Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మె సన్నాహాలు మంత్రుల ఆవాసాల్లోకి ప్రవహించడం మన తెలంగాణకు శుభ శకునమే. టీఆర్ఎస్ నాయకత్వం మన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల వారినే సమ్మె పనికోసం పురమాయించడం కూడా ఆనందించాల్సిన విషయమే! అయితే కష్టజీవుల జీవితాల్ని ఫణంగా పెట్టి కేంద్ర సర్కార్‌తో బేరసారాలాడకుండా మనసా, వాచా, కర్మణా మార్చి 28, 29 దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె లక్ష్యాలకే కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడాలని రాష్ట్ర శ్రామికులు కోటాను కోట్లుగా అభిలషిస్తున్నారు.
మన ''ప్రజల్ని కాపాడుకుందాం! దేశాన్ని కాపాడుకుందాం!'' అనే నినాదం ఇప్పటికే పారిశ్రామికవాడలు, గ్రామాల కూడళ్లలో ప్రతిధ్వనిస్తోంది. ఇళ్లలోగిళ్లలో మంత్రాక్షరమవ్వాలి. ఈ నెలాఖర్లో జరిగే రెండ్రోజుల సమ్మెలో డిమాండ్లు పాతవే. పోరే కొత్తది. మరో మూడ్రోజుల్లో జరిగే సమ్మె, గ్రామీణ బంద్‌కు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ దేశ వ్యవసాయాన్నీ దేశ, విదేశ కార్పొరేట్లకు తెగనమ్మేందుకు కుట్ర పన్నింది మోడీ సర్కార్. దాదాపు నాలుగు వందల రోజులు దేశ రాజధానినే ముట్టడించి తనకు ఎదురే లేదని విర్రవీగే మోడీ సర్కార్‌పై గ్రామీణ భారతం తిరగబడింది. తిప్పికొట్టింది. ఇంత పెద్ద వ్యవసాయార్థిక వ్యవస్థున్న దేశంలో ఆ వ్యవసాయాన్నే రైతులకు దక్కకుండా చేసిన తర్వాత ఇక మన ప్రజలకు మిగిలేదే ముంటుంది? మనం తినేదేముంటుంది? అందుకే దేశాన్ని కాపాడుకోవాలనే డిమాండు రణనినాదమైంది.
కార్మికుల సమస్యలు మన రాష్ట్రం వారివైనా, మరే రాష్ట్రం వారివైనా ఒకే తీరుగానే ఉంటాయి. మోడీ సర్కార్ అతి క్రూరమైన లాక్డౌన్ ప్రకటిస్తే వలస కార్మికుల పాదాలు, అది ఢిల్లీ టు రాంచీ అయినా, హైదరాబాద్ నుండి రాయపూర్ అయినా నెత్తుటి దారులే కదా పరిచాయి?! ఆ నెత్తుటి ధారలేగా ప్రపంచం కళ్ళు చెమర్చేలా చేసింది? మోడీ సంకీర్తనల్లో రేయింబవళ్ళూ పులకరించే గోడీ మీడియా తప్ప, అది కక్కిన కూటినే పరవాన్నంలా జుర్రే ''భక్తబృందం'' తప్ప మిగిలిన మీడియా, దాని వీక్షకులంతా వలవల ఏడ్వలేదా ఆనాడు?! ఆ వలస కార్మికులేగా మొన్న బోయిగూడలో కాలిబుగ్గి అయ్యింది. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ను మత్తులో జోగేలా చేసిన ఆ విధానాలపైనేగా రేపటి సమ్మె! అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వారి 'సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్' నివేదిక భారతదేశ కార్మికుల్లో రెగ్యులర్ వేతన కార్మికులకు నెలకు పదివేల రూపాయల ఆదాయం వచ్చేవారు 57శాతం మంది కాగా, క్యాజువల్ కార్మికుల్లో 84.3శాతానికి నెలకి రూ.7500 మాత్రమే అందుతోందని పేర్కొంది. మన రాష్ట్రంలో సగానికి పైగా వలస కార్మికులున్నారు. పి.ఎఫ్., ఈఎస్ఐ, వంటి సాంఘిక భద్రతా చర్యలు అందనంత దూరంలో ఈ కార్మికులున్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో 50శాతం, ప్రయివేటురంగంలో 70శాతం వరకు వివిధ పేర్లతో పిలవబడే తాత్కాలిక కార్మికులున్నారు. సులభతర వ్యాపారం పేరుతో ఇదంతా జరుగుతోంది. మనుషుల్ని కందెన వేయాల్సిన అవసరం కూడా లేని రోబోలుగా పరిగణిస్తోంది సర్కార్. వారిని మనుషులుగా గుర్తించకపోవడం, కనీసం ఒక పూటైనా తినకుంటే చాకిరీ చేయలేరన్న ఇంగిత జ్ఞానం పాలకులకు లేకపోవడం మన దౌర్భాగ్యం. పశ్చిమ దేశాల్లో ఉన్న సాంఘిక భద్రతా సౌకర్యాలు వంటివి కాదు మన దేశ కార్మికులు స్వప్నిస్తున్నవి! ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను నీరుగార్చవద్దని డిమాండు చేస్తున్నారు. ఎప్పటినుంచో పోరాడుతున్నారు. రేపు సమ్మెకూడా చేస్తున్నారు. 4కోడ్ల పేరుతో కార్మికోద్యమానికి ఉరితాళ్లు సిద్దంచేసింది. కార్మికుల్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇన్ని రకాల సమస్యలు కార్మికులవి, రైతులవి ఇమిడి ఉన్నాయి కాబట్టే మన ప్రజల్ని కాపాడు కుందామన్న డిమాండ్ కూడా నినాదమై మారుమోగుతోంది. రేపు జరిగే సమ్మెలో ఇన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి. ఊర్లోని అన్ని కార్మిక సంఘాలూ ఒకటిగా ఉన్నాయి. ఒక్క 'ఉలిపికట్టెకు' మాత్రం ఇందులో 'రాజకీయం' కనపడింది. 2010లో ఒకరోజు, 2012లో ఒకరోజు, 2013లో రెండ్రోజులు జరిగిన సమ్మెలన్నింటిలో 'ఉలిపికట్టె' కూడా పాల్గొన్నది. ఆశ్చర్యమేమంటే అప్పుడున్న డిమాండ్లే ఇప్పుడూ ఉన్నాయి. పైగా నేడు మోడీ సర్కార్ బరితెగించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు కార్పొరేషన్లుగా విడగొట్టేశారు. ఎల్ఐసీ ఐపీఓకు ముహూర్తం నిర్ణయమైపోయింది. ప్రభుత్వరంగంలోని ఒక సాధారణ బీమా కంపెనీ మార్కెట్లో బేరానికి పెట్టేశారు. సుమారు రూ.5లక్షల కోట్లకు పైగా ప్రభుత్వరంగ కంపెనీల వాటాలను ఏడేండ్లలో అమ్మేశారు. ప్రజల ఆస్థులను కార్పొరేట్లకు తెగనమ్మడం దేశభక్తా? తామే అసలు సిసలైన దేశభక్తులమని ఇల్లెక్కి కూసే 'ఉలిపికట్టె' సంఘ నేతలారా! కనీసం మీ సభ్యులకైనా మీరేంటో, మీ రాజకీయమేంటో వివరించండి! 2015 అఖిల భారత సమ్మె నుండి అనుభవమేమంటే.. 'ఉలిపికట్టె' అనుయాయులూ 2015, 2016, 2019 సమ్మెల్లో భుజం భుజం కలిపి నడిచారు. కలిసే గళమెత్తారు. విషయం రాజకీయాలది కాదు. దేశాన్ని తక్కెడలో పెట్టి అమ్మేందుకు అనుమతిద్దామా? వద్దనడానికే ఈ సమ్మె. గ్రామీణ బంద్!