Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటారు. కానీ ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఆధారంగా అబద్ధాల ఫ్యాక్టరీలో అనేకానేక అసత్యాలను వండి వారుస్తున్న బీజేపీ పరివారం.. తెలంగాణకు సంబంధించిన ఒక కీలకాంశంలో దొంగాట ఆడి, కన్నంలో దొరికిపోయింది. గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా రాలేదంటూ కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించి... అబద్ధమే అవాక్కయ్యేలా చేశారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కమార్ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఇలాంటి సత్యదూరమైన సమాధానమివ్వటంతో ఇక్కడ గిరిజనాగ్రహానికి గురికాక తప్పడంలేదు. మరోవైపు ఎస్టీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అసెంబ్లీలో తీర్మానించి పంపిన ప్రతులను మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌లు మీడియాకు విడుదల చేయటంతో బీజేపీ బండారం బయటపడింది.
వాస్తవానికి ఇక్కడ కేంద్రంలోని బీజేపీని ప్రజలు మొదటి దోషిగా బోనులో నిలబెడుతున్న తరుణంలో... ఆ తర్వాత రెండో దోషిగా టీఆర్ఎస్ సర్కారును నిలబెట్టక తప్పదు. తెలంగాణలోని గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకటించింది. ఇదే సమయంలో మన గతానుభవాన్ని పరిశీలిస్తే... రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కొంత ప్రతిబంధకంగా మారింది. ఈ క్రమంలో కేంద్రంపై గట్టిగా పోరాటం చేయటం ద్వారా రిజర్వేషన్ల పెంపును సాధించాల్సిన టీఆర్ఎస్, అందుకు భిన్నంగా తాత్సార ధోరణితో వ్యవహరించింది. దీంతో ఎనిమిదేండ్ల పుణ్యకాలం గడిచిపోయింది. ఈ నిష్క్రియాపరత్వం గిరిజనులకు తీరని నష్టాన్ని చేకూర్చింది. మరోవైపు విభజించి, పాలించు తరహాలో గులాబీ పార్టీ సైతం ఈ రిజర్వేషన్లపై దోబూచులాట ఆడింది. గతంలో తనకు అవసరమైన చోట్ల, అవసరమైన సందర్భాల్లో ఇటు లంబాడీలను, అటు గోండ్లు, కోయలను ఎగదోసి... 'తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి...' అనే చందంగా కొద్ది రోజులు చోద్యం చూసింది. ఆ ఇరు వర్గాలకు టీఆర్ఎస్ నేతలే ముందుండి, నేతృత్వం వహించటం గమనార్హం. ఈ క్రమంలో ఇప్పుడు అసలు తెలంగాణ ప్రభుత్వం తమకెలాంటి తీర్మానమూ పంపలేదంటూ కేంద్ర మంత్రి ప్రకటించటంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టైంది.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమాత్యవర్యుల్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లపై తీర్మానించి... కేంద్రానికి పంపినప్పుడు ఆ తీర్మానానికి ఆమోదమద్ర వేసిన ఎమ్మెల్యేల్లో గంగవరపు కిషన్‌రెడ్డి కూడా ఒకరు. ఆయనే ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఉత్తమ్ ప్రశ్న వేసినప్పుడైనా, దానికి కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ స్పందించినప్పుడైనా... కిషన్‌రెడ్డి తన మౌనాన్ని వీడి వాస్తవాలు చెబితే, పరిస్థితి మరోలా ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఆయన నోరు విప్పకపోవటాన్నిబట్టి రిజర్వేషన్లపై బీజేపీ దొంగాటేమిటో విదితమవుతున్నది.
మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్... కొలువులిస్తాం, నోటిఫికేషన్లు వేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించారు. వివిధ శాఖల్లో 80వేల పై చిలుకు పోస్టులను భర్తీ చేస్తామంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో గత ఎనిమిదేండ్ల నుంచి రిజర్వేషన్ల కల్పనపై కేంద్రం పట్టించుకోకపోవటం, దాని నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం నిలకడగా, నికరంగా పోరాడకపోవటంతో తెలంగాణలోని గిరిపుత్రులను తీరని అన్యాయం జరిగే అవకాశముంది. ఒక్క ఉద్యోగాలే కాదు.. విద్య, రాజకీయ రంగాల్లో కూడా వారికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైఖరిపై పోరాటానికి సమాయత్తమవ్వాలి. నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించటం ద్వారా మోడీ సర్కారుపై ఒత్తిడి తేవాలి. అలాగాకుండా గతంలో మాదిరిగానే అవసరమొచ్చినప్పుడో, బీజేపీని తిట్టాల్సి వచ్చినప్పుడో రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెస్తే జనం ముందు మరింత అభాసుపాలు కాకతప్పదు. ఈ విషయాన్ని అధికార పార్టీ అగ్రనేతలు ఎంత తొందరగా గ్రహిస్తే.. రాష్ట్రానికి, గిరిజనులకు అంత మంచిది. దీంతోపాటు రిజర్వేషన్లు, వాటి పెంపుపై మేధావులు, సామాజిక వేత్తలు విస్తృతమైన చర్చలు నిర్వహించాలి. మతోన్మాదం, కార్పొరేటీకరణ విధానాలను మిక్సీలో వేసి ఒక అజెండాను ఫిక్స్ చేసి జనం మీదికి వదులుతున్న బీజేపీ... అందులో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అలా పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మొత్తం అంబానీ, ఆదానీల్లాంటి వారి చేతుల్లోకి వెళ్లినప్పుడు అసలు రిజర్వేషన్ల ప్రసక్తి, ప్రస్తావనే ఉండదు కదా. అలాంటప్పుడు ఒక్క గిరిజనులకే కాదు... తెలంగాణలో నూటికి 90శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవి అందని ద్రాక్షే అవుతాయి. వీరితోపాటు మహిళలు, వికలాంగులకు ఉన్న అవకాశాలూ పోతాయి. అందువల్ల రిజర్వేషన్ల గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం కచ్చితంగా పోట్లాడాలనే స్పృహను పాదుకొల్పాలి.