Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాత్రం ఇలా రోడ్లమీదకు రావడం మర్యాదకాదన్నది. కమిటీ నివేదిక వచ్చే వరకూ వేచిచూడమన్నది. వారు చేస్తున్నది ఆటకూ దేశానికి మంచిది కాదని వాక్రుచ్చారు. నిజమే దేశానికీ, ఆటకే కాదు, వాళ్లకూ ఈ వేధింపులు అస్సలు మంచివికావు. ఉషకు మహిళగా మర్యాద గురించి ఎవరికి చెప్పాలో తెలియదా? రాజ్యసభ సభ్యత్వం, పదవులూ మాటలిలా పలికిస్తాయి మరి! సుప్రీం కోర్టు పోలీసులను చివాట్లు పెట్టేదాకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదంటే, ఎంత మందంగా మారిందీ పాలనకు!
''నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని పాలకులను, అగ్గి తోటి కడుగు కల్మషాల మనస్సులను'' అని పాడుకోవటమే కాదు, నిగ్గదీయాల్సిన సమయం ఆసన్నమయింది. ఇంకా ఎంతకాలం చూస్తాం! ఇది ఫాసిస్టు శక్తులు నెరపుతున్న ప్రభుత్వమే కాదు, రేపిస్టు ప్రభుత్వం కూడా అని పేర్కొన్న భార్గవ వ్యాఖ్యానం అక్షరాలా వాస్తవం. అప్పుడు అసిఫా ఘటనలో చూశాం, హత్రాస్, ఉన్నావో, బిల్కిస్ బానో ఘటనల్లోనూ చూశాం. హత్యలూ, లైంగిక దాడులు చేసిన వారిని విడుదల చేయటం, సత్కారాలు చేయటం, రేపిస్టులకండగా నిలవడం, శిక్షలు తగ్గించడం, మంత్రులుగా నియమించడం, ఎంపీలను, ఎమ్మెల్యేలను చేయటం, ఎన్నికల్లో టిక్కెట్లివ్వడం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇంకేం సిగ్గు వాళ్లకి! బ్రిజ్ భూషణ్శరణ్లు, కుల్దీప్ సెంగార్లు, స్వామి చిన్మయానందలు... ఎందరెందరో ఈ దేశపు నాయకులు. అసెంబ్లీలలో, చట్టసభలలో నీలిచిత్రాలు తిలకిస్తూ సంస్కృతీ జపం చేసే తన్మయులు, యడ్యూరప్పలు, బసప్పలు ఈ దేశానికి పట్టిన దుర్గతి తిప్పలు!
ప్రపంచ వేదికలపై జాతీయ జెండాను రెపరెపలాడించి, దేశాన్ని గర్వపడేలా చేసిన భారత మల్లయుద్ధయోధలు మళ్లీ న్యాయం కోసం రోడ్లమీదకొచ్చారు. 'బేటీ బచావో' నినాదమిచ్చిన నాయకుడు నిజంగానే ఆడపిల్లల వేదనను అర్థం చేసుకుంటాడను కున్నారు. కుస్తీ పోటీలో యోధులై పోరాడిన వాళ్లు నిస్సహాయంగా కన్నీళ్లు కారుస్తుంటే, గుండె కరుగుతుందేమో అనుకున్నారు. కానీ అది ఫొటోషూట్ జీవమని, కరగని శిలా హృదయమని భావించలేదు వారు. ఐదునెలల క్రితం నిరసన తెలిపితే, మీకు జరిగిన అన్యాయంపై విచారణ చేపడతామని చెప్పి పంపిన ప్రభుత్వం, ఇంతవరకూ స్పందించకపోవడంతో తిరిగి రోడ్డెక్కారు భారత రెజ్లింగ్ మహిళలు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడని ఏడుగురు రెజ్లర్స్ సాక్షాలతో సహా నిరూపిస్తామని ఫిర్యాదు చేసినా, ఇన్ని నెలలు గడిచినా ఒక్క కేసూ నమోదు చేయలేదు ప్రభుత్వం. ఆ ఏడుగురిలో ఒక మైనరు అమ్మాయీ ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రాత్రింబవళ్లు రోడ్లమీదనే ఉంటూ, మాకు న్యాయం చేయండీ అని ఘోషిస్తున్నా, సున్నిత మనస్కుడు అయిన మన నాయకుడు ప్రతిస్పందించ డమే లేదు. ఎందుకనంటే సదరు బ్రిజ్ భూషణుడు ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఎంపీగా ఉన్నాడు. పదవులను అడ్డం పెట్టుకుని ఆ రాష్ట్రంలో యాభై విద్యా సంస్థలకు పైగా కలిగివుండి, కోట్లాది ధనార్జనతోనే కాక ముప్పయిదాకా క్రిమినల్ కేసులూ, మర్డర్ కేసులూ ఉన్నవాడిపై చర్యలు తీసుకోవడం అతిక్ అహ్మద్‌ను ఎన్కౌంటర్ చేసినంత తేలికనా యేమి! కానేకాదు! భారతదేశ గౌరవాన్ని పెంచిన ఈ రెజ్లర్ల కంటే బ్రిజ్ భూషణుడే వారికి ఎక్కువ. మనం అర్థం చేసుకోలేక పోతున్నాం కానీ వాళ్లేపని చేయాలో అదే చేస్తున్నారు. అది వారి సహజ లక్షణం. రేపిస్టుల వైపే నిలుస్తారు. మాటలకు మాత్రం తేనెను పూస్తారు అంతే! ఇక స్మృతి ఇరానీ, ప్రజ్ఞాఠాకూర్, సాధ్వీరితంభర మొదలైన మనువాదీ మహిళా మణులు ఒక్కపలుకు పలికినా మర్యాదలు మంటకలుస్తాయి! సాటి స్త్రీల వెతలు వీరి చెవి సోకవు.
అందుకే బాధిత రెజ్లర్లు వినేష్ పోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు వాళ్లను మాట్లాడమని ఏమీ కోరలేదు. కానీ తోటి క్రీడాకారులను ప్రశ్నించారు. క్రికెట్ క్రీడాకారులను దేశం అభిమానిస్తది కదా! వాళ్లెందుకు తోటి క్రీడాకారుల గురించి మాట్లాడరు? అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌పై మాట్లాడిన వారు, దేశంలోపల అన్యాయం గురించీ మాట్లాడాలికదా! ఒకే ఒక్క కపిల్‌దేవ్ మాట్లాడాడు. అభినవ బింద్రా మాట్లాడిండు. నీరజ్ చోప్రా, సానియా మీర్జా, వీరేంద్ర సెహ్వాగ్, నటుడు సోనూసూద్ గొంతులు విప్పారు. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే కుస్తీ పోటీలో కచ్ఛితంగా విజయం సాధిస్తారని నైతిక మద్దతు ప్రకటించారు. అంతే కాదు బృందాకరత్, ప్రియాంకగాంధీ, ఐద్వా జాతీయ నాయకులు మరియం ధావలే, కె.కె. శైలజ, పి.కె శ్రీమతి పోరాటానికి మద్దతు తెలిపారు. మన మంత్రి కేటీఆరూ న్యాయం జరగాలన్నారు. కానీ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాత్రం ఇలా రోడ్లమీదకు రావడం మర్యాదకాదన్నది. కమిటీ నివేదిక వచ్చే వరకూ వేచిచూడమన్నది. వారు చేస్తున్నది ఆటకూ దేశానికి మంచిది కాదని వాక్రుచ్చారు. నిజమే దేశానికీ, ఆటకే కాదు, వాళ్లకూ ఈ వేధింపులు అస్సలు మంచివికావు. ఉషకు మహిళగా మర్యాద గురించి ఎవరికి చెప్పాలో తెలియదా? రాజ్యసభ సభ్యత్వం, పదవులూ మాటలిలా పలికిస్తాయి మరి! సుప్రీం కోర్టు పోలీసులను చివాట్లు పెట్టేదాకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదంటే, ఎంత మందంగా మారిందీ పాలనకు! దేశ గౌరవం కోసం, పతకాల కోసం నాడు కుస్తీలు పడితే, నేడు తాము గౌరవంగా బతకటం కోసం నిజమైన కుస్తీ పడుతున్నారు. రెజ్లర్ల పోరాటానికి జేజేలు! ప్రభుత్వమా! సిగ్గు సిగ్గు!