Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడలు దగ్గర అగ్గువకు కొని
వాడు!
అత్తకు ప్రియంగా కట్టబెట్టగలడు!
అక్కకు అనుమానం రాకుండా
చెల్లెలితో!
చెల్లెకు ఆనవాలు తెలువనీయకుండా
అక్కతో!
జమిలిగా జట్టు కట్టగలడు!
గాలానికి ఎర గుచ్చకుండానే
మీనాల మీసాలను
అవలీలగా పట్టేయగలడు!
వ్యాపార అనుభవాన్ని గడించి
చలువ గదుల్లో సేదతీరుతూ
వాణిజ్య సూత్రాల చాణక్య వినియోగంతో
అపార సంపదలను
ఆసాంతం కొల్లగొట్టగలడు!
వేలజనాల్ని వెర్రివారిగా తలుస్తూ
వేడుకగా! వ్యాపార సునామీల్ని
వేలంవెర్రిగా సృజించగలడు!
పేదలను ఉద్ధరించడానికే తను జన్మనెత్తానని
అమాయకజీవులను
అసాధ్యంగా బుట్టలోవేయగలడు!
వీడు!
సముద్రంలోకి దిగితే
తిమింగలమైనా వీని తీరుచూసి
తోక ముడువాల్సిందే!
అలవోకగా వలలు అల్లితే!
మత్స్య జాతి జాతంతా
మురిసిపోయి వచ్చీ
అమాంతం వలలో పడిపోవాల్సిందే!
అవి కట్టుడు నావలైనా
కుట్టుడు పడవలైనా
సముద్రుడు సైతం సాహో అనాల్సిందే!
తెప్పతోటి తెల్లవారే బతుకులు
మరపడవలతో పోటీపడతాయా?
నీటిమట్టాన్ని చూసి
లోతును చెప్పగలిగే వీని ప్రతిభతో
పోర్టు నిర్మాణ నిర్వహణల్లో నిబద్ధతను
పరిణామ పరిమాణాన్నీ పసిగట్టలేడా?
పెద్దోడి మీద పేట్రేగలేక
చిన్నోడి మీదా చిరుబురులాడకపోతే
బతుకు!
కుక్కలు చింపిన విస్తరి కాదా?
ఆగ్రహ జ్వాలలతో ఎగసిన అలలు
పున్నమిపోటై
పునాదుల్నే పెకలించగలేవా?
- కరిపె రాజ్‌కుమార్
8125144729