Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకానొక రోజు
పురాతన ఆకాశం నుండి
నవీన కాంతి కిరణాలు
నగరం మీద పడి వ్యర్థంగా గడిపేశారు
ఎవరు ఓడిపోయారో
తెలియడం లేదు
వీస్తున్న గాలి నుండి
సిమెంట్ వాసన
మరణించిన ఋతువుల నుండి
బూడిదైన జ్ఞాపకాలు
నగరంలో అక్కడక్కడ
తీసిపారేసిన అరటి తొక్కలా
మాంస శరీరాలతో రోడ్డు పక్క
నిద్రపోతున్న మనుషులు
హంతుకులు తిరుగుతున్నారు
దొంగలు వెతుకుతున్నారు
వేడెక్కిన ఇంజన్లతో
ప్రయాణం చేసే వాహనాలు
ఇక్కడ
అగ్ని పర్వతాలు ఉండవు
అడవులు ఉండవు
వెలుగుతున్న వీధి గుండెల్లో
యథేచ్ఛగా మకాం వేసిన భయం
బంగాళాఖాతంలో
వేటకెళ్లిన మత్య్సకారుని వలలో
అలవికానన్ని చేపలు పట్టుబడ్డాయి
నొప్పులతో విలవిల లాడుతున్న స్త్రీకి
కంటి ముందు చీకటి పొడుగ్గా ఉంది
ఒక్కోసారి
కాలం పూలపొదల నీడ
ఇంకోసారి
దగ్ధం చేసే నిప్పుపొదల జాడ
- డాక్టర్ గోపాల్ సుంకర
9492638547