Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాన్‌కీ బాత్'లో భారంగా మారిన ధరల గురించో, ప్రభుత్వ రంగ అమ్మకాల గురించో, మహిళలు, దళితులు, మైనార్టీలపై హిందూ మతోన్మాదుల కిరాతకాలపై మోడీ మాట్లాడతారెమో అని వంద ఎపిసోడ్లుగా దేశం నిరీక్షిస్తూనే ఉంది. కనీసం కార్మికులకు 'మేడే' శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధానికి నోరు రాలేదు. శ్రమ జీవుల పట్ల వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా లాక్డౌన్లు, వలస కూలీల అవస్థలు, కరోనా వైఫల్యంతో లక్షల మరణాలకు ఇందులో చోటు లేదు. కార్పొరేట్-హిందూ మతతత్వ ఎజెండా, ప్రచారార్భాటం ఆ ఎపిసోడ్స్ ఆంతర్యం అన్నది స్పష్టం.
'జనతా జనార్దన్... వ్యష్టి నుంచి సమిష్టి... నా నుంచి మనం' ప్రధాని నోట ఆదివారంనాటి మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్లో ఈ పదాలు జాలువారుతుంటే మాటలకు చేతలకు ఎంత తేడా అని ఆశ్చర్యపోతున్నారు. భావోద్వేగ భాషకు, ఆవేశం ఉట్టిపడే హావభావాలకు పెట్టింది పేరు మన ప్రధానమంత్రి... మోడీ వక్తృత్వ పటిమ నిజంగానే గొప్పది. గొంతు చించుకుని మాట్లాడే మోడీ ''మన్ కీ బాత్'' ప్రసంగాలలో మాత్రం చాలా మంద్రంగా మాట్లాడతారు. ఆ ప్రసంగాలలో సారం కన్నా ప్రసంగించే తీరుకే అధిక ప్రాధాన్యం. ప్రతి నెలా తాను నిర్వహించే ఈ కార్యక్రమం మహిళల సాధికారత అంశాన్ని ముందుకు తెచ్చిందన్నారు. వివిధ సామాజిక సమస్యలపై జన చైతన్యాన్ని రగిలించడానికి కారణమయ్యిందన్నారు. రేడియో ద్వారా నిర్వహిస్తున్న మన్‌కీ బాత్ స్వచ్ఛత నుంచి బేటీ బచావో, బేటీ పడావో వరకు అనేక ప్రజా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిందన్నారు. ఆయన మాటలు చేతలైతే సామాన్యుల జీవితాలు బాగుపడి ఉండేవి. కానీ వారి తొమ్మిదేండ్ల పాలనలో అదానీల, అంబానీల ఆస్తులు ఆకాశానికి ఎగబాకాయి. కర్నాటక ఎన్నికల వేళ నూరవ మన్‌కీ బాత్‌లో భారత ప్రజలతో తనకున్న గాఢానుబంధాన్ని వేనోళ్ల తలచుకొంటూ మోడీ పరవశించిపోయారు. దానినొక ప్రచార విన్యాసంగా, స్వీయ కీర్తి కండూతిలకు ఉపయోగించుకున్నారు.
ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకుడూ ఇలాంటి గొప్ప ప్రయోగం చేయలేదని వత్తాసు పలికే గోడి మీడియా మచ్చుకైనా వారి పాలన గురించి ప్రస్తావించదు. ప్రజాస్వామ్య దేశంలో పాలకుల మనసులో మాటలు ప్రజలు వినడమే కాదు. ప్రజల మనసులో మాటలు కూడా పాలకులు వినగలగాలి. కానీ, మన ప్రధానమంత్రి మోడీ గారిదంతా 'వన్ వే ట్రాఫికే' తప్ప ఎన్నడూ ప్రజా సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదు.
చాలా చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పగల నేర్పరి ఆయన. మంత్రసానిగా ఎందరో గర్భిణీలకు సేవలందించిన కర్నాటక నరసమ్మ గురించి ప్రధాని మన్కి బాత్‌లో చెబుతుంటే... పేదల ఆరోగ్యం పట్టని ప్రభుత్వమిదని అర్థంకాలేదు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రాత్రిపూట చదువు చెబుతున్న విషయం చెబుతుంటే నూతన విద్యావిధానం పేరుతో పేదలను చదువులకు దూరం చేసే ఎత్తుగడ మీ మనసులో ఉందన్న సంగతే మేం గుర్తించలేదు. న్యూజిలాండ్ ఎంపీగా గౌరవ్ శర్మ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం పలుకుతుంటే రానున్న రోజుల్లో వేదాధ్యయనం తప్పనిసరన్న మీ అంతరంగాన్ని ఏరుక చేసుకోలేకపోయాము. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ గురించి చెప్పినప్పుడు బిల్కిస్ బానో గురించో, ఉన్నావ్ మైనర్ బాలిక గురించో, ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్న రైజర్లల గురించో ఎందుకు మాట్లాడలేదని మిమ్ముల్ని అప్పుడే నిలదీయాలని ఉన్నా... మాకెక్కడ అవకాశం ఇస్తారు. మీదంతా 'వన్ వే ట్రాఫిక్' విన్యాసం కదా!
ఎక్కడో ఏదో చిన్న సంఘటపై మన్ కీ బాత్‌లో లెక్చర్లిచ్చే మోడీ, అదానీపై మూగనోము ఎందుకు పట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు పుల్వామా వీర జవాన్ల మరణాలను ప్రచారాస్త్రంగా చేసుకొని మన్ కీ బాత్‌లో భావోద్వేగం చెందిన ప్రధాని, దానికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నప్పుడు నోరెందుకు మెదపడం లేదని వాపోతున్నారు. మత ఘర్షణలు, యూపీలో విచక్షణారహిత ఎన్కౌంటర్లు, ఫెడరలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం చివరకు రాజ్యాంగంపై కూడా దాడుల జరుగుతున్నా దేశాధినేత మౌనానికి కారణమేంటని నిలదీస్తున్నారు. 'మాన్‌కీ బాత్'లో భారంగా మారిన ధరల గురించో, ప్రభుత్వ రంగ అమ్మకాల గురించో, మహిళలు, దళితులు, మైనార్టీలపై హిందూ మతోన్మాదుల కిరాతకాలపై మోడీ మాట్లాడతారెమో అని వంద ఎపిసోడ్లుగా దేశం నిరీక్షిస్తూనే ఉంది. కనీసం కార్మికులకు 'మేడే' శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధానికి నోరు రాలేదు. శ్రమ జీవుల పట్ల వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా లాక్డౌన్లు, వలస కూలీల అవస్థలు, కరోనా వైఫల్యంతో లక్షల మరణాలకు ఇందులో చోటు లేదు. కార్పొరేట్-హిందూ మతతత్వ ఎజెండా, ప్రచారార్భాటం ఆ ఎపిసోడ్స్ ఆంతర్యం అన్నది స్పష్టం. ప్రజల ప్రస్తావనలేని, వారికి జవాబులు దొరకని కార్యక్రమం ఏదైనా ఎంత గొప్పదైనా ప్రజల మన్నన పొందజాలదు.
ఇలా చెప్పుకుంటూపోతే మోడీ-షా నేతృత్వంలో దేశంలో మతోన్మాదుల దురాగతాలకు అంతే లేదు. హిందూత్వ ఎజెండాతో రక్తపుటేరులు పారిస్తున్న మోడీ, నిత్యం కార్పొరేట్ల సేవలో తరించే మోడీ సామాన్యులకు చేసిందేమిటి? 'మాన్‌కీ బాత్'లో వినసొంపైన ప్రసంగాలు, నీతి బోధనలు తప్ప. ఇదంతా 'పులి-బాటసారి' కథ బాపతే. అందుకే ప్రజలారా..! తస్మాత్ జాగ్రత్త..!