Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేసీఆర్ ఎన్నికల కోసమే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాడని బండి సంజయ్ చెప్పేది కాసేపు నిజమేననుకుందాం. ఆ పని మీరూ
చేయొచ్చుగా! సామాజిక వ్యవస్థనంతా ధ్వంసం చేసి అంబేద్కర్
విగ్రహాలకు దండలేస్తే చెల్లుబాటు కాదు కాషాయనేతలారా! కీలక
పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్న అంబేద్కర్ విధానాన్ని తలకిందులుగా అమలు చేస్తున్న బీజేపీ, పోరాడి సాధించుకున్న తెలుగు ప్రజల గౌరవాన్ని, విశాఖ ఉక్కును అదానీ పరం చేసే ప్రయత్నాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?
కొన్నిసార్లు మాటల్ని చూసో, వినో మాటలు కూడా సిగ్గుపడు తూంటాయి. ఆ కోవలోవే మొన్న సంజయుని నోట జాలువారిన కంపుతుంపర్లు! ఆయన అంత ''ఆవేదన'' చెందడానికి కారణం... ''రాజ్యాంగాన్ని తిరగరాస్తా''అన్న వ్యక్తి అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం ఏమిటి? దళిత ద్రోహికి ఇదితగునా? ధర్నా చౌక్ ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్ ఈ డప్పుకొట్టుకొనుడేంది? వంటి చొప్పదంటు ప్రశ్నలు చాలానే సంధించారు.
బీఆర్ఎస్, బీజేపీల మాటల యుద్ధం అవతలికి వంగి చూస్తే కనపడే విషయాలు కొన్నే! లోపలికి తొంగి చూస్తే మరెన్నో వివరాలు గోచరమవుతాయి. ఇన్నేళ్లుగా అంబేద్కర్ ఊసెత్తని కేసీఆర్ హఠాత్తుగా ఎన్నికలొస్తున్నాయని విగ్రహావిష్కరణ చేశాడని సంజయుల ఆక్రోశం. 125 అడుగుల ఎత్తున విగ్రహం పెట్టాలని 2016లోనే నిర్ణయించినా ఏడేండ్లెందుకు ఆలస్యం అయిందని ప్రజాస్వామిక వాదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలేస్తున్నారు. ఇది సంజయ్‌కు పట్టదు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడని సంజయ్ వెళ్ళగక్కే ఆవేదన. చూడబోతే అసలు దుగ్ధంతా అదేననేది స్పష్టం. విగ్రహ నిర్మాణమే కాదు, దాని చుట్టూ ఏర్పాటుచేసిన ఆహ్లాదకర వాతావరణం ఆరంభ కోలాహలంతో బహుశా కాషాయ 'బండి'కి పంచరయినట్లుంది!
దయ్యాలు వేదాలు వల్లిస్తూంటే మరి మాటలు సిగ్గుపడవా?! అంబేద్కర్, ఆయన సిద్ధాంతం, ఆయన వేదాంతం కూడా కష్టజీవులందరిదీ! ఆయన్ని దళితుల ప్రతినిధి స్థాయికి 'బండి'వారు తగ్గించడం ఆయన లేకితనానికి నిదర్శనం. అది అంబేద్కర్ మూల సిద్ధాంతానికే వ్యతిరేకం. దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం, వివక్ష ఆయన సిద్ధాంతానికి ఇరుసుగా నిలిచాయి. అసలిక్కడ విషయం బండిది, బీజేపీదీ, అంబేద్కర్‌ది కాదు. దళితులు, ఆదివాసీలపై దాడులు దౌర్జన్యాలు విచ్చలవిడిగా సాగుతున్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే! చివరికి ప్రకృతి ఆరాధకులైన తమని 'సర్నా' మతంగా జనాభా లెక్కల్లో పేర్కొనాలనే డిమాండ్‌ను సైతం పరిగణనలోకి తీసుకోనందుకు గిరిజనులు ఉద్యమిస్తున్నారు మధ్యప్రదేశ్‌లో. కోవిడ్-19 సాకుతో 2021లో జరగాల్సిన జనగణనే అటకెక్కించింది బీజేపీ. ఓబీసీల గణన చేయాలని దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ఎన్డీఏలోని పార్టీలతో సహా డిమాండ్ చేస్తున్నా, తన హిందుత్వ ప్రయోజనాలకు అడ్డుగా నిలుస్తుందన్న ఒకే ఒక్క కారణంతో ఆరెస్సెస్ వద్దంది. బీజేపీ నిరాకరిస్తోంది. ఆ విధంగా 1881 నుండి ప్రతి పదేండ్లకూ కొనసాగుతున్న ప్రక్రియ 140 ఏండ్ల తర్వాత 2021లో బీజేపీ పుణ్యాన ఆగింది. కారణం దేశంలో కష్టజీవుల సంఖ్య తేలుతుంది. తమ వాటా అడుగుతారు. హిందుత్వ క్యాంపెయిన్‌కు తూట్లు పడతాయి. చాతుర్వర్ణ వ్యవస్థ పునరుద్ధరణ ఆకాంక్ష ఆవిరైపోతుంది.
ఇక ప్రజాస్వామ్యం కేసీఆర్ హయాంలో కొడిగట్టిపోతోందన్న బీజేపీ గురివింద నీతుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మోడీని సవాలు చేసిన వారిని, చివరికి విమర్శించిన వారిని సైతం శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్న తీరు, ఆ మూడు ఏజెన్సీలు వెంటాడి, వేధిస్తున్న తీరు దేశ ప్రజలకు నిత్య దృశ్యం. పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో నోరెత్తడానికి లేదు. పత్రికలు విమర్శించడానికి లేదు. ఎడిటర్స్ గిల్డ్ మొత్తుకున్నా సంపాదకులకు సంకెళ్ళు, విమర్శించే విలేకర్లకు 'ఉపా' చట్టం కింద శ్రీకృష్ణజన్మస్థానాలు - ఇదీ నేటి దేశ దృశ్యం. 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అనే నీతి నేడు బీజేపీ పాలనలో అమలవుతోంది. రిపోర్టర్స్ వితౌట్ ఫ్రాంటియర్స్ నివేదిక ప్రకారం వాళ్ళు సర్వే చేసిన 180 దేశాల్లో భారత ర్యాంకు 150కి పడిపోయింది. 2017 నుండి ఈ దిగజారుడు కొనసాగుతోంది. భారతదేశంలో ''సామాజిక ప్రజాస్వామ్యా''న్ని మాత్రమే గౌరవించాలని డాక్టర్ అంబేద్కర్ కోరారు. రాజకీయ ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే దాని పునాది సామాజిక ప్రజాస్వామ్య భావాల్లో ఉందన్నారు. నేడు హిజాబ్ ధరించవద్దని ముస్లిం బాలికలను ఆదేశించడం, హిందూ దేవాలయాల సమీపంలో ముస్లిం వ్యాపారాలను నిషేధించడం, గో రాజకీయాలు, హలాల్ అజాన్ వంటివి ప్రధానంగా ముస్లిం, దళిత ప్రజానీకాన్ని, పశువులు కాసే అనేక బీసీ వర్గాలను దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాలే! వీటి గురించి బీజేపీ నేతలు ఏమి సమాధానం చెపుతారు?
ఇక కేసీఆర్ ఎన్నికల కోసమే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాడని బండి సంజయ్ చెప్పేది కాసేపు నిజమే ననుకుందాం. ఆ పని మీరూ చేయొచ్చుగా! సామాజిక వ్యవస్థనంతా ధ్వంసం చేసి అంబేద్కర్ విగ్రహాలకు దండలేస్తే చెల్లుబాటు కాదు కాషాయనేతలారా! కీలక పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్న అంబేద్కర్ విధానాన్ని తలకిందులుగా అమలు చేస్తున్న బీజేపీ, పోరాడి సాధించుకున్న తెలుగు ప్రజల గౌరవాన్ని, విశాఖ ఉక్కును అదానీ పరం చేసే ప్రయత్నాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? దాదాపు ప్రభుత్వరంగ వినాశనం పూర్తయ్యే దశలో 2024 దాకా ఎందుకు? 2023లోనే మేం గెలుస్తున్నామనే బండి సంజయ్ మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలి!