Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచా యతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లకు పదోన్నతులు లేక ఎనిమిదేండ్ల వుతోంది. ఐదేండ్లు గడిచినా పదోన్నతులు, బదిలీలు లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల విద్యా వ్యవస్థలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ప్రధానో పాధ్యాయులు అని విభజించారు. ఎస్జీటి, స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిదేండ్లు, ప్రధానో పాధ్యాయులకు ఐదేండ్లు ఒక పాఠశాలలో పనిచేయడానికి గరిష్ట గడువుగా నిర్ణయించారు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతు లివ్వలేదనే అసహనం ఉపాధ్యాయుల్లో నెలకొంది. 2018లో జరిగిన బదిలీలు తర్వాత ఇప్పటి వరకు బదిలీలు లేకపోవడం వల్ల కొంత మంది ఉపాధ్యాయులు పదమూడు, పద్నాలుగు సంవత్సరాల నుండి ఒకే పాఠశాలలో పనిచేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించునున్నట్లు ప్రకటించి దరఖాస్తులకు ఆహ్వానించింది. 50వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్పౌజ్ కేసులను పరిష్కరించిన తర్వాత బదిలీలు, పదోన్నతులు చేయాలని స్పౌజ్ బాధిత ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. స్థానికులను స్థానికేతరులను చేసిన 317జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు బదిలీలలో తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిం చారు. కోర్టు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసును జూన్ 13కు వాయిదా వేసింది. ఎంతోకాలంగా బదిలీలు, పదోన్నతుల కోసం ఆశలు పెంచుకుని వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఈ కేసును ఈ వేసవి సెలవుల్లోగా కౌంటర్ దాఖలు చేసి కేసును త్వరగా పూర్తయ్యే టట్లు చూసి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి...
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేయనున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని భాషోపాధ్యాయు లకు పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలోని 10,558 భాషా పండితుల పోస్టులను అఫ్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2017 డిసెంబర్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సాక్షిగా భాషా పండితుల ఉన్నతీకరణలో చిన్న చిన్న లోపాలను సరిదిద్ది వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పిస్తామని హామీనిచ్చారు. ఐదేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదు. కోర్ట్‌లో ఉన్న స్టేను వెకెట్ చేపించి గత 25, 26 సంవత్సరాల నుండి ఉన్నత పాఠశాలలలో బోధిస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటున్న భాషా పండితులకు పదోన్నతుల గురించి ఆలోచించాలి. శాసన మండలి ఎన్నికల సందర్భంగా భాషాపండితులకు ఉన్నతీకరణ చేస్తున్నట్లు జీఓలు తేవడం, శాసనమండలి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ జీవోలను అటకెక్కించడం మామూలైపోయింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు భాషా పండితులకు ఉన్నతీకరణ చేస్తున్నట్లు జీవోలిచ్చారు. కానీ అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. భాషా పండితుల జాబ్‌చార్ట్ ప్రకారం 6,7,8 తరగతులకు బోధించాలి. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఈ తరగతులతో పాటు 9, 10వ తరగతి వరకు బోధిస్తూ శ్రమదోపిడీకి, వెట్టిచాకిరీకి గురవుతున్నారు. విద్యాకమిటీలు, విద్యా కమిషన్లు ఉన్నత పాఠశాలలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆంగ్లం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు ఉండి ప్రథమ భాషా తెలుగు, ద్వితీయ హిందీ బోధించే వారు మాత్రం భాషా పండితులుండటం శోచనీయం. వీరికి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి తప్ప ఇంకేమీ లేవు. ఉద్యోగంలో చేరి ఇందులోనే పదవీ విరమణ చేసే ఉద్యోగం రాష్ట్రంలోని ఏ శాఖలోనూ లేదు. ఇన్ని సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవు తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి ప్రయోజనం కలిగే విధంగా బదిలీలు పదోన్నతులు వేసవి సెలవు ల్లో చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
- డాక్టర్ ఎస్.విజయ భాస్కర్,
9290826988