Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డ్రోన్ల ఉదంతంపై అమెరికా, ఇతర ప్రధాన దేశాల స్పందన
వెల్లడికావాల్సి ఉంది. తమ దాడులు తమ గడ్డ మీద తప్ప రష్యామీద
జరపటం లేదని జెలెన్స్కీ చేతులు దులుపుకుంటే కుదరదు. వీటిని
తాము నమ్మటం లేదని అమెరికా అన్నా చెల్లదు. దీనికి ప్రతిగా
జెలెన్స్కీనే లేపేయాలని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్
పిలుపునివ్వటం పశ్చిమ దేశాల వలలో పడటమే. రేపు పశ్చిమ దేశాలే
ఆ పని చేసి దాన్ని రష్యా మీద నెట్టగల సమర్ధులున్నారు.
ఉక్రెయిన్ సంక్షోభంలో మరో మలుపు ఏమిటి? కొద్ది రోజుల క్రితం చైనా అధినేత షీ జిన్‌పింగ్ ఫోన్ ద్వారా జెలెన్స్కీకి చేసిన శాంతి ప్రతిపాదనలను ముందుకు పోకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందా? తన చేజారిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు పశ్చిమ దేశాల మద్దతుతో అటు ఉక్రెయిన్ సిద్దం అవుతోంది. స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్ బోస్ రిపబ్లిక్లను కాపాడేందుకు, గత ఏడాది కాలంలో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటూ భారీ ఎత్తున కొత్తగా దాడులు చేసేందుకు ఇటు రష్యా సన్నద్దం అవుతోందన్న వార్తల గురించి తెలిసిందే. ఈ నేపధ్యంలో బుధవారం తెల్లవారు జామున మాస్కోలోని అధికార కేంద్రమైన క్రెమ్లిన్ సమీపంలో రెండు ఆధునిక డ్రోన్ల (పైలెట్లులేని చిన్న విమానాలు)ను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. తమ నేత పుతిన్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్ జరిపిన ఉగ్రదాడి ఇది అని పేర్కొన్నది. వాటితో తమకు సంబంధం లేదని జెలెన్స్కీ, దాని గురించి మాస్కో చెప్పే మాటలను నమ్మటం లేదని అమెరికా ప్రకటించింది. గతంలో ఇలాంటి ఉగ్రదాడులు జరిపినప్పుడల్లా ఇలాగే ఉటంకించారు.
ఉక్రెయిన్‌లో ఉన్నది పేరుకు పౌర ప్రభుత్వం తప్ప దాని ఆచరణ, చర్యలన్నీ ఉగ్రవాద శక్తుల స్వభావాన్నే కలిగి ఉన్నట్లు ఎప్పటి నుంచో అనేక మంది చెబుతున్నారు. గత ఏడాది కాలంలో రష్యా నుంచి ఐరోపాకు వెళ్లే ఇంథన పైప్ లైన్ విధ్వంసం, క్రిమియాలో ఒక వంతెన పేల్చివేత ఉదంతం, రష్యా మిలిటరీ స్థావరాల మీద జరిగిన దాడులన్నీ ఉగ్రవాదులు జరిపే వాటి స్వభావం కలిగినవే. వీటిలో ఏ ఒక్కదానినీ జెలెనెస్కీ లేదా అతగాడికి మద్దతు ఇస్తున్న పశ్చిమదేశాలేవీ ఖండించలేదు. నాటో, అమెరికా ఇచ్చిన పాత ఆస్త్రాలన్నింటినీ జెలెన్స్కీ సేనలు అవగొట్టాయి. ఆధునిక ఆయుధాలను ఇస్తే వాటిని సక్రమంగా వినియోగించే సత్తా వాటికి ఉందా లేదా అన్న అనుమానాలు పశ్చిమ దేశాలకు ఉన్నాయి. పరిమితంగా దాడులు చేస్తూ భారీ ఎత్తున విరుచుకుపడేందుకు పుతిన్ సేనలు సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెప్పటం తప్ప అది ఎలా ఉంటుందన్నది ఇంతవరకు నాటో వేగులు తేల్చుకోలేకపోయారు. ప్రాణ నష్టం కలగకుండా ఉక్రెయిన్ మిలిటరీ, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తూ రష్యా మిలిటరీ చర్యలను కొనసాగిస్తున్నది. అందుకే పుతిన్‌ను రెచ్చగొట్టి సంక్షోభ తీవ్రతను పెంచాలని పశ్చిమ దేశాలూ, ఉక్రెయిన్ చూస్తున్నది. వాటిలో భాగమే తాజా డ్రోన్ల ఉదంతం అన్నది స్పష్టం. క్రెమ్లిన్ మీద డ్రోన్లు ఎగిరిన రోజే ఓల్నా అనే రష్యా చమురు నిల్వకేంద్రంపై జరిపిన డ్రోన్ దాడిలో అది దగ్దమైనట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. అది ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
ఈ పరిణామం ప్రపంచ దేశాలకు సరికొత్త ఉగ్రవాద ముప్పును సూచిస్తున్నది. గంటకు 150కిలోమీటర్ల వేగంతో ఏడు గంటల పాటు ఎగురుతూ 25 నుంచి 95 కిలోల బరువును మోసుకపోగల మానవరహిత డ్రోన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కూడా పది నుంచి ఇరవై వేల డాలర్లలోపే ఉంటుంది. వాటి కొనుగోలుతో పోలిస్తే కూల్చివేసేందుకు లక్షా నలభై నుంచి ఐదు లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని టైమ్ పత్రిక పేర్కొన్నది. వీటిని బాంబులతో నింపి నిర్ణీత లక్ష్యంపై పేలే విధంగా చేయవచ్చు. క్రెమ్లిన్ కూల్చివేసిన రెండు డ్రోన్లు ఇలాంటివే. పుతిన్‌ను లేదా మరేదేశనేతనైనా ఇలాంటి వాటితో హతమార్చటం అంత తేలికకాదు. అందుకే జనంలో దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు జెలెన్స్కీ ఇలాంటి వాటితో పబ్బంగడుపుకొనే ప్రచార ఎత్తుగడగా కొందరు వర్ణిస్తున్నారు. తాము కూడా రష్యన్ భూ భాగంపై దాడులు జరపగలమనే సంకేతాలను పంపటం తప్ప ఇది మరొకటి కాదు. నిజానికి ఇలాంటి డ్రోన్లను ఒక్క క్రెమ్లిన్ మీదనే కాదు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ మీదకూ పంపవచ్చు.
డ్రోన్ల ఉదంతంపై అమెరికా, ఇతర ప్రధాన దేశాల స్పందన వెల్లడికావాల్సి ఉంది. తమ దాడులు తమ గడ్డ మీద తప్ప రష్యామీద జరపటం లేదని జెలెన్స్కీ చేతులు దులుపుకుంటే కుదరదు. వీటిని తాము నమ్మటం లేదని అమెరికా అన్నా చెల్లదు. దీనికి ప్రతిగా జెలెన్స్కీనే లేపేయాలని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ పిలుపునివ్వటం పశ్చిమ దేశాల వలలో పడటమే. రేపు పశ్చిమ దేశాలే ఆ పని చేసి దాన్ని రష్యా మీద నెట్టగల సమర్ధులున్నారు. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఇలాంటి గిల్లీ కజ్జాలు, కుట్రలతోనే ప్రారంభమయ్యాయి. పుతిన్ బతికి ఉన్నంత వరకు చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్ గతేడాది ఒక తీర్మానం చేసుకుంది. షీ జిన్‌పింగ్ ప్రారంభించిన శాంతి చర్చలను మొగ్గలోనే తుంచేందుకు జరిగిన కుట్రలో భాగంగా కూడా తాజా డ్రోన్ దాడి జరిగి ఉండవచ్చు. ఇలాంటి కుట్రలను లోకానికి వెల్లడిస్తూనే రాజకీయ పరిష్కారం కోసం పుతిన్ యంత్రాంగం రెచ్చిపోకుండా వ్యవహరించాల్సి ఉంది.