Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. అయితే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110 రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110రోజుల్లో ఆయిల్ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండించడం లేదు. దీనిని బట్టి రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమవుతోంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి తాజాగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది ఇటీవల పరిణామం. అంతకన్నా ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల ధనకాంక్షే అసలు కారణం. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభిస్తే, అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తుందని, అదే జరిగితే ముడిచమురు సరఫరాలో కొరత ఏర్పడుతుందన్న అంచనాల ఆధారంగా ప్రస్తుతం ధరలను పెంచుతున్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలతో సంబంధం లేకుండానే దానినొక సాకు తీసుకుని ధరలు పెంచుతున్నారు. ముడి చమురు కోసం ప్రపంచం కేవలం రష్యా మీదనే ఆధారపడి లేదు. పెట్రోలియం ఉత్పత్తిలో ఆ దేశానిది మూడవ స్థానం. అమెరికా, సౌదీ అరేబియాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నిజంగానే చమురు ఉత్పత్తితో సమస్యలు ఏర్పడితే ఇతర దేశాలు తమ సరఫరాలను పెంచవచ్చు. కానీ, రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు అదనంగా ఒక్క బ్యారెల్‌ను కూడా ఉత్పత్తి చేయబోమని ఒపెక్ దేశాలు ప్రకటించడం దేనికి నిదర్శనం? నిజానికి, బ్యారెల్ ధరను వంద డాలర్లకు చేర్చాలని ఈ దేశాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాయి. తాజా సంక్షోభాన్ని దానికి అవకాశంగా వాడుకున్నాయి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితే ధరల పెరుగుదలకు కారణమైతే యుద్ధ వాతావరణం మారి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ధరలు తగ్గుతాయా? ప్రస్తుతం ఊహల మీద ఆధారపడి ధరలను పెంచివేసిన ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు అలా తగ్గించడానికి ఒప్పుకుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానమేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మన దేశానికి వస్తే అమెరికా వత్తిడికి తలొగ్గి ఇరాన్‌తో ఉన్న ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకున్నాం. స్థిరమైన ధరకే చమురును అమ్మడానికి, మన కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి ఇరాన్ సిద్ధపడినా, ఆ ఒప్పందాన్ని కాలదన్నుకున్నాం. దానికి బదులు బేషరతుగా సౌదీ నుండి పెట్రో ఉత్పత్తులను కొంటున్నాం. దీనివల్ల దేశానికి నష్టం జరుగుతుందని, ధరలు పెరుగుతాయని అప్పట్లోనే వామపక్షాలు హెచ్చరించాయి. వామపక్షాల హెచ్చరికల్లోని వాస్తవాలు పెట్రో ఉత్పత్తులతో పాటు వివిధ రంగాల్లో ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. అయినా పాలకవర్గాల ఆలోచనల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేకపోగా అమెరికాకు మరింతగా సాగిలపడటానికే మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండటంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌చార్జీలను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడుతోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది.