Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతీఖ్ హత్య గురించి మాట్లాడినా, జరిగిన తీరును సందేహించినా చాలా మందికి కోపం వస్తున్నది. అతిఖ్, అతని కుటుంబసభ్యులు, వారు చేసిన నేరాలు ఘోరాలు తీవ్రమైనవి. అటువంటి నేరస్తులను తీవ్రంగా శిక్షించాల్సిందే అందులో సందేహం లేదు. కానీ, కోర్టులు చేయవలసిన పనిని, ఇతర మార్గాల ద్వారా చేయడమంటే న్యాయవ్యవస్థను ధిక్కరించడమే. ఇటువంటి విధానాలను అనుసరించి హీరోలుగా మారే రాజకీయ నేతలు అంతిమంగా ఫాసిస్టు పాలనకే దోహదకారులు అవుతారు. ఇది అతీఖ్‌కు సంబంధించిన విషయం కాదు. దేశ న్యాయపాలనకు సంబంధించిన సమస్య.
నేరాలకు పాల్పడడంతో జీవితం మొదలుపెట్టి రాజకీయాల్లోనూ ఎదిగిన అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌లను పోలీసుల సమక్షంలోనే బాహాటంగా కాల్చి చంపారు. ఈ ఉదంతం యోగీ పాలనలో రాజకీయాలు, నేరాలు ఎంతగట్టిగా పెనవేసుకు పోయాయో రుజువు చేస్తోంది. మీడియా సమావేశంలో, మీడియా ప్రతినిధులలాగా మారువేషంలో వచ్చిన దుండగులు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉన్న నేరగాళ్లను హత్యచేసి, కనీసం తప్పించుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేక అనుమానాలను రెకెత్తిస్తోంది. పైగా హత్య చేసిన లవలేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య ''జైశ్రీ రాం'' నినాదాలు చేయడం ఈ హత్యలో హిందుత్వ రాజకీయా లున్నాయి అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. యోగీ ప్రభుత్వం వెంటనే ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు సంఘాన్ని(సిట్) నియమించడం ఆహ్వా నించదగ్గ విషయమే అయినా, అది కూడా పలు సందేహలకు తావిస్తోంది.
సుప్రసిద్ధ కార్టూనిస్టు సతీశ్ ఆచార్య ఈ హత్యోదంతంపై గీసిన వ్యంగ్య చిత్రంలో వీటిని 'ప్రత్యక్ష హత్యలు!' అని వ్యాఖ్యానించారు. న్యాయదేవతను దగ్గరగా కాల్చిచంపుతున్న 'శక్తులు' ఒకవైపు, అసత్య కథనాలతో పాత్రికేయతను హత్య చేస్తున్న 'అధికార మీడియా' మరొకవైపు! ఎంతటి దౌర్జన్యమైనా చాటుమాటుగా, ముసుగులు వేసుకుని చేసే రోజులు పోయాయి! అంతా 'లైవ్'!! అన్నట్టు ఉంది యోగి పాలన తీరు. నేరాలను అదుపు చేయడం అంటే నేరస్తులను హతమార్చడం కాదు. నిందితులకైనా, నేరస్తులకైనా వారికి కోర్టు శిక్ష విధించే దాకా తగిన భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ బాధ్యతకు అక్కడి ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది. కాబట్టే అతి దగ్గరి నుంచి తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినా పోలీసులు కిమ్మనలేదు. ఇదంతా గమనిస్తే ఇందులో ఏదో నిగూఢమైన లక్ష్యం ఉందన్న అనుమానం మరింత బలపడుతోంది.
ఎన్కౌంటర్లు, కస్టడీ హత్యల సమయంలో పోలీసులు చెప్పే కథలన్నీ పూసగుచ్చినట్టు ఒకే విధంగా ఉంటాయి. ప్రయాగ్‌రాజ్ స్క్రిప్టే ఇక్కడా పునరా వృతమైంది. పేరుమోసిన గ్యాంగ్స్టర్లను తరలించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. బయటి నుంచి వ్యక్తులొచ్చి పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి కాల్చడం పోలీసుల మద్దతు లేకుండానే జరుగుతుందా? ఇటువంటి ఘటనలు ప్రభుత్వానికి తెలీకుండా జరిగాయి అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ హత్యలకు రెండు రోజుల ముందు గురువారం ఝాన్సీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఉమేష్‌పాల్ హత్య కేసులో నిందితులైన అతీక్ కుమారుడు అసద్, అతని సహచరుడు గులాం హతులయ్యారు. 2005లో జరిగిన బిఎస్పి ఎంఎల్ఎ రాజ్‌పాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్‌పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న హత్యకు గురయ్యాడు. ఆ కేసులో అతీక్, అష్రాఫ్, అసద్, గులాం నిందితులు. ఇప్పుడు ఆ నలుగురూ హతమయ్యారు. దర్యాప్తులు, కోర్టులు ఇవేమీ లేకుండా నిందితులను లేపేయడమనే సిద్ధాంతాన్ని యోగి ప్రభుత్వం అమలు చేస్తోందని సతీశ్ ఆచార్య కార్టూన్ స్పష్టం చేస్తోంది. అది కూడా ఒక మతానికి సంబంధించిన వారే లక్ష్యం కావడం గమనార్హం.
యూపీలో యోగి ప్రభుత్వం వచ్చింది మొదలు ముస్లింల అక్రమ నిర్బంధాలు, ఎన్కౌంటర్లు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. వాటిపై దర్యాప్తులు, విచారణలు ఏమీ ఉండవు. రాష్ట్రంలో నేరస్తుల, అసాంఘిక శక్తుల పీచమణిచేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని యోగి సర్కారు తమ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాద మూకలకు, ప్రయివేటు సైన్యాలకు పూర్తి మద్దతిస్తోంది. గోరక్షణ పేరిట ఆ రాష్ట్రంలో ముస్లింలు, దళితు లపై జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కావు. తరచూ పురివిప్పుతున్న మత ఘర్షణలను అదుపు చేయడంలో వైఫల్యాలను మూటగట్టుకోవడంతో పాటు ఒక వర్గానికి ప్రభుత్వం కొమ్ము కాస్తోంది.
అతీఖ్ హత్య గురించి మాట్లాడినా, జరిగిన తీరును సందేహించినా చాలా మందికి కోపం వస్తున్నది. అతిఖ్, అతని కుటుంబసభ్యులు, వారు చేసిన నేరాలు ఘోరాలు తీవ్రమైనవి. అటువంటి నేరస్తులను తీవ్రంగా శిక్షించాల్సిందే అందులో సందేహం లేదు. కానీ, కోర్టులు చేయవలసిన పనిని, ఇతర మార్గాల ద్వారా చేయడమంటే న్యాయవ్యవస్థను ధిక్కరించడమే. ఇటువంటి విధానాలను అనుసరించి హీరోలుగా మారే రాజకీయ నేతలు అంతిమంగా ఫాసిస్టు పాలనకే దోహదకారులు అవుతారు. ఇది అతీఖ్‌కు సంబంధించిన విషయం కాదు. దేశ న్యాయపాలనకు సంబంధించిన సమస్య.