Authorization
Mon Jan 19, 2015 06:51 pm
20వ శతాబ్దపు పూర్వ భాగం దాకా సాహిత్యాన్ని కేవలం ''శైలి, అలంకారం, రసం'' మొదలైన కళాత్మక విలువల దృష్ట్యా మాత్రమే పరిశీలించడం జరుగుతూ వస్తున్నది. దానివల్ల సాహిత్యం ప్రామాణికతకు కొంత దూరమైంది. దీనిని పరిగణలోకి తీసుకొని ''సామాజిక,రాజకీయ, చారిత్రక'' భూమికతో తెలుగు సాహిత్యాన్ని పరిశీలించాలనే దృక్పథంతో రంగనాథాచార్యులు రాసినదే ''తెలుగు సాహిత్యం - మరో చూపు'' అన్న రచన. ఆనాటి సాహిత్య చరిత్రకు ఆవల ఉన్న వాస్తవిక సాహిత్య చరిత్రను చూపే దర్పణమే ఈ ''తెలుగు సాహిత్యం- మరో చూపు'' అన్న రచన. వీరు సాహిత్యాన్ని అందరు విమర్శకుల లాగా భావజాలం లక్షణ నియమాల ఆధారంగా కాక సాహిత్యంపై గల దేశ కాల, మత, ఆర్థిక సామాజిక వాస్తవిక అంశాల ప్రభావం దృష్ట్యా పరిశీలించారు.
ఒక భాష విశిష్టతను, గొప్పతనాన్ని తెలిపేది ఆ భాషలో వెలిసిన సాహిత్యమే. సాహిత్యం అంటే సంస్కృతిని ప్రతిబింబింపచేసేది అని అర్థం. ఒక జాతి, దేశ, సంఘం జీవన విధానాలు, వారి ఆచార వ్యవహారాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, కట్టుబాట్లు, కళలు మొదలగు అన్నింటి సమన్వయమే సంస్కృతి. అటువంటి సంస్కృతికి రూపం ఇచ్చి, వాటిని భద్రపరిచి, భవిష్యత్ తరాలకు సజీవంగా అందించేది సాహిత్యం మాత్రమే.
ముఖ్యంగా ఆ కాలం నాటి భారతదేశంలోని ప్రాంతీయ భాషా సాహిత్యాలు ఆస్థాన, ఆస్థానేతర సాహిత్యాలుగా అభివృద్ధి చెందాయి. ఆస్థాన సాహిత్యం ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలమై, దానిని బలపరచడానికి ఉపయోగిస్తే, ఆస్థానేతర సాహిత్యం ఫ్యూడల్ వ్యవస్థను, దాని కనుకులమైన కుల వ్యవస్థనూ వ్యతిరేకిస్తూనో, భక్తి సాహిత్యంగానో జనంలో వ్యాపించింది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకమైన చారిత్రక కారణాల వల్ల, ఫ్యూడల్ వ్యవస్థ ప్రభావం వల్ల కొన్ని భాషల్లోని లిఖిత సాహిత్య చరిత్రలో ఆస్థాన సాహిత్యానికి ప్రాధాన్యం ఏర్పడగా, కొన్ని భాషల్లో ఆస్థానేతర సాహిత్యానికి సమప్రాధాన్యం, మరికొన్ని చోట్ల అధిక ప్రాధాన్యం కనబడుతుంది. ఆస్థాన సాహిత్యానికైనా, ఆస్థానేతర సాహిత్యానికైనా మతమే ప్రధాన ప్రాతిపాదికగా కనిపిస్తుంది.
ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాల్లో కాలక్రమంలో వచ్చిన పరిణామాన్ని చెప్పటమే దేశ చరిత్ర అయితే, ఆ సంబంధాలు సాహిత్యంలో ఎలా ప్రతిబింబించాయో, దానికనుగుణంగా సాహిత్య రూపాలు ఎలా సంతరించుకున్నాయో చెప్పటమే సాహిత్య చరిత్ర. శిష్ట సాహిత్య రూపాన మనకి అందుబాటులో ఉన్న ఈ సాహిత్యం సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎంతవరకు ఉపకరిస్తుందో చెప్పటం కష్టమే. ఎందుకంటే ఆనాటి సంస్కృతిలో ఆధ్యాత్మిక విలువలు ప్రధానంగా ఉండి మతం, తత్వం, చట్టం, సాహిత్యం, సంగీతం, చిత్రకళ మొదలగు ఉపరితల విషయాలన్నింటిలోనూ ఆధ్యాత్మికతే ప్రతిబింబిస్తుందనే ఒక అభిప్రాయం కలదు. కానీ సంస్కృతి అంటే ఒక సమాజపు సంపూర్ణత్వాన్ని విశదీకరించగలగాలి. ఇది సగటు మానవుని సామాజిక, వాస్తవిక జీవన పరిస్థితులను, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, నమ్మకాలు, భావజాలం వంటి మౌలికాంశాలన్నింటి మధ్య గల సమన్వయ చిత్రీకరించగలగాలి. తొలినాళ్ళలో సాహిత్యం మత ఆధిపత్యంకు లోనైతే, తర్వాతి కాలంలో ఆర్థిక ఆధిపత్యానికి గురవ్వాల్సి వచ్చింది. ఆర్థిక ఆధిపత్యం మతం కంటే బలవత్తరమైనది.
ఒక విషయాన్ని అభివ్యక్తీకరించే పద్ధతిలోని కళాత్మక విలువలను బట్టి ఒక రచనను సృజనాత్మక రచన అని సాహిత్య రచన అని వర్గీకరిస్తారు. సృజనాత్మక రచనలో కేవలం రసానుభూతి,భావనశక్తి మాత్రమే ప్రధానంగా ఉంటాయి. సాహిత్య రచన అనేది సంస్కృతిని, సామాజిక అంశాలను మిళితం చేసిన సృజనాత్మక రచన. ఇందులో రసానుభూతి, భావనశక్తితో పాటు సమకాలీన సామాజిక స్పృహ, వాస్తవిక త వంటి అంశాలు అంతర్లీనంగా ఉంటాయి. సాహిత్య చరిత్ర రచనలో సింహభాగం ఇవ్వాల్సింది సాహిత్య రచనావళికే కానీ సృజనాత్మక రచనలకు కాదు. అయినప్పటికీ ఒక విషయాన్ని అభివ్యక్తీకరించే పద్ధతిని,రచన రూపాన్ని నిర్ణయించేది కవి సాంఘిక ఆస్తిత్వం, కవి ఆశించే ప్రయోజనం మాత్రమే. నన్నయ మహాభారతంను తెలుగులోకి అనువదించాలనుకున్నప్పటికీ అందులో సంస్కృత ప్రభావం, బ్రాహ్మణ మత ధర్మాలు గల ఒక లౌకిక కావ్య అంశాలు అధికంగా కనిపించడానికి కారణం ఆనాటి సమాజంలో అధికంగా గల సంస్కృత భాష, వర్ణ వ్యవస్థ ప్రభావమే. శివకవి యుగంలో వచ్చిన అనుభవ సాహిత్యం, దేశి సాహిత్యం, వీరశైవ మత ప్రభావం ఫలితంగానే పాల్కురికి సోమన్న తన రచనలలో దేశీయతను, అచ్చ తెలుగును పరచగలిగారు. అంతేకాక బసవ్వ వంటి సామాన్య వ్యక్తులను కన్నప్ప వంటి అటవీకులను, గంగిరెద్దులవారు మొదలగు జానపద కళాకారులను కథా వస్తువులలో భాగంగా ఎంచుకోవటం, సమాజంలోని అస్వశ్యతను, వర్ణ వ్యవస్థను నిరసించడం వంటివి వారు ఆశించిన సంస్కరణ తత్వ ప్రయోజనాన్ని వెల్లడిస్తున్నాయి.
ఒక సాహిత్యంలోని మౌళిక సాహిత్య గ్రంథాలను సామాజిక విపరిణామం దృష్ట్యా పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. దానిని చూసే దృష్టిని మార్చుకుంటే సరిపోతుంది. అందులో సమకాలీన సమాజానికి/ సాహిత్యానికి అవసరమైన అంశాలను వెతుక్కోగలగాలి. చారిత్రక ఆధారాలు, గ్రంథాలు లభించిన సందర్భాలలో ఈ సాహిత్య గ్రంథాలే చరిత్ర రచనకు/ఆనాటి ప్రజల జీవన విధానంను తెలుసుకోవ డానికి ఉపకరిస్తాయి.
''జొన్న కలి జొన్న యంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బల్నాటి సీమ ప్రజలకు నెల్లను''.
పై శ్రీనాధుని పద్యాన్ని చదివితే ఆనాటి ప్రజల ఆహార విధానాలు, వారి జీవన శైలి మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గ్రంథానికి ఉపయుక్త ఆధారం ఆనాటి కొఱవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశిక అన్న గ్రంథమే.
కవి తాను నివసిస్తున్న సమాజం, నాటి పరిస్థితులు, తాను ఎంచుకున్న సాహిత్య రచనకు మధ్య గల పరస్పర వైరుధ్యాలు కవిని నిరంతరం వెంటాడుతుంటాయి. తన కాలంనాటి సమాజం ఒకరకంగా ఉంటే తాను కోరుతున్నది, సాధించాలని ఆశిస్తున్న సిద్ధాంతాలు, భావాల మధ్య వైరుద్యాలు అతని లక్ష్యాన్ని కొంత అయోమయానికి గురి చేయవచ్చు. ఈ వైరుధ్యాలను గుర్తించి వేరు చేయగలిగినప్పుడే తన లక్ష్యానికి పరిపూర్ణత చేకూర్చగలరు.
పాల్కురికి సోమన్న దేశీ మార్గమని ద్విపదను అనుసరించినా, తొమ్మిది రసములు కొలుకాడు దాని, యిమ్మడి వర్ణన లెసగంగ ద్విగుణమగు నలంకారం బులసలారు దాని, దిగునార్ధ భావములు దీటుకొనంగ అని సంస్కృత అలంకార శాస్త్ర మర్యాదల్ని పేర్కొనకుండా ఉండలేకపోయారు. అల్పాక్షరముల ననల్పార్థ రచన, కల్పించుటయే కాదే కవి వివేకంబు అంటూనే అలాంటి రచన చేయలేక పోయాడు. జాను జానుగు ప్రసన్నతకు కారణం అంటూనే సంస్కృత భూయిష్టమైన పండిత భాషనే వాడాడు. సమకాలంలో కవి అస్తిత్వం పైన ఆధారపడిన భావజాలం అందులో కనిపించే వైరుధ్యాలు సాహిత్యంలో ఎలా ప్రతిబింబిస్తాయో, సాహిత్య రూపాన్ని నిర్ణయించడంలో ఎలా ప్రధాన పాత్రను వహిస్తాయో చెప్పడానికి సోమన సాహిత్యం ప్రధాన నిదర్శనం.
తెలుగు లిఖిత సాహిత్యం ప్రధానంగా ఆస్థాన సాహిత్యంగా, పండిత సాహిత్యంగా మొదలైనప్పటికీ ఆధునిక కాలంలో సామాజిక విలువలు, సమ సమాజ స్థాపనే ప్రధాన భూమికగా పరిణతి చెందింది. ఒక దశలో చాలా కృత్రిమంగా పరిణమించినా ఆస్థాన సాహిత్యంలోనూ కళా విలువలు ఉన్నతంగా రూపొందిన మాట కాదనటానికి వీల్లేదు. మధ్యలో సామాన్యుల కోసం శివకవులు తీర్చిదిద్దిన దేశీ కవిత్వం, అచ్చ దేశీయమైన భాషలో, జానపద బాణిలలో గీతాలు, కీర్తనలు రాసిన అన్నమయ్య వంటివారు, నిజమైన ప్రజాస్వామిక నిర్మాతలైన వేమన, వవీబ్రహ్మం వంటి వారు ప్రాచీన సాహిత్యంలోనూ ఆధునిక సంస్కరణ భావాలనీ తీర్చిదిద్దారు.
సమాజం-సాహిత్యం రెండు పరస్పర ఆధారితాలు. వ్యక్తులనే కాదు సమూహాలను, సమాజాలను సైతం ఆకర్షించగల శక్తి ఒక్క సాహిత్యానికే ఉంది. అందుకే శివకవులు, అన్నమయ్య, వీరబ్రహ్మం, వేమన వంటి వారు తమ భావజాల ప్రసరణకు సాహిత్యాన్నే మాధ్యమంగా ఎన్నుకున్నారు. అంతే కాదు వేమన, తిక్కన, గురజాడ కందుకూరి వంటి ఎంతో మంది కవులు సమాజంలోని అసమానతలు, కుల మత భేదాలను, లింగ అసమానతలు నిర్మూలించడానికి, తమ సంస్కరణ వాదానికి సాహిత్యాన్నే ఆయుధంగా మలుచుకున్నారు.
ఎందుకంటే సాహిత్యం మనసుకు మత్తుమందు చల్లడమే కాదు,
సమాజానికి శస్త్ర చికిత్స చేయగలరు......!!
- ఎం.కురుమయ్య యాదవ్, 7799553493