Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రగతిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా 8 మార్చి రోజున నిర్వహించుకునే 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'లో భాగంగా సాహస సఫల ధీరవనితలను సన్మానించడం సబబే. అంతర్జాతీయంగా లింగ సమానత్వ సాధన, మహిళల హక్కుల పరిరక్షణ, మహిళల ఆత్మగౌరవ సాధన, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, స్వేచ్ఛ రెక్కలు తొడగడం, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయడం, నిర్ణయాధికారాలు అప్పగించడం, భ్రూణ హత్యలను కట్టడి చేయడం, లైంగిక దాడులు, హత్యలను నిలువరించడం అనివార్యం. ప్రతిభావంతు లైన మహిళలను గుర్తించి ప్రోత్సహించడం, మహిళా కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాల్సిన వేదికగా మహిళా దినోత్సవం నిలుస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 నినాదంగా 'డిజిటల్' లింగ సమానత్వ సాధనలో వినూత్న సాంకేతికత (డిజిటల్ ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ)' అనబడే అంశాన్ని తీసుకున్నారు. 1975లో ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, తగు పరిష్కారమార్గాలను చర్చించడంతో పాటు వివిధరంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళామణులను సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రపంచాన్ని సవాళ్లు చేస్తూ నవ్య ప్రగతిరథం పరుగెడుతుంది. సవాళ్ళను ఎదుర్కొని నిలబడినప్పుడే సకారాత్మక మార్పులకు ఆస్కారం ఉంటుంది. అమ్మ, ఆలి, సోదరి, వదిన, బామ్మ లాంటి ఏ పాత్ర అయినా బేషరతుగా కుటుంబ సంక్షేమానికి అనుక్షణం శ్రమించే నిస్వార్థ జీవి స్త్రీమూర్తి మాత్రమే. అందరికీ అమ్మ కావాలి. ఆలి అనివార్యంగా ఉండాలి, కాని కూతురు వద్దంటోంది నేటి విచిత్ర ప్రపంచం. కూతురు ఓ భారం, కొడుకు ఓ వంశాంకుర దీపం అనే అనాగరిక సమాజంలో మనం ఉన్నాం. భ్రూణ హత్యలు, లైంగిక వేధింపులు, హత్యలు, గృహ హింసలు, బాల్యవివాహాలు లాంటి పలు దురాచారాలను ఎదుర్కొంటున్న మహిళలు మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. ప్రాంతం, దేశం, మతం, కులం, వర్గం, వర్ణం, జాతి, సంప్రదాయం, ఆర్థిక స్థితి, సంస్కృతులను బట్టి మహిళా వివక్ష తీవ్రత మారుతూ వస్తున్నది. విద్యలేక పోయినా అబల చిన్నచూపును భరిస్తూ లింగ వివక్ష వలలో చిక్కుకుపోయిన శ్రమ జీవి ఆమె. లింగ వివక్ష రాజ్యమేలినంత కాలం మహిళా సమాజం సమస్యల నడుమ నలుగుట ఖాయం. మహిళలు ప్రవేశించని రంగంలేదు, సృశించని అంశం లేదు. అంతరిక్షంలో విహరించడం, సాగర సరిహద్దుల్లో గస్తీలు తిరగడం, అంతరిక్ష రహస్యాల శోధనలు చేయడం, యుద్ధ క్షేత్రంలో ధీర వనిత, యుద్ధ విమానాలకు దిశ నిర్దేశం చేయడం, అంతర్జాలాన్ని అన్వేషించడం లాంటి విధులను సమర్థవంతంగా నిర్వహించడం ఎరిగిన తెలివిగల మేధావి మహిళ. కొడుకుతో సమానంగా కూతురిని పెంచడం, ఇరువురికీ ఉన్నత విద్యను అందించాల్సిన కనీస బాధ్యత తల్లితండ్రులు మీద ఉంది. భారతదేశంలో అధిక జనాభా, పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహారలోపం, అసమానతలు లాంటి తీవ్ర సమస్యల నేపథ్యంలో మహిళలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంట్లో మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రం ఉండదు. తల్లితండ్రులు నవజాత శిశు స్థాయి నుంచే అమ్మాయిల పెంపకంలో వివక్షను చూపుతూ విద్యకు, స్వేచ్ఛకు దూరం చేయడం నమ్మలేని నిజం. బాల్యవివాహాల వలలో చిక్కి చిరు ప్రాయంలోనే అమ్మాయిల తల్లులు కావడం, అనారోగ్యాల పాలు కావడం సర్వసాధారణం. ప్రేమ పేరుతో ఆసిడ్ దాడులు, గృహ హింస, ఆర్థిక అసమానత, వరకట్న వేధింపులు, చావులు, గర్భంలో ఆడ పిల్ల ఉందని అని తెలిసి అబార్షన్లు (భ్రూణ హత్యలు), బలవంతపు వ్యభిచార వృత్తి లాంటి పలు సమస్యలను భారతీయ మహిళా సమాజం ఎదుర్కొంటున్నది. సమాజంలో సగమైన మహిళలు పార్లమెంట్లో 14.5శాతం మాత్రమే ఉన్నారు. ప్రపంచదేశాల లింగ సమానత్వ సూచిక-2022 జాబితాలో ఉన్న 146 దేశాల్లో ఇండియా 135వ స్థానంలో ఉన్నది. మహిళల్లో సెకండరీ విద్య పూర్తి చేసిన మహిళలు 39శాతం (పురుషులు 63.5శాతం) ఉన్నారు. శ్రామిక లోకంలో 27.2శాతం మహిళలు (78.8శాతం పురుషులు) నమోదయ్యారు. ఇలా చూస్తే అన్నింట్లో మహిళ వివక్షకు గురవుతూనే ఉన్నది. ఈ వివక్ష పోవడానికి మహిళలు సంఘటితంగా ఉద్యమించాలి.
- డాక్టర్ బుర్రా మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037