Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లోను, విప్లకారులు, సోషలిస్టులల్లోనూ అగ్రశేణికి చెందిన వారిలో భగత్‌సింగ్ ఒకరు. అంతే కాదు, ఈ దేశంలో మొట్టమొదటి మార్క్సిస్ట్ సిద్ధాంత ఆలోచనా పరులలోకూడా ఆయన ముఖ్యుడు. ఉరి కొయ్యకు తల వంచని ధీరత్వం ఆయనది. అశేష పీడిత జన విముక్తికై గొంతెత్తిన ''ఇంక్విలాబ్ జిందాబాద్'' రణ నినాదమై ధ్వనిస్తాడు. ప్రతి విప్లవకారుని హృదయంలో... ఆయన ఆశయాలు నిత్యం సజీవమై ఉన్నాయి. ఆనాటి ఆయన ముఖ్య అనుచరులంతా తరువాత కాలంలో కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలంగా కేంద్రకమిటీ స్థాయిల్లో వీరు పనిచేశారు. ఇది గమనించాల్సి ముఖ్య అంశం. గొప్ప విషయం. వారి రచనల ద్వారా ఎన్నో అంశాలు తెలుస్తాయి. శివవర్మ, విజయకుమార్ సిన్హా, గణేశ్ శంకర్ విద్యార్థి, అజరుఘోష్, జయదేశ్ కపూర్, భగవతీచరణ్, డాక్టర్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్, సత్యభక్త, సెహగల్, రాధా మోహన్ తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కేంద్ర నేతలుగా ఉన్నారు. 1907 అక్టోబర్ 7వ తేదీన పంజాబ్‌లోని బంగా గ్రామంలో పుట్టిన భగత్‌సింగ్‌ను బ్రిటిష్ పాలకులు 1931 మార్చి 23వ తేదీన 'ఉరి' తీశారు. మతాన్ని - సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టడమే అతనికి మనమిచ్చే నేటి నివాళి. దేశ మాత దాస్య శృంఖలాలు బద్దలు కొట్టాలనే దృఢ సంకల్పంతో దేశంలో విడి విడిగా గ్రూప్‌లుగా పనిచేస్తున్న విప్లవ తీవ్ర వాద సంస్థల్ని ఒక సంస్థగా కలిపి దేశంలోని యువతనే గాక, యావత్ భారత ప్రజల్ని విప్లవంవైపు చూసేలా వీరోచిత కృత్యాలు భగత్‌సింగ్. ఆయన సహచరులు కొద్ది కాలంలోనే చేశారు. అనుశీలన్ సమితి, యుగాంతర్, గద్దర్వీరుల, హిందుస్థాన్ ప్రజాతంత్ర సంఘం'' నవ జవాన్ భారత్ సభ - లాంటి సంస్థల్ని ఏకం చేసిన ''హిందూస్థాన్ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం'' స్థాపించి బ్రిటిష్ పాలకుల్ని గజగజలాడించిన విప్లవ సింహం భగత్‌సింగ్. 1931 అక్టోబర్ 3 విమలా ప్రతిభాదేవి పరిశోధనా గృహంలో భగత్‌సింగ్ విప్లవ రూపకల్పన డాక్యుమెంట్ లభించింది. విప్లవసాధనకై తన కృషి ఆ రచనలో తెలుస్తుంది.
భగత్‌సింగ్ ఎంతటి ఉద్యమకారుడో అంతకన్నా హెచ్చగా వేలాది గ్రంథాలు అధ్యయనం చేసిన విజ్ఞానశీలి. విక్టర్ హ్యూంగో, హాల్కేన్, అప్టన్సింక్లర్, టాల్స్టామ్, డాస్కోవస్కీ, గోర్కీ, బెర్నాల్డ్ షా, డికెన్స్, మార్క్స్ - లెనిన్‌ల సాహిత్యంతో బాటు నిర్మలానంద స్వామి (ఇంకిత జ్ఞానం) బకనిన్ (దేవుడురాజ్యం), డార్విన్ (ఆరిజన్ ఆఫ్ స్పేషిస్) లాంటి పుస్తకాలతో పాటు ప్యూయర్ బాక్ (హేగల్ శిష్యుడు) హెగల్ల సాహిత్యం చదివాడు. లెనిన్ కార్యాచరణపై చక్కటి అవగాహన - విశ్లేషణ భగత్‌సింగ్ కలిగివున్నాడు. (మొదటి డ్యూమా, రెండో డ్యూమాపై) ఈ దేశంలో సైమన్ రాకను నిరసిస్తూ లాలాలజపతిరారు, నిరసన - ఆయనపై పోలీసుల దాడి - ఆయన మృతికి కారకుడైన స్కాట్‌ను చంపేయత్నంలో సాండర్స్‌ను చంపడం - కకోరి రైలు దోపిడి (బ్రిటిష్‌వారి ధనాగారానికి పంపే నగదు) బ్యాంక్ లూటీ, పార్లమెంట్లో బాంబు లేయడం... ఆ తరువాత లొంగిపోయి కోర్టులో విప్లవ పంథా వినిపించడం... హేతువాదం - నాస్తిక భావాలు వెల్లడించడం ముఖ్యమైన అంశాలు. ఈ దేశంలో విప్లవోద్యమానికి డాక్యుమెంట్ తయారు చేయడం - తండ్రికి దేశ భక్తియుతంగా లేఖరాయడం, తన విప్లవ వీలునామా ప్రకటన లాంటి చర్యలు ప్రేరణగా నిలుస్తాయి. ప్రపంచ విప్లవోద్యమాల్లో చేగువేరాలా, భారత్‌లో భగత్‌సింగ్ యువత హృదయాల్లో రెడ్‌స్టార్‌గా ఎప్పటికీ ఉంటారు. సామ్రాజ్యవాదాన్ని - మతోన్మాదాన్ని ఏకకాలంలో ఎదుర్కొనే నేటి సందర్భంలో భగత్‌సింగ్ ఉద్యమ గురువుగా ఉంటారు. ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే ఆయనకు మనమిచ్చే నివాళి.
- (నేడు భగత్‌సింగ్ 92వ వర్థంతి)
తంగిరాల చక్రవర్తి
9393804472