Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వాణ్ని ఎలా తట్టుకుంటున్నారా బాబూ.. కాస్త వాణ్నెవరైనా ఆపండ్రా.. వాణ్ని మార్చండ్రా...' ఓ సినిమాలో నటుడు రావు రమేశ్ వాడిన డైలాగ్ ఇది. మనం చెప్పిన మాట వినకపోయినా, అతిగా ప్రవర్తించినా అలాంటి వ్యక్తుల గురించి మనం కూడా అప్పుడప్పుడూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సైతం ఒకరి గురించి పదే పదే చెప్పుకుంటూ తెగ ఇదై పోతున్నారు. ఆయనే సూరయ్య ఉరఫ్ భాస్కరుడు అలియాస్ సూర్య భగవానుడు. బుడతల దగ్గర్నుంచి ముసలోళ్ల దాకా నిన్న మొన్నటి వరకూ ఈ సూరయ్య గారి నులి వెచ్చని కిరణాల కోసం ఎదురు చూసిన వారే. జనవరిలో కురిసిన పొగ మంచు.. వెరసి గజగజ వణికించిన చలికి ఉహూహూ.. అంటూ వారందరూ పొద్దున్నే ఎండ హాయిని ఆస్వాదించారు. కానీ చలికాలం ముగిసీ ముగియగానే.. ఫిబ్రవరి పూర్తి కాకుండానే ఈ 'సన్నా'ఫ్ సత్య మూర్తి తన ప్రచంఢ వేడితో జనం మీద ప్రతాపం చూపించసాగాడు. ఉదయం 11 గంటలైతే చాలు..మన నెత్తిని 'చుర్రు'మనిపిస్తున్నాడు. సాయం త్రం నాలుగింటిదాకా ఇదే తంతు. మరోవైపు వాతావరణ కేంద్రం సైతం ఆయన గారి గురించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 'గతంతో పోలిస్తే ఈసారి ఎండలు మరింత మండిపోనున్నాయి. మార్చి నుంచి మే దాకా జాగ్రత్త...' అంటూ అలర్ట్ చేసింది. సో...ఫిబ్రవరిలోనే సూరయ్య గారి ప్రతాపం ఇలా ఉందంటే... రాబోయే మూడు నాలుగు నెలలు మనకు ఆయన చుక్కలు చూపించటం ఖాయమన్నమాట. అందుకే మరోసారి మట్టి కుండలు.. మజ్జిగ.. కొబ్బరి నీళ్లు.. నిమ్మకాయ షరబత్.. వీటితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు గుర్తుకొస్తున్నాయి...
- బి.వి.యన్.పద్మరాజు