Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి కవిత్వంలో దొరుకుతాడు. కవిత్వం అంటేనే అంతరంగ ఆవిష్కరణ. ఓ భావోద్వేగ ప్రకటన. నిర్ద్వంద్వమైన ఓ ధిక్కార నిరసన. దేవరాజు మహారాజు కవిత్వం 'జన్యులిపి' లో ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి.
2021 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన డా|| దేవరాజు మహారాజు ఈ సమాజపు డి.ఎన్.ఎ నే 'జన్యులిపి' గా పాఠకులకు అందించారు. ఓ తాత్విక, హేతువాద, విజ్ఞాన శాస్త్ర రచయితగా దేవరాజు తెలుగువారికి సుపరిచితులు.
కవిత్వమే జీవ రహస్యమైతే / జీవ రహస్యమే కదా విజ్ఞానం / గుండెను పట్టుకోవడం జ్ఞానం అయితే / గుండె చప్పుడు వినగలగడమే కవిత్వం అని 'జీవ - జీవన రహస్యాలు' తెలుపుతారు.
గాలులు, కెరటాలు ఎవరికీ లొంగవని / గాలి ఎవరి పిడికిలిలో ఖైదీగా ఉండదని / దేశవ్యాప్తంగా సాగిన రైతు ఉద్యమాన్ని బలపరుస్తారు.
'వైరస్ - ఛారువాలా లాగా వచ్చి / మన ఛారు మనల్ని తాగనివ్వదు వైరస్ పోవడానికి దేశాన్ని శానిటైజ్ చేద్దాం' అని పిలుపిస్తారు.
'రచయితల హత్యలు / మేధావులపై దొంగ కేసులు / దొంగల రుణాల మాఫీ / వలస కూలీల బలులు / అణగారిన వర్గాలపై అఘాయిత్యాలు / హిందూత్వ ఎజెండా / సబ్ సాకాత్ సబ్కా వికాస్/ మిత్రో - జై శ్రీరామ్' అంటూ ఓ ఫ్లోలో ఆత్మనిర్భర్ భారత్‌ను వ్యంగ్యీకరిస్తారు.
తన క్రియా శూన్యత్వాన్ని / గంభీరోపన్యాసం కింద దాచేవాడే కదా / నేటి 'ప్రధాని' వక్త / అని 'మన్ కి బాత్' అర్థం వివరిస్తారు.
పిచ్చివాడా! నువ్వు అర్థం చేసుకుంటే / నిజాన్ని మించిన అందంలేదు / విజ్ఞానాన్ని మించిన కవిత్వం లేదు అంటూ 'హృదయంలో మేధస్సు'ను వర్ణిస్తారు.
మృత్యువు అంటే అభద్రత / మృత్యువు అంటే డబ్బు కూడబెట్టడం / అని చెబుతూనే ఎవరైనా కాస్త మృత్యువును వెదికిబెడతారా? అని 'బతుకు బాట'ను శోధిస్తారు.
అక్షరమే నా అస్తిత్వం / అక్షరమే నా బలం బలగం / అంటూ జనం కళ్ళతో సృశించే ప్రతి అక్షరానికి తిరుగే ఉండదని చాటుతారు.
ఏ ఆకృతి లేని చిన్న బండరాయిని / తొలిచి రూపం ఇచ్చేవాడు శిల్పి అయితే / అదీ అంతంలేని విశ్వాంతరాళాన్ని మానవ శ్రేయస్సు కోసం / నిరంతరం తొలుస్తున్నవాడు ఇంకా ఎంత పెద్ద శిల్పి? అంటూ శాస్త్రవేత్తను - కళాకారుణ్ణి సమాంతరంగా సమోన్నతస్థితిలో నిలబెడతారు.
ఇలాంటివి ఈ పుస్తకంలో ఏభై కవితా ఖండికలు ఉన్నాయి. గత అరు దశాబ్దాలుగా సాగిన వారి సారస్వత కృషిలో విభిన్న ప్రక్రియలకు సంబంధించి డా|| దేవరాజు 87 గ్రంథాలు రాసారు. విభిన్న భాషల కవిత్వాన్ని, కథలను అనువదించి తెలుగు పాఠకులకు అందించారు. ప్రముఖ అనువాదకులు దండమూడి మహీదర్ వారిని అభినవ కొ.కొ. గా అభివర్ణించారు. ఇప్పుడు ఈ 'జన్యులిపి' కవిగా దేవరాజును పరిచయం చేస్తుంది.
- కె.శాంతారావు, 9959745723