Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీరులకు మరణం లేదు
యోధుల చరిత ముగియదు..
కాలం గీతలు గీయొచ్చుగాక,
చైతన్యం శ్వాసై ఊపిరి పోస్తూనే వుంటుంది.
వారి జ్ఞాపకాలు ఆశయాల దారుల్లో వెలుగుతూనే వుంటాయి!
ఎవరి పేరు వింటే విప్లవ కెరటాలు హృదిలో ఎగసిపడతాయో, ఎవరి జీవితం స్మరణకురాగానే, ఆధిపత్యంపై ఎక్కుపెట్టిన తూటా శబ్దం ప్రతిధన్విస్తుందో, ఎవరి చరిత, భవితను నిత్యనవోన్మేషం చేస్తుందో ఆ బ్రతుకు అమరం! అంతకంటే ఏంకావాలి మనిషికి! అదే పరిపూర్ణతనిస్తుంది.
ఆడవాళ్లు వంటింటికి, పిల్లలు కనిపెంచడానికేనని పేలుతున్న నోళ్ళపైకి యుద్ధక్షిపణిలా విరుచుకు పడి , మహిళాత్మ ధీరతను నిరూపించిన మహామనీషి. విప్లవించడం విముక్తి మార్గమని నమ్మి, సమస్త పీడనల శాశ్వత సమాధికి అదే పునాదియని, సమసమాజ నిర్మాణమే మహిళకు,శ్రామిక జనులకు ఆవశ్యకమని విశ్వసించిన అరుణగీతిక. చిరు ప్రాయంలోనే చిరుతలా దుముకుతూ భూస్వామిక పీడనపై పిడికిలెత్తి విరుచుకు పడి సివంగిలా శిరమెత్తిన విప్లవ జ్వాలా కెరటం. వెట్టి బతుకులగోసను మనసు పెట్టి విని మానవీయ హదయంతో ప్రజ్వలించిన జోధ. ఎక్కడపుట్టావు, ఎవరి ఇంట పెరిగావ్, ఈ దుష్టవర్ణ కల్మషాలు ఎన్ని వెంటాడినా, అణగారిన దిగజారిన దీనుల కొరకు చివరి వరకు నిలిచి పోరాడిన ధీరవనిత.
మల్లు స్వరాజ్యమంటే సమతా రాజ్యపు నినాదం. శ్రామిక శక్తుల సమూహస్వరం. ఎగరేసిన ఎర్రబావుటా, తిరుగుబాటు మార్చింగ్ సాంగ్, కొంగు నడుముకు చుట్టిన కొడవలి పదును. తెలంగాణ నేల మీద ఎత్తిన తలల కత్తుల చూపు. వడిసెలు విసిరిన చేతుల చైతన్యం. ఇంకా ఎన్నో ఎన్నో... ఆమెకు పర్యాయపదంగా ఎన్ని ప్రతిఘటనా దశ్యాలనైనా పదాలు పేర్చవచ్చు. ఎందుకంటే చరిత్ర తన కోసం తాను తీర్చుకుని సష్టించుకొన్న ఆశయాల ఆకారం ఆమె.
తెలంగాణ గడ్డపైన జమీందార్ల, జాగీరుదార్ల, దేశ్ ముఖ్ ల, నవాబుల దోపిడి, దుర్మార్గాలపై తిరగబడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నిప్పు కణికలా ఎగసిపడ్డ, ఈ నేల ముద్దుబిడ్డ, స్వరాజ్యం. తన పాత్రను సమున్నతంగా పోషించి, ఆదర్శ జీవితంగా భావితరాలకు స్ఫూర్తి నింపింది. పదకొండేళ్ళకే సమాజం కోసం గళమెత్తిన ఆమె ఆంధ్రమహాసభ, సంగం అందించిన ఆలోచనలను, ఆశయాలను పుణికిపుచ్చుకొని, మహౌన్నత కమ్యూనిస్టు భావాలతో ఇంతింతై ఎదిగి, బిడ్డల్ని మోసే భుజాలపై తుపాకులను మోస్తూ గెరిల్లాయుద్ధ యోధురాలుగా చరిత్ర లిఖించింది. అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి నడుస్తున్న దారుల్లో కదులుతూనే భర్త వెంకట నర్సింహారెడ్డి అందించిన ప్రోత్సాహంతో కదనరంగాన వీరనారిగా తన ప్రస్థానాన్ని సాగించింది.
కమ్యూనిస్టు అంటే ఎలా వుండాలి. మహిళలు ఎంత ఆత్మస్థయిర్యంతో నిలబడాలి అనే ప్రశ్నలకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది స్వరాజ్యం. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినా సామాన్యులతో సాగించిన జీవనం ఆగిపోలేదు. పదవులకు, ప్రాతినిధ్యానికే గౌరవాన్ని తెచ్చి నిజాయితీ, నిబద్ధతే జీవితపు ఔన్నత్యానికి గుర్తు అని చాటి చెప్పిన ఆశయ మూర్తి ఆమె. వివక్షతకు, హింసకు, దోపిడికి వ్యతిరేకంగా మహిళలు మేల్కొని సంఘటితమై పోరాడాలని మహిళా సంఘ ఉద్యమ నిర్మాణానికై కషి సల్పిన చైతన్యశీలి. సామ్రాజ్యవాదంపై నిప్పులు చెరుగుతూ వారి దౌష్ట్యాలను నిగ్గదీసిన గొంతుక ఆమె. మమతత్వం, మనుషుల్ని విడదీసే రాక్షసి అని ఉద్భోధించే గళం ఆమెది. ఇవ్వాళ కాకుంటే రేపైనా ఎర్రకోట మీద ఎర్రని జెండా ఎగిరి తీరుతుందని విశ్వాసాన్ని నింపిన గుండె ఆమెది. బాల్యం నుంచి చివరి వరకు పిడికిలి యెత్తి చెప్పిన లాల్ సలామ్ తొణకలేదు. తొలగలేదు. ఆమె సార్ధక జీవి, ఆమె ఆమరురాలు. ఆమె స్వప్నాన్ని నిజం చేసుకోవటానికి ముందుకు మును ముందుకు కదలటమే నిజమైన నివాళి.