Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్...'' అంటూ నాలుగు దశాబ్దాల కిందట 'ఆకలిరాజ్యం' చిత్రంలో నిరుద్యోగ భారతాన్ని ఆవిష్కరించిన పాటనే నేటి యువతరం మళ్లీ పాడుకోవాల్సిన దుస్థితిలో దేశముంటే, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో దాదాపు 8.7లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మోడీ సర్కార్ పార్లమెంటు నిండు సభలో నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. 2014 ఎన్నికల్లో బీజేప ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చేసిన వాగ్దానం ప్రకారం... ఇప్పటికే 16 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ ఈ ఎనిమిదేండ్ల కాలంలో మోడీ సర్కార్ కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో దేశంలో నిరుద్యోగిత 45ఏండ్లలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి ఎగబాకి 8.10శాతానికి చేరింది. నిరుద్యోగులకు ఆశాకిరణంగా ఉండే భారతీయ రైల్వేలలోనే దాదాపు 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరంలేదని కేంద్ర రైల్వే మంత్రి సెలవిచ్చారు. అంటే యువతకు ఉద్యోగాల కల్పన పట్ల వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
కొత్త ఉద్యోగాల సృష్టి లేదు. సర్కార్ కొలువులు భర్తీ చేయరు. ఇక నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కడ వెతుక్కోవాలి? గ్రామీణ భారతావనిలో కొత్తశక్తిని నింపిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికైనా చేయూతనందించారా అంటే అదీ లేదు. యూపీఏ హయాంలో వామపక్షాల చొరవతో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి మొన్నటి బడ్జెటే నిదర్శనం. నిరుద్యోగం పెరిగిపోతున్న దరిమిలా పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఆర్థిక నిపుణులు పదేపదే డిమాండ్ చేస్తున్నా మోడీ సర్కార్ పెడచెవిన పెడుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగాన్ని సైతం మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. కోవిడ్ విపత్తులో స్థిరాస్తి, విద్యుత్ వంటి రంగాల్లో కార్పొరేట్ కంపెనీలకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన మోడీ సర్కార్ కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలకు మొండి చేయి చూపింది.
అదానీలకు, అంబానీలకు దేశ వనరులను దోచి పెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడం తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమను కూడా ఈ కాలంలో స్థాపించలేదు. మోడీ సర్కార్ ప్రాధమ్యాలే వేరు. గుజరాత్లో సర్దార్ వల్లభారు పటేల్‌కు విగ్రహం, అవసరమున్నా లేకపోయినా హస్తినలో సెంట్రల్ విస్టా వంటి నిర్మాణాలకు రూ.లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యలకు మాత్రం చిల్లిగవ్వ ఖర్చు చేయడం లేదు.
వైద్య, సాంకేతిక విద్యారంగాలను ప్రయివేటుపరం చేయడంతో కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తుండగా, ప్రమాణాలు అసాంతం పడిపోతున్నాయి. దేశ యువతరానికి ఉన్నతవిద్య, సాంకేతిక నైపుణ్యాలు అందని ద్రాక్షే అవుతున్నాయి. పారిశ్రామిక అవసరాలను తీర్చే నైపుణ్యాలు వారికి అందడం లేదు. నూతన విద్యా విధానం ముసుగులో కోవిడ్ సాకుతో 'ఆన్లైన్ విద్య'ను రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న విద్యా రంగాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కార్పొరేట్ కంపెనీల లాభాలకు బలివ్వడమే దీని వెనుక అసలు లక్ష్యం. రైల్వేలు, పట్టణ ఉపాధి, నదులు, జల వనరులు, అటవీశాఖ, పశుపోషణ, వ్యవసాయ పరిశోధన, ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలన్నిటిలోనూ ఇదే రీతిలో ప్రయివేటు చొరబాటును ప్రోత్సహిస్తున్నదీ మోడీ ప్రభుత్వం. ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ ఉపాధి కల్పనపై లేదు. గోదాడులు మొదలుకొని ఇప్పటి 'కాశ్మీర్ పైల్స్' వరకూ బీజేపీ ప్రభుత్వానిది ఒకటే అజెండా. దేశ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం. ఈ విధానాలకు ప్రతిఘటన రాకుండా ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు కార్పొరేట్, హిందూత్వ విధానాలను మోడీ సర్కార్ ముందుకు తెస్తున్నది. ప్రజాకంటకమైన ఈ విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమించడం ఒక్కటే యువత ముందున్న మార్గం.