకమ్మ మీద రాసిన రెండు కవితలు, కొమురెల్లి మల్లన్న మీద రాసిన కవిత ఈ కోవలోకి వస్తాయి. వస్తు వైవిధ్యం ఈ సంకలనంలో మరొక ఎన్నదగిన లక్ష్యం.
ఉగాది పర్వదినం సందర్భంగా రాసిన కవితలు, రైతుల దైన్యం మీద, బాలకార్మికుల గురించి, మాతృమూర్తి గురించి ఇంకుడు గుంత, చెరువుల పూడిక, బాల్యం, చెట్ల పెంపకం, భార్య, ఆడపిల్ల, అర్ధం లేని కౌమారపు ప్రేమల మీద, రక్తదాన ఆవశ్యకత మీద, స్నేహం, ఓటు విలువ వంటి విభిన్న వస్తువుల మీదనే కాకుండా రోబోట్ ల మీద కూడా కవిత్వం ఉంది. రవాణా ఖర్చులు లేక భార్య శవాన్ని మైళ్ళ కొద్ది దూరం మోసు కెళ్లిన ఆదివాసీ కవిత కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. దుర్గయ్య కవిత్వంలో గతంలో ఎక్కడాలేని అభివ్యక్తులున్నాయి
''ఆనంద వందనంతో
పురిటి నొప్పులు భరించి
జగతికి కొత్త జీవినందించే
పుడమి దేవత జనని''
(మరువలేని మమకారం)
''నీ ఇంటి పేరు మార్చుకున్నావు
ఈ ఇంటి రూపమే మార్చావు
తీర్చలేని రుణం నీది
విడదీయలేని అనుబంధం నీది''
(ఇల్లాలికి ప్రేమతో)
''నాన్నా! ఒక్క జన్మనివ్వు
తల్లినై నీ రుణం తీర్చుకుంటా''
(నాన్నా ఒక్క జన్మనీవ్వు)
''కంటికి కనిపించేవన్నీ
నిజాలు కావు
ప్రేమ మత్తులో మూసిన
అమాయక నేత్రాలు
తెరుచుకోవడం
అంత తేలికేమి కాదు''
(కనిపించే నిజం)
'వనితా ఆలోచించు' అనే మరొక కవిత స్త్రీ పుట్టిన దగ్గరి నుంచి వృద్ధాప్యం వరకు ఎదుర్కొనే ఈసడింపుల్ని అతి ధైర్యంగా, తక్కువ పాదాలలో చిత్రిస్తుంది. స్త్రీల మీద రాసిన కవితల్లో కవి దుర్గయ్యలోని సృజన స్పష్టంగా బయటికి వచ్చింది.
తెలంగాణ మౌళికతను, సిద్ధిపేట చైతన్యాన్ని ఒంట బట్టించుకున్న కవి దుర్గయ్య. ఈయన యువకుడే కాని ఈయన జీవిత గమనంలోని మలుపులు ఆశ్చర్య కరమై నవి. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన దుర్గయ్య ప్రతికూల పరిస్థితులలోనే పాఠశాల విద్య పూర్తి చేసి ఇంటర్ చదువుచుండగానే చెన్నై వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందాడు. సినిమా దర్శకుడు కావాలనే కోరికను తీర్చుకోలేని దుర్గయ్య కవి అయ్యాడు. హిందీ ఉపాధ్యాయుడయ్యాడు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను రాబట్టడానికి వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూనే మరొకవైపు సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాడు.
తెలంగాణ కవిత్వం, జీవితం పోరాటం నుంచి మాత్రమే వచ్చింది. వస్తుంది. చావు తప్పదన్నప్పుడు చంపి చావుమింక అన్నాడు నీలా జంగయ్య. యాత గుండెల మీదికి ఒరిగినప్పుడు నిద్రల్ని మింగేసిన మోటబాయి చప్పుడు విన్న యం.వెంకట్ ఇప్పటి కవి. మనం చేసుకుంటున్న సంబరాల్లో కనిపించని సకల జనుల్ని యాది చేసుకుండు అమ్మంగి. అందరం కలిసి అతన్నో అభిమన్యున్ని చేసినం అని రైతు కోసం వేదన చెందుతడు ఎన్.గోపి. ఇలాంటి గుర్తుతెచ్చుకోదగిన వాక్యాలు దుర్గయ్య కలం కూడా సృజించాలి. దుర్గయ్య కవిత్వం మరింత పదునెక్కుతుందని, పదునెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
- డా|| ఏనుగు నరసింహారెడ్డి
కవి, డిప్యూటీ కలెక్టర్