Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరాకును కలిగించే ఎండను
కాసేపు వెన్నెలలా కౌగిలించుకుందాం,
పగలే వెన్నెలను పాటలోనే కాదు
మనసులోనూ నింపుకుందాం!
చర్మంపై తీగలుగా సాగే చెమటనది
జారిపోతూ గిలిగింతలు పెడుతుంది,
రాలుతున్న చెమటచుక్కలపై
సూర్యకిరణాలు పడగానే
స్వర్ణపుష్పాలై విరబూస్తాయి!
ప్రతి ముఖం ఒక సూర్యబింబమై
వెయ్యి కాంతులతో వెలుగుతుంది,
తలెత్తి చూడలేని కాంతిని
తలవంచుకొని ఆహ్వానిద్దాం!
కిరణాలు వెళ్లగక్కే నిప్పులమణులపై
తొణకని నడకలు సాగిద్దాం,
వడగాలులై చుట్టుముట్టినా
విరహపు నిట్టూర్పులా హత్తుకుందాం!
కాలంపాత్రకు తగ్గట్లు
దేహాన్ని నీటిలా మార్చివేద్దాం,
మట్టిలో వేళ్ళూనుకున్నట్లు
బతుకునొక దీక్షలా నిలుపుదాం!
బండలాంటి ఎండను పిండిచేసి
పుప్పొడిలా స్వీకరిద్దాం,
పచ్చదనంతో నేలతల్లికి నీడనిచ్చి
చిగురించే ఊపిరిరాగాన్ని ఆలకిద్దాం!
- పుట్టి గిరిధర్
9494962080