Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆకాశం ధారాపాతంగా వాన కురుస్తూ ఉంటే.. ఆశగా కండ్లు విప్పార్చి అటే చూస్తున్నాను. ధారపాతంగా కారే ఏ చినుకులతోనైనా కలిసి ధరలు కిందికి చేరి, ఈ 'ధర'ను చేరతాయని.. నేను చేతకపక్షినో, చేతకాని మనిషినో...' అన్నాడో కవి. నిజమే ఆ కవి గారి మాదిరిగానే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమానీ సగటు జీవి సైతం 'ఏం కొనేటట్టు లేదు.. ఏ తినేటట్టు లేదు...' అనుకుంటూ పెరుగుతున్న ధరవరలతో బెంబేలెత్తిపోతున్నాడు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ ఇద్దరూ కలిసి అటు వంటిట్లో (గ్యాస్), ఇటు నట్టింట్లో (విద్యుత్) ఛార్జీలను అమాంతం పెంచటం ద్వారా సామాన్యుడి నడ్డి విరిచారు. ఇది చాలదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడి ఎర్రబస్సు టికెట్ల రేట్లను పెంచితే.. కేంద్రం సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ వాడే వాహన ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచటం ద్వారా ప్రయాణాలను కాస్తా... ప్రయాసల ప్రహసనంగా మార్చాయి.
1991 నుంచి సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణనే ముద్దు పేర్లతో పాలకులు మన మీద ముప్పేట దాడి చేస్తున్నారు. మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అచ్చొచ్చిన ఈ 'త్రికరణ సూత్రాల్లో...' రెండోదైన ప్రయివేటీకరణ మీద ఆయన విపరీతమైన మోజు పెంచుకున్నారు. ఫలితంగా ప్రజలు రోజూ వాడే ఇంధనం నుంచి 'ధనాన్ని' పిండుకోవటాన్ని బహు బాగా నేర్చుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్‌తోపాటు వంట గ్యాస్ ధరలపై నియంత్రణను ఎత్తేసి... వాటిని కార్పొరేట్లకు అప్పగించేశారు. దాని ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం. వాస్తవానికి వంట గ్యాస్‌పై రాయితీని ఎత్తేసి... దాని స్థానంలో 'నగదు బదిలీ'ని ప్రవేశపెడతామంటూ చెప్పినప్పుడే వామపక్షాలు, మేధావులు తీవ్రంగా హెచ్చరించారు. నగదు బదిలీని ఎత్తేస్తే గ్యాస్ బండ మొత్తం ధరను వినియోగదారులే చెల్లించాల్సి వస్తుంది, కాబట్టి రాయితీనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. వారి మాటలను పెడచెవిన పెట్టిన పాలకులు...నగదు బదిలీని ఖాయం చేశారు. ఇప్పుడు రాయితీ, నగదు బదిలీ రెండూ పోయాయి. ఎన్నిలకప్పుడు కొద్ది రోజులు ధరల పెరుగుదలను నిలుపుదల చేయటం, ఆ తర్వాత వాటిని రోజూ పెంచుకుంటూ పోవటం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు షరా మామూలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇప్పుడు 'మిత్రోన్...' అనుకుంటూ పెట్రోల్ ధరను రూ.110కి, గ్యాస్ ధరను రూ.వెయ్యి దాటించేశారు. ఏరు దాటిన తర్వాత తెప్పను తగలేసే అలవాటున్న ఢిల్లీ పెద్ద మనుషులు... ఈ దాటింపులను ఎప్పటిదాకా కొనసాగిస్తారనేది తెలియక సామాన్యులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల మీద విపరీతంగా పడుతూ కుటుంబాల బడ్జెట్లను తలకిందులు చేస్తున్నది. 'పెట్రో' మంటల మూలంగా సరుకు రవాణా ఛార్జీలు విపరతంగా పెరగటంతో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. ముఖ్యంగా నూనెల ధరలు ఆకాశాన్ని తాకాయి. మొదట్లో లీటర్‌కు రూ.70 నుంచి రూ.90 వరకూ ఉన్న ధరలు... మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.120 నుంచి రూ.150 దాకా ఎగబాకి... ఇప్పుడు రూ.200 మార్కును కూడా దాటేశాయి. ఇదే తరహాలో బియ్యం, ఉప్పులు, పప్పులు, సబ్బులు తదితరాల ధరలు పేదోణ్ని వెక్కిరిస్తున్నాయి.
కేంద్రం ఈ విధంగా సామాన్యుడి జీవితాన్ని చిదిమేస్తున్న తరుణంలో ఇది చాలదన్నట్టు... రోజుల వ్యవధిలోనే వరసగా ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సైతం తానేమీ తక్కువ కాదని నిరూపించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ నాశనమైంది.. ఇప్పుడు మేం దాన్ని రక్షిస్తాం, పటిష్ట పరుస్తామంటూ గతంలో మీసాలు మెలేసి చెప్పిన ముఖ్యమంత్రి... ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు 'రౌండ్ ఫిగర్' పేరిట ఛార్జీలను వడ్డించటం శోచనీయం. దీనికి నష్టాలను సాకుగా చూపటం విడ్డూరం. సంస్థ నిర్వహణ, డీజిల్ భారాల పేరుతో ఛార్జీలను పెంచటమనేది 'ప్రయివేటీకరణ'కు పరోక్ష రూపమే తప్ప మరోటికాదు. ప్రజా రవాణా బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుని.. దాన్ని ప్రయివేటు వారికి అప్పగించాలంటూ కేంద్రం చట్టం చేసిన సంగతి మనకెరుకే. దీన్ని అమలు చేయటంలో తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్న కేసీఆర్ సర్కారు... ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దొడ్డిదారిన బస్సు ఛార్జీలను పెంచటమంటే మోడీ సర్కారుకు వత్తాసు పలకటమే. మరోవైపు ఉదరు లాంటి కేంద్ర పథకంలో చేరి పాపాన్ని మూటగట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఆ పర్యవసానాలను జనం మీద రుద్దుతున్నది. ప్రభుత్వరంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కాకుండా... ప్రయివేటు కంపెనీల నుంచి కరెంటును అధిక ధరలకు కొనుగోలు చేయటం, ఎక్కువ ధరకు వేలం పాడిన వారి వద్ద నుంచి అధిక ధరకు దాన్ని కొనటం, నిర్వహణ లోపాలు... వెరసి విద్యుత్ ఛార్జీల పెంపుదలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ధరాఘాతాలపై ప్రజలు పోరాటాల శరాఘాతాలను సంధించాలి. లేదంటే మున్ముందు మరిన్ని భారాలను మనం చవిచూడాల్సి వస్తుంది.