Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరిగిన దూరానికి
రోజురోజుకూ నీ ప్రేమ
ధృవంలా కరిగిపోతే..
ఒకప్పటి జ్ఞాపకాల సముద్రం
ఉప్పెనై మీద పడ్డట్టుంది
నీకేమనిపిస్తుంది?
ఆ చెక్కిళ్ళ చెమ్మని చెరిపిన చేతులు
ఇప్పుడు ఎడారులైతే..
ఆ స్పర్శలనే నువ్ చెరిపేస్తే..
నిర్జీవమే నరాల్లో ప్రవహిస్తుంది.
మరి నీకేమనిపిస్తుంది?
నా నుదుట నీ తడిని
ఉత్త లవణగీతమని
నువ్ కొట్టిపడేస్తే
తనువణువణువునూ
బాణాలు తాకిన బాధ.
నీకేమనిపిస్తుంది?
ఇరువురి నడుమ
ఇంకిపోని మాటల బావిని
ఏకపక్షంగా మూసేస్తే..
ఉల్కాపాతంలా నేలబడ్డాను.
మరి నీకేమనిపిస్తుంది?
దూరాన్ని లెక్కచెయ్యని పాదాలు.
రెండు రెళ్ళు ఒకటనుకున్నాను.
గణితాన్ని
తప్పుగా అర్థం చేసుకున్నాను.
నీ లెక్కలేవీ అర్థంకాక
అనంతమైన అంకెలు
మీద పడ్డట్టుంది.
నీకేమనిపిస్తుంది?
- పట్లూరి నర్సింహారెడ్డి
9849150476