Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉందిలే మంచీకాలం ముందూముందూనా
అందరూ సుఖపడాలీ నందానందానా...''
ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం ''రాముడు భీముడు'' సినిమా కోసం మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ పాట... అసంఖ్యాకమైన శ్రామిక ప్రజల ఆకాంక్షలకు ప్రతీక. నిజంగా ప్రజలందరూ శాంతీ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లే రోజులొస్తాయా...? అంటే అదే ప్రకృతిధర్మమూ సహజన్యాయమూ అయినప్పుడు ఎందుకురాదు! మానవ సమాజం తన సుదీర్ఘ జీవనగమనంలో అలాంటి ఒక దశను దాటుకొనే వచ్చింది.
ఈ భూమ్మీద ఏ రాజ్యమూ రాజులూ లేని కాలమది. సమస్త ప్రకృతి వనరుల మీద శ్రమించే మనుషులకే సర్వహక్కులు. నాడు ఆస్తులు కూడబెట్టుకోవాలన్న ఆశలేదు. రేపటి కోసం ఇవాల్టి కాలాన్ని వెచ్చించాలన్న ఆలోచనే లేదు. నీ...నా అనే భావనేలేని రోజులవి. మనుషులందరూ జీవితం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సమిష్టిగా పాటుపడ్డారు. నిప్పుని కనిపెట్టినవాడు దానిమీద పేటెంట్ హక్కుని అడగలేదు. దుక్కినిదున్నిన వాళ్ళు నాగలి కర్రు మీద తమ పేరే ఉండాలని కోరలేదు. రాజ్యమే లేదు కాబట్టి రాజ్యం వీరభోజ్యం అనే మాటలకు అసలు తావే లేదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. కానీ కాలం గడుస్తున్నకొద్దీ సౌకర్యాలు, సౌలభ్యాలతో పాటు సంపద కూడా పెరిగి ఆస్తులు ఏర్పడ్డాయి. ఆపైన వాటిమీద హక్కుదారులు పుట్టుకొచ్చారు. దీనినే ''బలవంతులు దుర్జలజాతిని బానిసలను కావించారు'' అని ఎత్తిచూపాడు శ్రీశ్రీ. అది మొదలు మానవ సమాజంలో ఆనందమే లేకుండా పోయింది.
ఇంతకీ ఆనందమంటే ఏమిటీ? ఇది తెలియకుండా మనం ఆనందాన్ని పొందలేం. ఇక్కడే మనకు ఒకటో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తత్వవేత్త సెనెకా గుర్తుకొస్తాడు. నిజమైన ఆనందం అంటే భవిష్యత్తు గురించి బెంగ లేకుండా వర్తమానంలో హాయిగా ఉండటం అంటాడు ఆయన. కానీ మనుషులు అలా ఉండలేకపోవడమే నేటి విషాదం. ఎందుకంటే మన శతాబ్డాల పరిణామక్రమంలో ఎన్నడూ ఎరుగనంత అనిశ్చితితో కూడిన కాలమిది. ఈ ఇరవయ్యోకటో శతాబ్దంలో మానవజీవితం మరింత సంక్లిష్టమైంది. ప్రపంచ మానవాళిలో ఏ పూటకు ఆ పూట వెతుక్కోవాల్సిన అసంఖ్యాకులైన పేదలే కాదు, అన్నీ సమకూరిన అపర కుబేరులు కూడా భవిష్యత్తు గురించి యోచిస్తూ వర్తమానాన్ని ఆనందాలకు దూరం చేసుకుంటున్నారు. రేపటిని గురించిన బెంగతో తీవ్రమైన ఒత్తిడితో శాంతిలేని జీవితాలను గడుపుతున్నారు.
పాలకులు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటిల నిర్ణయాలు, కుట్రపూరిత వ్యవహారాలతో గడపడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినవారు తాము చేయాలనుకున్న పనులు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మరో అయిదేండ్ల తర్వాత కూడా అధికారంలోకి రావడమెలా అనే ఆలోచనలు చేసే కృతకమైన రాజకీయ వ్యవస్థను సాగిస్తున్నారు. పదవుల్లోకి వచ్చి ఆ పదవులు నిలుపుకోడం, తిరిగి ఆ పదవుల్లో కొనసాగడం కోసం సంపాయించుకోవడమే పనిగా బతికేవారు ప్రజలకు ఏం మేలు చేస్తారు. అదలా వుంచితే ఇప్పుడు సామాన్యులు, సంపన్నులు, పాలకులు అందరూ నిరంతర అభద్రతలో సతమతమవుతున్నారు. కొందరిది న్యాయమైన ఆశ, ఇంకొందరిది స్వార్థపూరితమైన దురాశ, మరికొందరిది అవాంఛనీయమైన అధికారవాంఛ. ఇలాంటి సమాజంలో సంతోషమెలా ఉంటుందీ ఎందుకుంటుందీ? కనుకనే ఇక్కడ బాల్యం, కౌమారం, యవ్వనం సైతం సంక్షుభితమైపోయింది.
ఈ దురవస్థ గురించే సెనెకా చెప్పాడు. ఎప్పుడయితే రానున్న రోజులు ఎలా ఉంటాయోనని భీతిల్లుతారో అప్పుడు వర్తమానంలో హాయిగా ఉండలేరు. హాయిగా ఉండటం తెలియకపోతే ఆనందంగా జీవించడమూ తెలియదు. మన చుట్టూరా సమస్యలు, సవాళ్ళు, సంక్లిష్టతలు ఎన్నో. ఇప్పుడు వీటిని ఛేదించడమెలాగో తెలుసుకోవాలి. ఆనందమయమైన మరోప్రపంచ నిర్మాణానికి మార్గాలు అన్వేషించాలి. ఆ మార్గంలో ప్రయాణిస్తూనే మన చుట్టూ జరిగే అనేక చిన్నచిన్న విషయాలు కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాయని గమనించాలి. వాటిని అనుభవంలోకి తీసుకుని అనుభూతి చెందాలి. ఉదాహరణకు సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల రాత్రులు, నదీ ప్రవాహాల వంటి ప్రకృతి సోయగాలు మనల్ని పరవశానికి లోనుచేస్తాయి. వాటిని ఆస్వాదించగలగాలి. అన్నిటికీ మించి మనిషి సంఘజీవి. కనుక సాటి మనుషుల్ని ప్రేమించడంలో గొప్ప ఆనందముంటుందన్న సామాజిక జీవన సూత్రం సదా ఎరుకలో ఉండాలి. మనుషులంతా ఒక్కటేననే మానవీయత హృదయంలో నిండి ఉండాలి.
కానీ ఈ వ్యవస్థ అలా ఉండనీయదు. మార్కెట్ మనుషుల్ని మాయ చేస్తుంటుంది. మతం మనుషుల్ని విడదీస్తుంది. రాజ్యం జీవించే హక్కుల్నే కూలదోస్తుంది. ఇప్పుడీ మూడూ జమిలిగా ఈ దేశ మౌలిక స్వభావానికే ముప్పు తెస్తున్నాయి. మనిషిని కనిపించని సంకెళ్లలో బంధించే కుట్రలు చేస్తున్నాయి. వీటిని ఛేదించడం ద్వారా మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలం. అందుకే పై పాటలో చెప్పినట్టు... ''అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి'' అన్నట్టుగా పోరాడితే మంచిరోజులు అసాధ్యమేమీ కాదు.