Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమారు పుష్కర కాలం నిరీక్షణ తర్వాత తెలంగాణలో వెలువడ్డ గ్రూప్1 నోటిఫికేషన్‌ను ముందు నుంచే వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. జనవరిలో విడుదలైన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల మీద వివాదం రాజుకుంటున్నది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ద్వారా ఎంపిక చేసి రూపొందించిన మెయిన్స్ అర్హత జాబితాపై పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. నోటిఫికేషన్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు తెచ్చిన జీ.ఓ.నెం.55 ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నది. గతంలో వెలువడ్డ అన్ని గ్రూప్1 నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లకు అతీతంగా 1:50 నిష్పత్తి చొప్పున మెయిన్స్‌కు అర్హత పొందిన వారి జాబితా రూపొందించేవారు. కానీ ఇప్పుడు వెలువడ్డ నోటిఫికేషన్లో అందుకు భిన్నంగా రిజర్వేషన్ల వారీగా మెయిన్స్ అర్హత జాబితా రూపొందించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని పలు కేసులలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పలువురు అభ్యర్థులు ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. వివాదాలు సమసిపోయి సజావుగా ప్రక్రియ సాగుతోందని భావిస్తున్న తరుణంలో సరికొత్త వివాదానికి తెరలేచే అవకాశమున్నదని మేధావులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మునుపెన్నడూలేని విధంగా అధిక సంఖ్యలో పోస్టులు ఉండడం, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తొలి నోటిఫికేషన్ కావడం, సుమారు మూడు లక్షల మంది పోటీ పడటం, కొత్తగా అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రిలిమ్స్ స్థాయిలోనే అన్ని రకాల రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల సామాజిక వర్గాల వారికి నష్టం జరిగింది. మహిళా కోటాను హైకోర్టు తీర్పు మేరకు సమాంతరంగా అమలు చేస్తామని చెప్పినప్పటికీ బ్రేక్ అప్ లిస్ట్ ఇవ్వకుండా పాత రోస్టర్ పాయింట్ల ఆధారంగా జాబితా రూపొందించడం సరికాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాలోజీ బదావత్ కేసులోనూ, జాఫర్ సాహెబ్ కేసులోనూ ప్రిలిమినరీ స్థాయిలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని కోర్టులు విస్పష్టంగా తీర్పులు ఇచ్చాయి. అంతేకాక ఎంపిక సమయంలో ప్రతిభతో పాటు సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ సామాజిక న్యాయం పేరిట తొలిదశలోనే ప్రతిభావంతులను నిలువరించడం సరికాదని అది ప్రాథమిక హక్కు 16(4)కు విరుద్ధమని పలు సందర్భాలలో కోర్టులు వ్యాఖ్యానించాయి.
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఏర్పరచిన మల్టీజోన్ల వారీగా మెయిన్స్ అర్హత జాబితాను ఎంపిక చేశారు. ప్రిలిమినరీ స్థాయిలోనే రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల అన్ని సామాజిక వర్గాల అభ్యర్థుల అవకాశాలు మునుపటితో పోలిస్తే సన్నగిల్లాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు మల్టీ జోన్ 2లో బీసీ డి జనరల్ అభ్యర్థి ఓపెన్ కోటాలో 68పోస్టులకు, బీసీ డి లోని 4 పోస్టులకు సంబంధించి మాత్రమే 1:50 నిష్పత్తిలో అవకాశం ఉంటుంది. అంటే ఓపెన్‌లో 3,400, బీసీ డిలో 200 మందిలో మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ మల్టీ జోన్ 2లోని మొత్తం 268 పోస్టులకు అనుగుణంగా 1:50నిష్పత్తిలో చూస్తే ఆ అభ్యర్థికి 13,400మందిలో అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ స్థాయిలోనే రిజర్వేషన్లను పాటించడం వల్ల అవకాశాలు ఇలా సన్నగిల్లాయని అన్ని సామాజిక వర్గాల అభ్యర్థులు ఇటు ప్రభుత్వ వర్గాలకు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నివేదించడంతో పాటు అటు హైకోర్టునూ ఆశ్రయించారు.
ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు దీర్ఘంగా ఉండటం, ప్రశ్నల్ని చదవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, చాలావరకు ప్రశ్నలు ప్రవచనాల రూపంలో సివిల్స్ స్థాయిని మించి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దాని వల్ల అభ్యర్థులందరు సుమారు 30 నుంచి 35 ప్రశ్నలు చదవకుండానే జవాబులను గుర్తించాల్సి వచ్చింది. దీనివల్ల అదృష్టం వరించిన వారికి కాస్త ఎక్కువ మార్కులు వచ్చాయి. అలాంటి వారిని ప్రతిభావంతులుగా గుర్తించలేమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ లోపాన్ని అధిగమించుటకు నెగెటివ్ మార్కులు సరిపోతాయి. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష సివిల్స్ పరీక్షతో సమానమైన స్థాయిలో ఉన్నప్పటికీ, సివిల్స్ పరీక్షలో ఇచ్చిన సమయం కంటే తక్కువ సమయాన్ని ఇవ్వడంతో పాటు నెగెటివ్ మార్కు లేకపోవడం వల్ల అదృష్టవంతులకు అవకాశం వచ్చిందని పలువురు ఆశావహులు వాపోతున్నారు.
గత 2011 గ్రూప్1 నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు పూర్తి అయి నియామక ప్రక్రియ చేపట్టే సమయంలో ప్రిలిమినరీ ప్రాథమిక కీలో తప్పులు దొర్లిన కారణంగా సుప్రీంకోర్టు ఆ ప్రక్రియను రద్దు చేసి తిరిగి మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయాన్ని గ్రూప్1 ఆశావహులు గుర్తుచేస్తున్నారు. కాబట్టి ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు పట్టింపులకు పోకుండా గతంలో పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆధారంగా తీసుకొని మధ్యేమార్గంగా జీ.ఓ.55ను సవరించడంతో పాటు అవసరమైతే నిష్పత్తిని పెంచి అభ్యర్థులకు అవకాశాలు ఎక్కువ సంఖ్యలో కల్పించడం ద్వారా ఈ ప్రక్రియను వివాదాల సుడిగుండం నుంచి గట్టెక్కించొచ్చు.
- భువనవాణి