Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేను చట్టాలు రూపొందిస్తాను - ఏ చర్చా లేకుండానే! నేను చట్టాలు వెనక్కి తీసుకుంటాను - ఏ చర్చా లేకుండానే! ఎందుకంటే, నేనే చట్టాన్ని!'' - ఉర్వీశ్ కొఠారీ.
వివాదాస్పద సాగు చట్టాలను పార్లమెంటు ఉభయ సభలూ రద్దు చేశాయి. ఇది నిస్సందేహంగా రైతు ఉద్యమానికి విజయం కాగా, ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. నిజానికి ప్రజాభిప్రాయానికి తలొగ్గి ప్రభుత్వాలు వెనక్కితగ్గడం, చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన సాంప్రదాయం. కానీ ఏలినవారిలో ఆ ఉన్నత స్వభావం ఇసుమంతైనా కనిపించకపోగా, కనీసం రవ్వంత అపరాధభావమైనా లేకపోవడం విచారకరం. రద్దుచేసే చట్టాలను కూడా ఆకాశానికెత్తుతూ కీర్తించడం వీరికి మాత్రమే చెల్లింది. ఈ రద్దును ప్రకటించే ఒకటీ రెండు వ్యాక్యాలను మినహాయిస్తే బిల్లు నిండా వాటిపై పొగడ్తల జల్లులే! నిజంగానే అవి అంత గొప్ప చట్టాలయితే, విపక్షాలు ఎంత పట్టుపట్టినా ఎందుకు చర్చకు నిరాకరించినట్టు?! 12-06 గంటలకు ప్రవేశపెట్టబడిన బిల్లు 12-10 గంటలకల్లా ఆమోదించబడింది. అంటే కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో క్రతువు ముగించేశారు. పైగా చట్టాల రద్దును ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ అంగీకరించినప్పుడు ఇంకా చర్చెందుకు అంటూ వ్యవసాయమంత్రి కొత్త తర్కానికి తెరతీసారు. ఫలితంగా ఈ చట్టాలు ఏ చర్చా లేకుండా ఎలా ఆమోదించబడ్డాయో, అచ్చం అలానే రద్దు చేయబడ్డాయి.
ప్రధానమంత్రిగారేమో సమావేశాలకు ముందు పార్లమెంటరీ ప్రమాణాల గురించీ, అర్థవంతమైన చర్చల గురించీ విలేఖరులకు గొప్పగా సెలవిచ్చారు. ఎంత బలంగా సమావేశాలను అడ్డుకున్నామన్నది కాదు, ఎంత అర్థవంతమైన చర్చ చేశామన్నది ముఖ్యం అంటూ నొక్కి వక్కాణించారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉందనీ, ప్రతి ప్రశ్నకూ జవాబు ఇస్తుందనీ హామీ ఇచ్చారు. కానీ ఆచరణేమో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఏమాత్రం చర్చకు ఆస్కారం లేకుండానే సాగుచట్టాలరద్దు తంతు ముగించేశారు. అసలయితే ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్‌నే కాదు, దానికి ముందు సంబంధిత ప్రజలనూ, నిపుణులనూ, ప్రజాసంఘాలనూ, రాజకీయ పక్షాలనూ విశ్వాసంలోకి తీసుకుని, విస్తృత సంప్రదింపులు జరుపాలి. ఉమ్మడి ఆలోచనల నుండి ఓ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలి. దాని ఆధారంగా పార్లమెంటులో చర్చించి చట్టం చేయాలి. ఇదంతా విస్మరించి ఏకపక్షంగా చట్టాలు తెచ్చి దెబ్బతిన్న ప్రభుత్వం... ఇప్పుడు రద్దు సందర్భంలోనూ అదే తీరున వ్యవహరించడం గర్హనీయం.
కేవలం కొంత మంది రైతులను ఒప్పించలేక ఉపసంహరించుకుంటున్నామేగానీ, తమ చట్టాలు అద్భుత భాండాగారాలని ఇప్పటికీ చెపుతున్నది అధికారపక్షం. మరి ఆ అద్భుతాలేమిటో పార్లమెంటు ద్వారా ప్రపంచానికి చాటొచ్చుగా...? చర్చకెందుకు భయపడు తున్నట్టు..? తిరుగులేని మెజారిటీ ఉండి కూడా ఎందుకు వెనకడుగేసినట్టు? ఎందుకంటే ఈ చట్టాలపై రైతులు సంధిస్తున్న ఏ ఒక్క ప్రశ్నకూ వారి వద్ద సమాధానం లేదు. వీటిపై చర్చ జరిగితే వీటి వెనుకున్న గుట్టంతా రట్టవుతుంది. సమస్త వ్యవసాయ వాణిజ్యాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే కుతంత్రాలన్నీ బట్టబయలవుతాయి. వీటికి తోడు ఇన్నాళ్ళూ రైతుల పోరాటాన్ని అడుగడుగునా అణిచివేసేందుకు పాల్పడిన దాష్టీకాలన్నిటికీ సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. వాటికి బలైన రైతులకు పరిహారాన్ని ప్రకటించాల్సి వస్తుంది. అన్నింటికీ మించి ఇప్పటికీ రైతులు డిమాండ్ చేస్తున్న ''విద్యుత్ సవరణ చట్టం'' బిల్లుకు, ''కనీస మద్దతు ధర'' చట్టబద్ధతకూ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ చట్టాల రద్దును స్వాగతించిన ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు సైతం ఇవి భారత ఆహార వ్యవస్థకే పెను ప్రమాదమని ప్రకటించడం ఇక్కడ గమనార్హం. అందువల్ల దీనిపై ఎంత చర్చ జరిగితే పాలకపక్షానికి అంత నష్టం. అందుకే ఈ పలాయనం..!
రైతాంగ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇవి రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయేమోనన్న భయం వెంటాడుతోంది. ఇది ముందుముందు ఢిల్లీ పీఠానికే ముప్పుతెస్తుందనే ఆందోళనా మొదలైంది. కనుక సర్కారువారు ఇక తగ్గక తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప, తమ తప్పును తెలుసుకుని కాదనడానికి ఉదాహరణలనేకం. అందుకే రైతులు ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. చట్టాలను రద్దు చేసినా ఉద్యమ శిబిరాలను వీడటం లేదు. సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదనీ, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేవరకూ, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం సాగుతుందనీ స్పష్టం చేస్తున్నారు. మా పోరాటం దేశం కోసమని నినదిస్తున్నారు. ఇది కేవలం ఓ ఎన్నికల ఎత్తుగడ మాత్రమేననీ, ఈ చట్టాల రద్దు లక్ష్యం దేశాన్ని పక్కదారి పట్టించడమేననీ ఈ సందర్భంగా రైతు నేతలు పేర్కొనడం వారి పరిణితికే కాదు, ప్రభుత్వ స్వభావానికీ అద్దం పడుతోంది. అన్నదాతల ముందు చూపును సూచిస్తోంది.