Authorization
Mon Jan 19, 2015 06:51 pm
"Immature poets imitate; mature poets steal; bad poets deface what they take, and good poets make it into something better or at least something different"
- T.S. Eliot
తెలుగు సాహితీ ప్రపంచంలో వేళ్ళ మీద లెక్కపెట్టే కొద్ది మంది కవులు, కథకులు, నిరంతరం తమదైన మార్గం లో సాహితీ సేద్యం చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏ అవార్డులు రివార్డుల కోసమో! లేక ఏ విమర్శకుల మెప్పు కోసమో! కథల్ని, కవితల్ని రాయట్లేదు. వాళ్ళు ఒక సాహితీ నిబద్ధతతో రాసుకుంటూ పోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పుల్ని, తమ చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని ఒక బాధ్యత కల్గిన కళాకారులుగా, కవులుగా, కథకులుగా సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ సాహితీ సృజన చేస్తున్నారు. సరిగ్గా అటువంటి సృజనకారుల కోవలోకి వచ్చే వ్యక్తే డాక్టర్ వెల్దండి శ్రీధర్.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకవృత్తిలో విద్యార్థులకు తెలుగు సాహిత్య పాఠాలు బోధిస్తూ తన ప్రవృత్తి అయిన సాహిత్య మార్గంలో ఉత్తమ సాహిత్యాన్ని అందించడంలో ముందు వరుసలో ఉన్న ప్రతిభావంతుడైన కవి, కథక, విమర్శక, పరిశోధకుడు డాక్టర్ శ్రీధర్. తను నమ్మిన సిద్ధాంతాల కోసం అన్ని సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్రవేసుకున్న ఒక అరుదైన తెలంగాణ సాహిత్య కారుడు డాక్టర్ వెల్దండి. ఈ మధ్యనే తన మొదటి కవితా సంకలనం ''ఆసు''కి పీచర సునీతారావు మెమోరియల్ అవార్డ్ పొందడం ఆయన సాహితీ కృషికి సరియైన గుర్తింపుగా భావించవచ్చు. అతడు వెలువరించిన మొట్టమొదటి సంకలనానికే ఈ అవార్డ్ రావడం ముదావహం. అయితే ఈ అవార్డ్ పొందడం మూలానా శ్రీధర్ మీద కవిగా బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు. మరి ఈ అవార్డును పొందిన ఆనందంలో ఆయన మరింత ఉత్సాహంతో విరివిగా మెరుగైన కవిత్వం రాస్తాడేమో వేచిచూడాలి.
''ఆసు'' కవిత్వ సంకలనములో కవిత్వం ఒక మూస ధోరణిలో కాకుండా సమాజంలోని వివిధ పార్శ్వాల్ని తనదైన ప్రత్యేక అభివ్యక్తితో వ్యక్తపరుస్తాడీకవి. తీసుకున్నవస్తువు ఏదైనా చిన్న చిన్న పదాలతో కవితామయం చేయటం శ్రీధర్ ప్రత్యేకత. శ్రీధర్ కవిత్వం గురించి జూకంటి క్లుప్తమైన ముందుమాటలో... ''....వస్తువు ఎన్నికలో అభివ్యక్తిలో తనదైన తొవ్వను ఎన్నుకొని కవిత్వంలోకి అడుగులు పరావర్తం చెందాడు. వాటిని మనముందు ఆగామి కాలానికి అడుగుజాడలుగా కాంతిమయం చేయాల్సి ఉంది. దీనికి కావలసిన దినుసులు నిర్మొహమాటమైన దృక్పథం, తాత్త్విక నిరంతర చింతన ఈ ఆసు కవితా సంపుటిలో పుష్కలంగా కనిపిస్తుంది.'' అంటారు.
ఈ సంకలనములో మొత్తం 60 కవితలు ఉన్నాయి. ఈ అరవై కవితలు కూడా ఏ కవితకాకవిత వస్తుపరంగా, ఆభివ్యకిపరంగా, భాషాపరంగా, విశిష్టతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఈ సంపుటిలో చివరిదైన ''ఆసు'' కవితా ఖండికను ఈ కవిత్వ సంకలనానికి శీర్షికగా పెట్టడం చాలా సముచితంగా ఉంది. తను చేనేత కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆ నేత కళాకారుల కష్ట నష్టాల్ని వాళ్ళ నేతనేసే దారప్పోగుల సందుల్లోంచి జారి పడుతున్న కన్నీటి దారాల్ని చాలా దగ్గరగా చూసిన అనుభవంతో ఆసు యంత్రం అవసరాన్ని ఇలా ఆవిష్కరించాడు.
సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు పోగులన్ని ఆసు చుట్టే తిరుగుతుంటాయి... అంటాడు.
గ్లోబలైజేషన్, ఆధునిక యంత్రాల మూలాన చేనేత కార్మికులు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమై వలసలు పోయే పరిస్థిని కళ్ళల్లో బొమ్మకడతాడీకవితలో..
ఆసును అమ్మేసి
మగ్గాన్ని ఆటకెక్కించి
మరయంత్రాల కాబూసులో చిక్కుకుపోయిన అన్న
అస్థిపంజరమై తేలి
శ్వాస కోసం తపించే నేత కార్మికుల జీవితాల్లో భాగమైన ఆసు యంత్రమే కన్నీరు పెడుతుందంటాడు.
శ్రీధర్ తన కవితలకు శీర్షికలు ఎన్నుకోవటంలో కూడా సృజనాత్మకను చూపి తన కవితలను రంగులద్దిన పొగులంటాడు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు పడే బాధను ఇలా కవిత్వీకరిస్తాడు.
రాజ్యపుగారడీలో పంటలన్నీ
ముఖం వేలాడేస్తున్నాయి
ఇక మిగిలింది
నన్ను నేను మట్టిలో నాటుకోవడమే
మరు జన్మలోనైనా ఖడ్గమై మొలిస్తేబాగుణ్ణు
పంటను పెంటలా చూసేవాడి
తలను తుత్తునియలుచేయడానికి.
ఆధునిక యుగంలో మానవ విలువలు రోజురోజుకు క్షీణించి పోతున్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు అభద్రతా భావం పెరిగిపోతుంది. ఏ టీవీలో చూసినా, పేపర్లో చూసినా, ఆడవాళ్ల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నెలల పసిపిల్లల నుంచి తొంబయి ఏళ్ల ముసలవ్వల్ని కూడా అతిదారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి శిక్షలనుంచి తప్పించుకు తిరుగుతున్న మగాళ్ల అంగాలను కత్తిరించాలని ఈ కింది కవితలో చెబుతున్నాడు.
కళ్లులేని మృగాల మర్మాంగాలకు
వాంఛలే కానీ వయసులు కనిపించవు
ఇంద్రునికి దేహమంత కళ్ళున్నట్లు
వీళ్లకు తనువంతా ముళ్లలా పెనిస్ లే
అంటూ కవి తన ఆవేదనను, ఆక్రోశాన్ని అవ్యక్తమైన బాధను పై కవితా పంక్తుల్లో గుండె బరువెక్కేలా కవిత్వమవుతాడు.
నాయన, రొట్టె, నేత ఇల్లు, ఎక్కాలపుస్తకం, జ్ఞాపకం ఊపిరైనప్పుడు. ముఖ్యంగా రొట్టె కవితను తన చిన్నప్పటి ఆకలికేకల దుఃఖానుభవాల్ని, కన్నీళ్లసిరాలో ముంచి కవితావస్త్రం నేసి మనపై కప్పుతాడు. ''రొట్టె'' కవితలో వాళ్ల అమ్మ శ్రమను ఆవిష్కరిస్తాడు.
సూర్యుడిని రొట్టెలా చేస్తూ
నాయిన దేహంపై కాల్చుతుంది అమ్మ
చెమటను రుచిగా అద్ది
ఇంటి లోకపు
ఆకలిని చల్లార్చుతుంది
రొట్టె మట్టిపాటకు ఆదిపల్లవి
నా అక్షరాలకు ఒక అనుపల్లవి.
ఏ కవి తన అమ్మ నాయిన మీద రాసినా, ఆ కవితలు తప్పక పాఠక విమర్శకుల హృదయాల్ని కదిలిస్తాయి. ఆసు సంకలనంలో శ్రీధర్ రెండు, మూడు కవితలు వాళ్ళ నాయిన మీద రాసిండు. ''రొట్టె'', ''ఆసు'', ''నేత ఇల్లు'', ''ఏమి మిగిల్చి పోయిండు'', ''నాయిన'' ఇలా ఏ కవిత తీసుకున్నా వాళ్ళ నాయిన ప్రస్తావన లేకుండా కవితలు ముగించలేదు. శ్రీధర్ కవిత్వానికి ప్రధాన భూమిక తన వూరు, ఇల్లు వాళ్ళ అమ్మానాన్నలు, వాళ్ళ వృత్తి అయిన చేనేత. ఈ కింద రాసిన ''నాయిన'' మీద కవిత మన గుండెల్ని పిండేసే కవితగా చెప్పుకోవచ్చు.
కుటుంబ భారాన్ని
భుజానికెత్తుకొని
పొదరిల్లును
పదిలంగా కాపాడే జీవగర్ర
వాళ్ల నాయన.
ఈ మాయా ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పిన నాయిన నిజంగా ఒక విజ్ఞానవంతుడు .
శ్రీధర్‌లో ప్రజలను ఆలోచింపచేసే కవే మాత్రమే కాకుండా ఒక ఆజ్ఞాత ప్రేమకవికూడా ఉన్నాడని''జ్ఞాపకం ఊపిరైనప్పుడు'' కవిత చదివితే ఇట్టే అర్థం అవుతుంది...
దేహం నిండా నీ మాటల్నే నింపి
నా కళ్ళకు ఇంద్రధనస్సును తొడిగావంటాడు
ప్రియురాలు దూరమైతే ప్రియుడి జీవితం నీరు లేని వాగులాగా, పచ్చదనం లేని చెట్టులా, చుక్కలు లేని ఆకాశమై ప్రాణ వాయువు లేని ఊపిరితిత్తులవుతాయి అంటాడు. కళ్ళకు ఇంద్రధనస్సులు తొడగడం అనే అద్భుతమైన అభివ్యక్తి శ్రీధర్ భావనా పటిమ ఎంత హృద్యమయ్యిందో అర్ధం అవుతుంది.S.T.Colridge చెప్పిన ''Best words in the best order is a poem'' అనే definition శ్రీధర్ కవిత్వానికి చాలా apt గా సరిపోతుంది.
శ్రీధర్‌కి దేహం అనే పదం మీద మమకారమో లేక యాదృచ్చికంగా రాసాడో తెలియదు కానీ దాదాపు ఆసు సంకలనంలోని అన్ని కవితల్లో దేహం అనే పదాన్ని కవితాత్మకంగా రాసాడు. ఆ దేహం అనే పదాన్ని పరిహరించుకొని ముందు ముందు ఇంకా మంచి కవిత్వం రాస్తారని కోరుకుంటున్నాను.
- డాక్టర్ బాణాల శ్రీనివాసరావు
9440471423