Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కపిల రాం కుమార్, 9849505033
గ్రామీణ ప్రజల సంస్కృతిని ఆచార వ్యవహారాలను కళ్ళకు కట్టినట్టుండే కథల సృజనకారుడు జాతశ్రీ (జంగం చార్లెస్) తెలంగాణ నివాసియైనా తన కథల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో కవిగా, రచయితగా, నవలాకారుడుగా సుపరిచితుడు. బడుగు బలహీన వర్గాల జీవితాలను దగ్గరగా పరిశీలించి, పరామర్శించి, పరిశోధించి వారితో మమేకమై వాస్తవ గాథలందించడంలో కృతకృత్యుడైనాడు. ప్రజా కథకుడుగా ముందువరస ఆయనదనటంలో సందేహం లేదు. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల వ్యధలను మనకు అందించ్నా కవి. ఆయా ప్రాంత ప్రజల భాషను ప్రతిబింబ చేయయడంలో ఆయనకు ఆయనే సాటి. అసలు సిసలు గ్రామీణ భాషనే ఉపయోగించాడు.
1943 ఆగష్టు నాలుగున నల్గొండ జిల్లా మట్టపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో పుట్టాడు. ఉపాధ్యాయుడుగా ఖమ్మం జిల్లా ఇల్లెందులో చేరి, కొత్తగూడెంలో స్థిరపడినాడు. కవిత్వం, కథ, నవల ప్రక్రియలలో సాహిత్య కృషి సలిపాడు. స్త్రీ - కవితా సంపుటి, ఆర్తారావమ్, కుట్ర, ప్రభంజనం, చలివేంద్రం కథల సంపుటులు. ఇవేకాక సింగరేణి కార్మికుల వ్యధాభరిత జీవిత చిత్రణగా సింగరేణి మండుతోంది అనే నవల ప్రఖ్యాతమైంది. వెదురుపోదలు నినదిణ్చాయి, బలిపశువు తన నవలలే.
వామపక్షవాది, మానవతావాది, ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘంలో డా. దిలావర్తో కలసి విశేహ కృషి జరిపాడు. మహాసభలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి తోను, దర్మిలా తెలంగాణా సాహితీతోనూ తన వంతు సహకారం చివరి రోజుల వరకు కొనసాగించారు. ఎన్నో అవార్డులు, సత్కారాలు ఆయన చెంతకు చేరారు. 2018 నవంబరు 4 న కన్నుమూశాడు. వారి కథలలో పది కథలను ఎంపిక చేసి కథాస్రవంతి పేర గుంటూర్ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం వారు 2023 ఫిబ్రవరిలో ప్రచురించారు. ఆ కథలను సూత్రప్రాయంగా పరిచయం కావిస్తాను.
విధ్వసమ్ కథలో వూరూరా తిరిగి బతుకులు వెళ్ళదీసే దొమ్మరి వారి జీవన కడగండ్లు కంట తడిపెట్టేలా కరుణ రసం మనలను చకితులను చేస్తుంది. ఆ కథలో ఓ కుర్రాడు వయసు పది దాటి రెండేళ్ళయినా ఎనిమిదేళ్ళ కుర్రాడిలా, పిర్రలు పూరా బయటకు పడిన చినుగుల లాగులో వాడిని దూరాన్నుంచి చూస్తే బొగ్గు రంగేసిన దిష్టిబొమ్మలా దగ్గరనుండి చూస్తే దారిద్రానికి దిష్టి తీసిపారేసిన పంగల కర్రలా కబడతాడు. నే నడ్వా, గా..గాడిదనెక్కుతా... అంటూ ఆరంభమౌతుంది. చివరిలో దొమ్మరి పాశం పరిస్థితి గమనించిన కొండాలు ఒక్కదుటన లేచాడు. వాని ముకం కండగడ్డలాగుంది. నిలబెట్టిన గడలని తన్నిపడేస్తూ. ''తూ నీత్తల్లి దొమ్మలాటంట దొమ్మలాటలు. బత్కటానికి దొమ్మలాటలే ఆడాల్నా?...'' అనే నిరాశావాదపు మాటలతో సామాన్లు సర్దుకుని మరో వూరు పయనమవడంతో ముగుస్తుంది. కడుపు నింపని వృత్తిపై విసుగు కనబడుతుంది.
చలివేంద్రం కథలో కుండలు తయారుచేసే కుమ్మరి జీవితంలోని ఆటుపోట్లు, రోజు గడవని దైన్య స్థితి, పైపెచ్చు పోలీసుల జులుం లాఠీ దెబ్బలు, బొక్క బోర్లా పడ్డ బతుకులు రోడ్డునేలా పడ్డాయో కళ్ళకు కట్టిస్తాడు జాతశ్రీ.
అంతర్ముఖం కథలో దినదిన గండం నూరేళ్ళాయుశుగా రోజూ చస్తూ బతికే గీత కార్మికుల లోట్టెలెలా ఒట్టిపోయిన తాడివనం గౌడుల బతుకు అటు రైతుగా కానీ, యిటూ వృత్తిలో సజావుగా కాలం గడపలేని త్రిశంకు స్వర్గపు కన్నీటి కథ మనకు సాక్షాత్కరిస్తుంది. వృత్తులు గ్లోబలీకి బలి అయ్యే తీరు కనబడుతుంది.
విధ్వంసం అనే కథ 2003 సాహిత్య ప్రస్థానంలో, అనివార్యం అనే కథ 2005 జూలై నవ్య పత్రికలో, వ్యక్తిగతం అనే కథ 2004 సాహిత్య ప్రస్థానంలో, కూట అనే కథ 2004 వట్టికోట ఆళ్వారుస్వామి పురస్కారమందుకుంది. వడ్రంగి జీవితగమనమే ఇందులో కనబడుతుంది. యాంత్రికత వ్యవసాయంలోకి చేరి, ముఖ్యమైన పనిముట్లు నాగలి, పళ్ళగొర్రు, ఎడ్లబండి మరుగున పడి, అల్లకల్లోలమైనదని తెలియజేసే కథే కుట్ర. అటు వృత్తిని ఇటి భృతిని దెబ్బతీసిన తీరు ఇందులో వివరించబడింది.
చిరునామా అనే కథ జూలై 2005 సాహిత్య ప్రస్థానంలో. ఒంటరి అనే కథ 2007 నవ్య వీక్లీలో చోటు చేసుకున్నాయి.
సబ్ టీక్ నహీ హై... అనే కథ పట్టణ ప్రాంత కాలనీలో నేపాల్ నుంచి పొట్టపోషణకూ కాపలాకాసే గూరా? జీవనాన్ని ఈతిబాధలను అద్దం పట్టేలా మనముందు వుంచడంలో జాతశ్రీ సఫలీకృతుడయ్యాడు
మరీ హృదయం ద్రవించేలా చేసిన కథ అనివార్యం. మానవ మలాన్ని చేతులతో గంపకు యెత్తి మరుగుదొడ్లను శుభ్రంచేసే పాకీ/ సఫాయిల జీవితం. వారి బిడ్డలు చదువుకోసం పడే ఆరాటం కొడుకు అక్షరాస్యుడైతే తండ్రి పొందే ఆనందం, కొలువు దొరకక పడే కష్టాలూ, ఇలాంటి కడజాతి వారిపై అప్పుడప్పుడు పోలీసులు చేసే లాఠీ క్రౌర్యం మన మసును కలచి వేస్తుంది.
చివరిగా వలస అనే కఠ (కుట్ర అనే కథల సంపుటిలోది) 2020లో కొనసాగిన వలసల బతుకు కంటే ముందుగా 2007లో వచ్చిన వలస కూలీల బతుకులెలా ఛిద్రమైనాయో తెలుసుకోవచ్చు.
''కూలోళ్ళ వలసల గురించి అసెంబ్లీ హోరెత్తిపోతూనే వుంటుంది
కూలీలు దూరాభారాలు చూడకుండా వలసలు పోతూనే వుంటారు.''
నాడూ అంతే... నేడు అంతే.... బతుకు కోసం, మెతుకు కోసం
శిల్పం, రూపం, సారం అంటూ సిద్ధాంతాలు వెతకవద్దు. కానీ ఈ కథలలో పాత్రోచిత భాష, ఆయా వృత్తుల ఆచారాలు, కట్టుబాటులు, సుఖ దుఖాలు కావలసినంత దొరుకుతాయి. మరింత పరిశోధించ వలసిన కథలు జాతశ్రీ మనకు ఇచ్చి వెళ్ళాడు.
ఆ కథలలో జనజీవన సరిగమలను, అప స్వరాలను, కొట్టవచ్చినట్టు మనకు ఎత్తి చూపుతాయి. వాటిని తీవ్రంగా గమనంలోకి తీసుకుని పరిశోధించవలసివుంది.