Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య కారులకు వారసులు ఉండరు. డాక్టర్ల పిల్లలు డాక్టర్లుగా ఐఏఎస్ పిల్లలు ఐఎఎస్ లుగా రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులుగా ఎదుగుతారు లేదా ఎదిగించబడతారు. కవులు రచయితల పిల్లలు ఆ రంగం లో రాణించడం కష్టం ప్రయత్నించడం అరుదే. సాహిత్య అభిమాని కవి తెలుగు పండితులైన యాదయ్య కుమారుడు అలాంటి అరుదైన వ్యక్తి. ఆయనే చంద్రకాంత్ గౌడ్. చంద్రకాంత్ తన జీవితాన్ని బోధనకు, సృజనకు అంకితం చేయాలనుకున్నాడు. అందునా తెలుగు బోధన తో ప్రైవేటా, గవర్నమెంటా ఆ తర్వాత విషయం. తెలుగు టీచర్‌గా, లెక్చరర్‌గా మళ్లీ టీచర్‌గా తెలుగు బోధనలో మునిగి తేలుతున్నాడు. అంతేకాకుండా విద్యార్థులలోని సృజనకు పదును పెట్టడంలో మునిగి, తను రచయితగా మారిపోయాడు. బాల సాహిత్యకారుల జాబితాలో చేరిపోయాడు. ఆయన గమనాన్ని చూస్తే చైతన్యమును ఎవరైనా చేతులు కట్టుకు కూర్చోమనునా అన్న డా. సి.నారాయణరెడ్డి మాటలు జ్ఞాపకం వస్తాయి.
చంద్రకాంత్ గౌడ్ తీసుకువస్తున్న ఈ చిన్న బాలల కథల సంపుటి బాలల చుట్టూ తిరుగుతుంది. వస్తువు బాలలది. లక్ష్యం కూడా బాలలే. బడిని ఎగవేసినట్టు నటించే ధనుష్ చెట్ల ప్రేమికుడి కథ ఒక కథ. అమెరికా నుండి సొంత ఊరు చూడడానికి వచ్చి బడి స్థితి చూసి, చలించి కోటి రూపాయలు పెట్టి నిర్మించిన వినోద్ తీర్చుకున్న ఊరి రుణం ఒక కథ. మహేష్ కొట్టుకుపోతుంటే ప్రాణాలకు తెగించి కాపాడిన సాహస బాలుడు రాజేష్. బాల్య వివాహాన్ని పట్టించిన గణేష్‌ది ఒక కథ. అనాధ బతుకమ్మ ఇతరుల సహాయంతో చదివి కలెక్టర్ అవడం, సర్పంచ్ అనుకోగానే అధికారు లతో స్పందించి చెరువును తవ్వించి మురిసిన పల్లె. చిన్ననాటి గురువును తన ఇంట్లో శాశ్వతంగా ఉంచుకొని డాక్టర్ సంజీవ్ వైద్యం చేస్తూ 'ఆచార్యదేవోభవను' నిజం చేయడం లాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఇందులో 35కి పైగా ఉన్న కథలన్నీ నీతి కథలు. ప్రతి కథ ఏదో ఒక పత్రికలో బాల సాహిత్యం శీర్షికలో ప్రచురించబడినది. ప్రతి కథ కింద దాని నీతి కూడా ప్రక టించబడింది. ప్రతి కథను విశ్లేషించవచ్చు కానీ ఇందులో విశ్లేషణ చేస్తేనే అర్థమయ్యే కాటిన్యమున కథలు కావివి.
సరళత, సూటిదనం ఈ కథల లక్షణం. పూర్తిగా ఆదర్శమైన కథలు. ఏ పిల్లవాడైనా బడి మానేసి గార్డెనింగ్ చేస్తాడా అని, ఏ యువకుడైన కోటి రూపాయల సొంత డబ్బు పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టిస్తాడా అని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏ కుర్రాడైన ఇంకొక కుర్రాన్ని కాపాడతాడ అని, ఒక ఫోన్ తో బాల్య వివాహం ఆగిపోతుందా అని, సహాయం అడగానే అనాథ విద్యార్థి కలెక్టర్‌గా ఎదిగిపోతుందా అని పాఠకుడికి సందేహాలు వస్తాయి. బాలల కోసం రాసినవి కాబట్టి లక్షపరంగా ఆహ్వానించ దగిన కథలే. నిర్మాణ పరంగా మరింత పరిణతి సాధించవలసిన అవసరం కూడా ఉంది. ఇది చంద్రకాంత్ తెలుగు సంపుటి కాబట్టి ఆయన రచయితగా తొలి అడుగులు విజయవంతమైన లెక్క. భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు చేసే హామీ ఇందులో ఉంది.
- ఏనుగు నరసింహారెడ్డి
డిప్యూటీ కలెక్టర్, మేడ్చల్ జిల్లా