Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్రలోనూ అదే ధ్యాస
సమూహంలోను ఏకాంతంలోనూ
అదే జపం
అతనికొక కుర్చీ కావాలి
ఒక కుర్చీ కావాలి
దాని కోసం అతడు వెతకని జాగా లేదు
దూరని సందు లేదు తొక్కని గడప లేదు
పట్టని గడ్డం లేదు
అతనికొక కుర్చీ కావాలి
వేటగాళ్లు ఎలుకల బొరియల్ని తోడినట్లు
పాములు కప్పల కోసం ఉరికి వురికి
మురికి సూస్తున్నట్లు
అతను కుర్చీకోసం వెతుకుతున్నడు
కుర్చీ కోసం కలవరిస్తున్నడు
అది ఎంత పురాతనమైనదైనా సరే
గుప్తుల నాటిదైనా
అస్తిత్వం లుప్తమై పోయినా
ఏదో ఒక కుర్చీ కావాలి.
అది అటుకు మీద ఆరామ్ చేస్తున్నదైనా
చీకిపోయి కండలూడిన కాళ్ళదైనా
చెదలు తింటున్నదైనా
చివరికి ఒక కాలు ఎండిపోయిందైనా
అతనికో కుర్చీ కావాలి
కుర్చీ వేటలో మొలకల ముక్కులకు
మత్తు మందు పూస్తున్నాడు.
ఎదుగుతున్న పరిమళలాకు
విషపు గాలి చల్లుతున్నాడు
హేమంత సరోవరంలో
గులెర్ దెబ్బలు విసురుతున్నాడు
కుర్చీ కోసం
లుల్లిగాని తీరు ఇల్లిల్లు తిరుగుతున్నడు
అతనికొక కుర్చీ కావాలి
దానిపై అతని రాజసం
హైమాస్ వెలుగుల్ని మించిపోవాలి
అతను దర్జాగా కాలుమీద కాలేసుకొని
ముసలి మీసాలు మెలేస్తున్నపుడు
కబ్జా చేసుకున్న అతని ఠీవీని
మనం చప్పట్ల చినుకులతో తడిపెయ్యాలి
అదిలేక పోతే
అతడు భౌతికంగా దూరమైనా
పెంపుడు పిల్లి కూనలా
మనకాళ్ళ సందుల్లో తిరుగుతుంటడు
కుక్కపిల్ల లాగా తోకూపుతూ వెంట బడతడు
దాని కోసం భజన కాల్‌లను
వెంట తెచ్చుకున్నడు
దానికోసం కాంది శీకునిలా
ఇంటింటికి తిరుగుతూ
కంట నీరు పెడుతున్నడు.
దాని కోసం పేగు బంధాల్ని తెంపుకొని
రక్తాను రాగాల్ని తుడిచేసుకొని
ఒంటరి ద్వీపమై
అధికార యావకు ఊగులాడుతున్నడు
అందుకే
అది చిలుమెక్కిందయినా
చీకుటం పట్టింధైనా
ఒక కుర్చీ కావాలి
జీవితాంతం
దాన్నే పునుకుతూ పునుకుతూ
మురిసిపోయే ఒక కుర్చీ కావాలి.
అతనికొక కుర్చీ కావాలి.
- డా. ఉదారి నారాయణ
9441413666