Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రత్యేకంగా నేషనల్ ల్యాండ్ మోనిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసి) ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించే ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికే! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సిపిఎస్ఈ)ల్లోనూ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల్లోనూ మిగులు భూమి, భవనాల ఆస్తులను తెగనమ్మడమే ఈ కార్పొరేషన్ పని. నాన్-కోర్ ఆస్తులను మానిటైజ్ చేస్తామని 2021-22 బడ్జెట్లోనే పేర్కొన్నామనీ, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం ఇదేదో కొత్తగా చేస్తున్నది కాదని జనాన్ని నమ్మించే పన్నాగమే. ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థలను మొత్తంగా తెగనమ్మడమో పాక్షికంగా ప్రయివేటీకరించడమో చేసేవారు. కాని, ఇప్పుడు ఆ పరిశ్రమ లేదా సంస్థను అలాగే ఉంచి దాని ఆధీనంలోని భూములను అమ్మేయడానికి వేస్తున్న కొత్త పాచికే ఈ ఎన్ఎంఎల్సి. అంతేగాక ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వ శాఖ ద్వారా కన్నా ఈ కార్పొరేషన్ ద్వారా తెగనమ్మడం తేలిక. ప్రభుత్వరంగ పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు విద్య, వైద్యం తదితర రంగాల అభివృద్ధికి, సామాజిక న్యాయానికి తోడ్పడుతుందని భావించి ఆ స్థలాలను ప్రజలు ప్రభుత్వానికి గతంలో నామమాత్రపు నష్టపరిహారానికే ఇచ్చారు. ఇప్పుడు వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడం అంటే ఆ ప్రజలకు ద్రోహం చెయ్యడమే!
ఎన్‌ఎల్‌ఎంసి అతి కొద్దిమంది శాశ్వత సిబ్బందితో ఏర్పాటవుతుందనీ, మిగతా పనులకు ప్రయివేట్ రంగం నుండి అనుభవజ్ఞులైన నిపుణులను నియమించుకోవచ్చునని సర్కారు పేర్కొంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిశోధన, వాల్యుయేషన్, మాస్టర్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ల్యాండ్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో ఆస్తుల అమ్మకానికి అవసరమైన విస్తత నైపుణ్యాల కోసం నిపుణులను నియమిస్తామని తెలిపింది. కార్పొరేట్లకు అవసరమైన పనులన్నీ వారే చక్కబెడతారన్నమాట! ప్రయివేట్ రంగ పెట్టుబడులు, కొత్త ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపించడానికి ఎన్‌ఎల్‌ఎంసి ఏర్పాటు చేశామని సర్కారు చెప్పడంలోనే వారి లక్ష్యం స్పష్టమవుతోంది. సిపిఎస్ఈల మూసివేత ప్రక్రియను ఎన్‌ఎల్‌ఎంసి మరింత వేగవంతం చేస్తుందని కూడా సర్కారు వెల్లడించింది. సిపిఎస్ఈల నాన్-కోర్ భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, నిర్వహించడం, నగదు ఆర్జించడం కూడా ఈ కార్పొరేషన్ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఆయా ప్రభుత్వరంగ సంస్థలకు, అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు కూడా ఎన్‌ఎల్‌ఎంసి ఒక సమాంతర వ్యవస్థలా లేదా వాటికి అతీతమైన సంస్థలా వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కరలేదు.
దేశంలోని అనేక నగరాలు అభివృద్ధి కావడంలో ప్రభుత్వరంగం పాత్ర ఎంతో కీలకమైనది. పట్టణీకరణ మూలంగా వివిధ నగరాలు, పట్టణాలు, కొన్ని పారిశ్రామిక క్లస్టర్లూ అతి వేగంగా విస్తరిస్తున్నాయి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, గృహ వసతి, రోడ్ల విస్తరణ వంటి ప్రజావసరాలు తీర్చడానికి భూములు కావాలి. అవి ప్రభుత్వానివి లేదా ప్రభుత్వరంగ సంస్థలవి అయితేనే ప్రాధాన్యతలనుబట్టి ప్రజావసరాలకు వినియోగించవచ్చు. అలా కాకుండా ఒకసారి ప్రయివేటు పరమైతే రియల్ ఎస్టేట్ ఆస్తులుగా మారి వ్యాపారుల ప్రయోజనాలే నెరవేరుతాయి. ఉదాహరణకుమన పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖలో పోర్టు, రైల్వే, డాక్‌యార్డు భూములు ప్రయివేటు పరమైతే నగరాభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు ఎక్కడా జాగా దొరకదు. అక్కడే కాదు దేశమంతటా అదే పరిస్థితి ఏర్పడుతుంది. నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ పేరిట ప్రభుత్వ ఆస్తులను లీజుకిచ్చేందుకు అట్టహాసం చేసినా అది అంతగా ముందుకు కదిలినట్టులేదు. ఇప్పుడు భూములు, స్థిరాస్తులను రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కార్పొరేట్లకు కట్టబెట్టే ఈ ఎన్‌ఎల్‌ఎంసి ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. దీనిని ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు నెత్తికెత్తుకున్న ప్రభుత్వాలున్నచోట ప్రజాసంపదను కాపాడుకోవడం ప్రజల కర్తవ్యం. అందుకు ఐక్య ఉద్యమాలే మార్గం. అవి మాత్రమే పాలకులకు ముకుతాడు వేయగలవు.