Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచ నాటకరంగ దినోత్సవం. ఏ దినోత్సవాలైనా వాటి ప్రాశస్త్యము తగ్గుతున్న సందర్భంలో వాటి వాటి ప్రాధాన్యతలను గుర్తెరిగేట్టు చేస్తుంటాము. ఇప్పుడు అసలు నాటకరంగం బదులు కొత్త నాటకాలు పెరుగుతున్న సందర్భంలో ఉన్నాము. నాటకం అనేక కళల సమాహారం. సంగీతం, సాహిత్యం, నటన, వేషము, భాషణం అన్నీ కలిసి, వీక్షకుల మదిని కదిలింప చేసేది నాటకమే. రాజుల కాలం నుండి నాటక కళ ప్రాచుర్యం పొందుతూ ఉండింది. యక్షగానాలు, వీధి భాగవతాలు మొదలైనవన్నీ నాటకానికి మాతృకలే. శ్రవణ సహిత దృశ్యరూపకమే నాటకం. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రదారుడే ఆయువుపట్టుగా ఉంటాడు. రాజులు, వారి వంశ చరిత పరిపాలన వైశిష్ట్యాన్ని పామరజన రంజకంగా ప్రచార మొనరించడమే నాటి నాటక లక్ష్యంగా ఉంది. కానీ నేడు నాయకులు, పరిపాలకులే నాటకాలు వేస్తున్నారు. నటనలో జీవిస్తు న్నారు. ప్రజలను భ్రమల్లోకి తోస్తున్నారు. ఇప్పుడు రాజకీయమే ఒక నాటక రంగంగా మారటం మనం చూస్తున్నాము. ఇది వేరే విషయం. అయినా నాటకాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్లు గుర్తురాకమానరు.
'కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు చ శకుంతలా, తస్యాంచ చతుర్థ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం' అని పూర్వీకులు నుడివినారు. అంటే కావ్యాలన్నింటిలోకి నాటకం చాలా రమ్యమైనదని, నాటకాలలో శాకుంతల నాటకం, అందులోను నాలుగవ అంకము, అందులో ఆ నాలుగు శ్లోకాలు చాలా గొప్పవి, రమ్యమైనవి అని అర్థం. ఆ నాలుగు శ్లోకాలలో మనిషికి ప్రకృతికి ఉన్న ఒక మానవీయ సంబంధాన్ని, మానవుల మధ్య ఉండే మానవీయ సంబంధాన్ని వర్ణిస్తాడు కాళిదాసు కవి. సరే అసలు తెలుసుకోవాల్సింది ఏమంటే, నాటకం మానవ జీవినంలోని అనేక కోణాలను, అందులోని అంతః సారాన్ని దృశ్యమానం చేస్తుంది. షేక్సిపియర్ నాటకాలు చూసినట్లయితే ఆనాటి మానవ సంబంధాలు, జీవన చిత్రాలన్నీ మన కళ్లముందు దర్శనమిస్తాయి. నాటకంలో జీవితమున్నట్లే జీవితంలోనూ నాటకం ఉంటుంది. నిజ జీవితంలో జీవించడానికి బదులుగా నటించడమే జీవితమైపోయింది. ఎందుకంటే, ఈ వ్యవస్థలో మనిషి జీవితం అన్యధీకరణకు గురైంది. అంటే మనిషి, తాను తానుగా బ్రతకే పరిస్థితులు ఈ సమాజంలో లేవు. ఒక అన్యమనస్కుడై పాత్రను పోషిస్తున్నట్టుగా జీవితాన్ని ఈడుస్తుంటాడు. అందుకే నాటకం అతన్ని రంజింప చేస్తుంది. తన జీవితాన్ని తనకు కళ్ళముందు చూపెడుతుంది. అందుకే నాటక కళ ప్రపంచ వ్యాపితంగా ప్రసిద్ధి చెందింది.
ఇక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల సమస్యలకు అద్దం పట్టే నాటకాలు ఆవిర్భవించాయి. సంఘ స్కంరణ కోసం వచ్చిన నాటకాల్లో గురజాడగారి కన్యాశుల్కం బహుళ ప్రచారం పొందింది. కాళ్లకూరివారి వరవిక్రయం, చింతామణి, బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర మొదలైన నాటకాలు తెలుగునేలపై ఎంతో ఆదరణకు పాత్రమైనవి. ఆ తర్వాత ప్రగతిశీల భావాల వ్యాప్తిలో భాగంగా ప్రజల బాధలను గాధలను వీధి నాటక రూపంలో ముందుకు తెచ్చిన వాళ్ళలో సఫ్దర్ హష్మిని గురించి పేర్కొనవచ్చు. ఇవన్ని కూడా నాటకరంగానికి సంబంధించిన పరిణామ వికాసాల పరిచయాలు మాత్రమే. ఈ నాటక దినోత్సవ సమయాన సామాజిక రాజకీయరంగంలో జరుగుతున్న నాటకాలను కూడా పరికించాల్సిన అవసరం ఉంది.
ఈ రోజున అధికారంలో ఉన్న నాయకులు ఆరెస్సెస్ అనే మత మనువాద సంస్థరాసిన నాటకంలోని పాత్రధారులుగా బహు సామర్థ్యంతో నటిస్తూ ఉన్నారు. ఈ నాటనలోని సారం విద్వేషం. ప్రజలని చీల్చడం. ఆ సంస్థ సిద్ధాంతకర్త గోల్వాల్కర్, వారి కార్యకర్తలతో స్వయంగా నాటకంలోని నటనను గూర్చి వివరిస్తారు. ''ఆరెస్సెస్ కార్యకర్త నటునితో సమానం. నటుడనే వాడు పాత్రను సమర్థవంతంగా పోషించి మెప్పించాలి'' అని ఇండోర్లో 1960లో చెప్పారు. ఇప్పుడదే నటన నడుస్తోంది. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వేషములు మారుతుంటాయి. భాషణలు మారతాయి. అంటే ఏ ప్రాంతానికి అవసరమైనది అక్కడ చెబుతారు. అబద్దాలను, అసత్యాలను పాత్రదారులుగా పదేపదే పలుకుతుంటారు. సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా దీనికి జోడిస్తారు. మొన్ననే మనం చూశాం. సినిమా కళను కూడా ఉపయోగించి 'కాశ్మీర్ ఫైల్స్'ను విద్వేషపూరిత నాటకంగా సృష్టించారు. శాకుంతలంలోని శ్లోక చతుష్టయంలానే మనకూ ఓ దుష్ట చతుష్టయమూ నాటకమాడుతున్నది. మాటలు మార్చటం, విద్వేషాలను రెచ్చగొట్టటం, ఆశ్రితులకు లాభాలు చేకూర్చటం, ఉద్వేగాల ఆధారంగా మనుషుల మధ్య చిచ్చురేపటం వీరి కళానైపుణ్యాలు. ఈ నాటకంలో సత్యం హత్య చేయబడుతుంది. వాస్తవం వక్రీకరించబడుతుంది. నాటకంలో మనుషుల సారం కాక, అధికారం విలయతాండవం చేస్తుంది. అందుకే ప్రజల ముందు నాటకాలేస్తున్న వారి నిజస్వరూపాన్ని తెలుసుకుని చైతన్యమయితేనే మన బ్రతుకు పాత్ర సజావుగా కొనసాగుతుంది.