Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖానికి అందమైన ఆభరణం చిరునవ్వు అంటారు కదా? కంతేటి చంద్ర ప్రతాప్ ''వెన్నెల హాసం'' అలాంటి ఆభరణాలు ఎన్నో తొడుగుతుంది చదువరికి. తెలుగులో హాస్యం చాలా మందే రాసారు. అయినా ఇంకా ఇంకా హాస్యం రాసేవారు కావాలి. నవరసాల్లో ఇది సంజీవని. నాకు పురాణం సీత ''ఇల్లాలు ముచ్చట్లు'' బాగా నచ్చుతాయి. పడిపడి నవ్వడం తక్కువ, ముసి ముసి నవ్వులు ఎక్కువ అవి చదివితే. అలాంటి అనుభూతే కలిగింది ఈ పుస్తకం చదువుతున్నప్పుడు.
చంద్ర ప్రతాప్ హాస్యం పండించడానికి ఊహాగానాలు చేయలేదు. నిత్య జీవితంలో తను చూసినవి, అనుభవించినవీ కథలుగా చెప్పారు. స్వయంగా ఆయన నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మనిషి.
కరోనా వల్ల అనుకోకుండా సంభవించిన లాభకర పరిస్థితులు రాయడానికి మొదలే : ''కరోనా'' ఎంత అందమైన పేరు! యే హాలీవుడ్ బ్యూటీకో పెట్టవలసిన పేరును ముదనష్టపు రోగానికి పెట్టడమా! అంటారు.
కేవలం హాస్యానికి సంబంధించినవి కాకుండా కొన్ని సీరియస్ కథనాలు కూడా ఉన్నాయి. ''గాడిదలే ఏనుగులైతే'' లో తెలుగువారు తరచుగా చేసే అచ్చుతప్పుల గురించి అయితే, ''కుర్చీ ఫిలాసఫీ'' లో మనిషి ఒక పవర్ ఉన్న సీట్ లో ఉన్నప్పుడు పొందే గౌరవ మర్యాదలన్నీ ఆ కుర్చీ కారణంగానే, ఒక్కసారి రిటైర్ అయ్యాక సీనే మారిపోతుంది.
కొంతమందికి విసుగు జాస్తి. అలాంటివాడు కురుక్షేత్ర యుధ్ధ భూమి దుర్యోధనుడిలో పరకాయ ప్రవేశం చేస్తే? ఇరుపక్కలా సైన్యాలు మొహరించి వుండగా శ్రీకృష్ణుడు నాన్ స్టాప్‌గా భగవద్గీత చెప్పేస్తుంటే ఇలా స్పందిస్తాడు : సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కదా యుధ్ధం చేయాలి. ఇలా రోజంతా యుద్ధరంగం నట్టనడుమ మంతనాలా, నకరాలు కాకపోతే.
కొంతమందికి చాంతాడంత పేరు వుంటుంది. వాళ్ళు నిజ జీవితంలో ఎలాంటి తలనొప్పులు ఎదుర్కొంటారో తన స్వీయ జీవితం చెప్పి నవ్విస్తారు. ఓ మాష్టారంటారూ : ఒరే నువ్వు పరీక్షలకు చదవక్కర్లేదురా. నీ పేరు మొత్తం రాస్తే 35 మార్కులు గ్యారంటీ.
''ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం'' లో సరదాపడి విజిటింగ్ కార్డులు వేయించుకున్నారు సోదరులు. తత్ ఫలితంగా వాళ్ళు పడ్డ కష్టాలు మనల్ని నవ్వుకునేలా చేస్తాయి.
ఫేస్బుక్ పుణ్యమాని మనకు లైకులు, లైకుల పిచ్చి గురించి తెలుసు. అయితే ఒకాయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందరినీ లైకులు ''అడుక్కుంటాడు'' అంటారు ''అడుక్కు తింటున్నాడు'' అన్న కథలో. ఆ నస భరించలేక అందరూ అతన్ని ఎలా బ్లాక్ చేసినదీ మిగతా కథ.
''రాత్రికి రంభ కావాలి'' లో ఆ వాక్యం వస్తుంది. విన్నవాళ్ళు నాలాగే స్పందిస్తారు. నాకు రంభ అనే ఒక అప్సరస గురించి తెలుసు. అయితే రంభ అంటే అరటి పండు అన్న అర్థం కూడా వుందట. ఆ ఆఫీసులో జీతాలు పుచ్చుకునే పై అంతస్తు వారు ''ఎంతగా దిగజారారో మీరు'' అనీ, కింది అంతస్తు వారు వెళితే వారే ''డబ్బులంటే చాలు పైపైకి ఎగేసుకుంటూ వస్తారు మీరు'' అంటారు.
''నేను వచ్చేదాకా ఆగదా పాము?'', ''టికెట్ ముక్కల కుంభకోణం'' వగైరా కథలలో కొన్ని ఊహించలేని సందర్భాలు నవ్విస్తూనే చెబుతారు.
ఇప్పుడు లోకం యమా సీరియస్ అయిపోయింది. జీవితం కూడా. ఇలాంటి పుస్తకాలు చదివితే మనసు కాస్త తేలిక పడుతుంది.
- పరేష్ ఎన్ దోషి