Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా పేదరికాన్ని కన్నీళ్ళతో ఉతికి
దండెం మీద ఆరేత్తే
శిల్మువట్టి శీకిపోయిందని తెల్లగ్గాలే.....
మా బొక్కలన్నీ అరిగేటట్లు
ఏండ్ల సంది కట్టం సేస్కచ్చిన
ఆఖరికి అరుగుబండే మిగిలిందని
పెంకుటిల్లు పెద్దగ్గాలే....
మా బతుకు మెతుకుల్ని పొయ్యి మీద ఉడికిత్తే
అడుగంటి మాడిపోవుడే గానీ
దగ్గరవడి కడుపు నిండింది లేదు.....
మా పేదరికం ఆకాశమంత పెద్దగుంటది...
కానీ ఇంటికత్తే సాపేసి
కూకోవెట్టలేనంత జాగుండదు....
తలక్కాయేత్తి
లోపలికి పోయేంత గల్మలుండవు....
గోడకానుకొని కూకుంటే
సున్నం బిచ్చలు వీపుకత్కుకుంటవ్...
సుట్టాలింటికత్తే
ఇద్దరు సుక్కలు లెక్కవెట్టుకుంట
ఆవల పండాలే....
జోలె వడ్డ నుల్కమంచం
భూమికి తాకి మా పేదరికాన్ని ఎక్కిరిచ్చిన...
మా దిగుట్ల గల్లగురిగి
కడుపు నింపుడైతే మర్షిపోము....
గోడకు సున్నమేసినట్లు
మా మాశిన పేదరికానికి కూడా
సున్నవేసుడుంటే మంచిగుండు...
పచ్చీసాటల సంపుడువందెం ఉన్నట్లు
పేదరికాన్ని సంపి
పెద్దింట్లకి పోవుడుంటే మస్తుండు.....
తాత వెట్టిన వేపసెట్టు
పెరిగి పెద్దగయిందని.....
తాతల నాటి తడ్కల సంసారం
అట్లనే ఉన్నది...
తడకలు వోరు పర్దలు తేలినయని...
రూపాయి బిళ్ళ పది రూపాయలు కాలే...
పేదోళ్ళకు ''పేదరికం'' బంకవట్టినట్లే వట్టుకుని...
సచ్చినంక బూడిదై కర్మ రోజు
కాకి కడుపు నింపుడు వరకేనని...
మా గల్లగురిగి మాత్రం నిండిది లేదు.....
- తుమ్మల కల్పన రెడ్డి, 9640462142