Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కై వంగనిది మానై వంగదు అన్న నానుడిలోని వాస్తవాన్ని సంఫ్‌ుపరివార్, బీజేపీలు గుర్తించినట్టుగా ఎవరూ గుర్తించరనుకుంట. అందుకే గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలోనూ, ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనూ విద్యా, సాంస్కృతిక రంగాలలో సంఫ్‌ుపరివార్ సిద్ధాంతాలను చొప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరమని విద్యావేత్తలు ఆందోళన చెందుతుంటే.. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా ''విద్యను కాషాయీకరిస్తే తప్పేముంది?'' అంటూ బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ''దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది'' అంటారు ప్రముఖ విద్యావేత్త కొఠారి. ఏ తరగతి గదైనా విద్యార్థు లను విద్య గురించి ఆలోచింప చేయాలి. భవిష్యత్తును గురించి భవ్యమైన కలలు కనేటట్టు ప్రేరేపించ గలగాలి. ఈ సమస్త విజ్ఞానానికీ సాధించిన ప్రగతికీ చదువే మూలం..! అలాంటి చదువులు నేడు చదివితేనే కదా రేపటి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ''మనం నిజంగా స్వతంత్రులుగా ఉండటానికి ఏ చదువయితే పనికిరాదో దాన్ని నిర్ద్వంద్వంగా ధిక్కరించాలి. అటువంటి చదువు రాక్షసం, పాప భూయిష్టం'' అంటారు గాంధీ. మరి నేడు దేశంలోని చదువుల్ని, అమలవుతున్న విద్యావిధానాన్ని అనుసరించాలా? లేక ధిక్కరించాలా? తెల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
చదువంటే విద్యార్థుల విజ్ఞానాన్ని, సత్ప్రవర్తననూ, సమాజం పట్ల బాధ్యతనూ పెంపొందించడం. కాషాయికరణ అంటే మనువాద భావజాలాన్ని భవితకు ఎక్కించడం, కుల సమాజాన్ని సిర్థ పరిచి, కుల వృత్తులకే పరిమతం చేయడం. అంతే కాదు స్త్రీల పట్ల వివక్షత చూపించడం, వాళ్లను వంటింటికే పరిమితం చేసి చదువుకు దూరం చేయడం. అశాస్త్రీయతను, మూఢత్వాన్ని ప్రోది చేసే అజ్ఞానాన్ని పిల్లలకు అందించి స్వతంత్రంగా బతకలేని స్థితికి నెట్టడం. తమ అభివృద్ధికి కారణమైన ప్రజల గురించీ, సమాజం గురించీ క్షణమైనా ఆలోచించలేని సంకుచిత భావంలోకి విద్యార్థులను తీసుకుపోయే కుట్రలో భాగమే ఈ విద్యా కాషాయీకరణ. కాసింతయినా సామాజిక స్పృహ, బాధ్యతా లేకపోవడం ఏ సమాజానికీ శ్రేయస్కరం కాదు. అలాంటి సమాజన్నేనా ఉపరాష్ట్రపతి కోరుకుంటున్నది? చదువంటే కేవలం అక్షర జ్ఞానం, ఉద్యోగ సాధన మాత్రమే కాదు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం ఏర్పరచడం, సామాజిక స్పహ, సామాజిక బాధ్యత కల్పించడం. ఏ సమాజమైనా నిరంతరం పురోగమనంలో ఉండాలంటే విద్యకు ఈ లక్షణం తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే ఈ శాస్త్రీయ భావజాలం, సామాజిక చైతన్యం అనేవి విద్యాలయాల నుంచి సమాజానికి చేరుతాయి. చదువు సమాజానికి దారి చూపే దివిటీ. అలాంటి దివిటీలకు కాషాయ తెరలు కట్టి ఆ వెలుగులను విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి.
నేడు అంతరిక్షంలోకి ప్రయాణిస్తూ, చంద్ర మండలంపైనో, అంగారక గ్రహాలపైనో నివాస అన్వేషణ చేస్తున్నామంటే అది సైంటిఫిక్ విద్యావిధానంతోనే సాధ్యమైంది. మనిషి గుండెతో సహా ప్రతి అవయవానికి రోబోటిక్ సర్జరీలు చేస్తున్నామంటే అందుకు అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే కారణం. మానవుడి ప్రతికదిలిక సైన్సు అండ్ టెక్నాలజీతోనే ముడిపడి ఉంది. ఇదే లేకపోతే మానవ మనుగడే అసాధ్యం. ఉపరాష్ట్రపతిగారు అన్నట్టు విద్యను కాషాయీకరించడమంటే విద్యార్థుల మెదళ్లల్లో మూఢత్వం పెంచి పోషించడమే. ఆ పేరుతో జ్యోతిష్యం, బానామతి వంటి వాటిని కోర్సులుగా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టడమే. అంటే ఏనాడో వదిలేసిన, వదిలించుకున్న అశాస్త్రీయ విధానాలను, అధికారికంగా అందరి మీద రుద్దటమే.
ఒకప్పుడు చైతన్య కేంద్రాలుగా విరాజిల్లిన విశ్వవిద్యాలయా లకు నేడు మతం కులం రంగులు పులుముతూ అచేతనంగా మారుస్తున్నారు. విద్యార్థుల మధ్య విద్వేషాలను రెచ్చగొడు తున్నారు. సమాజాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించి, మానవ జీవితాన్ని సుఖమయం, విజ్ఞానవంతం చేయటమే చదువుల పరమార్థం. అది నెరవేరినప్పుడే ప్రజలు వివేకవంతు లవుతారు. వివేకవంతులకే వివేచన ఉంటుంది. ప్రశ్నించే తత్వం ఏర్పడుతుంది. రుజువులకు నిలబడని దేనినీ విశ్వసించని తర్కజ్ఞానం అలవడుతుంది. వీటినే మనం శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం అంటాం. ఒక ప్రగతిశీల రాజ్యం అవతరించాలంటే ఆ తర్కం అవసరం. అందుకే శాస్త్రీయ పురోగతిని మన రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించు కున్నాం. కానీ దశాబ్దాలు గడుస్తున్నా ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడే ఉన్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం ఈ సమాజానికి అనర్థదాయకం. దీనిని అధిగమించడానికి మనకున్న ఏకైక మార్గం ప్రజల నిజమైన అవసరాలకు అనుగుణంగా మన చదువుల్ని సంస్కరించు కోవడమే. మన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసుకోవడమే. మన ఏలినవారు కూడా ఇప్పుడు ప్రక్షాళనే చేస్తామంటున్నారు..! కానీ వారి ప్రక్షాళన తిరోగమనం వైపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దానిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అభ్యుదయ శక్తులపై, ప్రగతిశీల వాదులపై ఉంది.