Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలసుక్క పొడిసిపొడవంగానే
మా పల్లెలో
కట్టెల పొయ్యి మీద
రొట్టెల సప్పుడు కునుకుబట్టిన చెవులకు
డప్పు సప్పుడైతది.
గొరుకొల్లు పడమట పందిరేయ్యగానే
పొలంబాట పట్టిన
ఎద్దుల కాలిగిట్టెల శబ్దం
మా పల్లెను నిద్రలేపుతుంది.
తూర్పు కొండల నుండి కరకరమంటూ
పొద్దు పొడసూపగానే
నెత్తిమీద సద్ది సంకలో సంటిపిల్లగానితో
పాద జాడలవెంట మ్యాకపిల్లలు
నడుస్తూ అడవితల్లిని నిద్రలేపుతాయి.
సద్దసేన్లో కలుపుదీయాలనో
పత్తి మొగ్గలు తీయాలనో
మా పల్లెతల్లులు సేనుసేనుకాడ
ఇరగగాసిన జొన్నకంకులౌతారు.
గింజుకోని గంజితాగి
పొద్దంతా తల్లిపిల్ల ఎంత రయ్యమైన
చేస్తున్న పనిని కష్టమనుకోకుండా
పొద్దుతిరిగినట్లు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులౌతారు.
బంధాల మీద ప్రేమ కలిగి
సుట్టమొచ్చిన పట్టమొచ్చిన
కట్టుకొచ్చిన సద్దిలనే నెత్తికింత పంచుకొని తింటరు.
సంటిపిల్లలుంటే
యాప కొమ్మలకు కట్టిన పాతచీరలో
పిల్లలు పొర్లుతుంటే గాలి దేవుడొచ్చి
ఊయలూపి మట్టిబిడ్డలమీద మమకారం చాటిపోతడు.
ఇంటి వాకిట్లో
ఇరుసులిరిగిన బండిలా
ముసలి పాణాలు
పల్లెకు దిక్కుదివానమౌతాయి.
నాగలి కర్రు పొలం దున్నినట్లు
కొడవలి వరికంకులను కోసినట్లు
శ్రమజీవుల దేహం నుండి చెమట చుక్కలు
ఆకాశం నుండి కురిసే వానచినుకులౌతాయి.
అందరికీ నుదుటన రాతవుంటే
ఒక్క రైతుకు మాత్రం
కందిపోయిన అరచేతుల్లో జీవిత అద్దం కనిపిస్తుంది.
- అవనిశ్రీ, 9985419424