Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకే ఆకాశాన్ని కప్పుకున్నంత' మాత్రాన, 'ఒకే మట్టిని కూడా కప్పుకోవల్సిన వాళ్ళం' అయినంతమాత్రాన వాళ్ళెవరికీ బంధువులు కారు. బీర్భమ్ (బెంగాల్)లో కాలిబూడిదైన ఎనిమిది మందిలా కాదు ఈ పదకొండు మంది. అక్కడ రాజకీయ హింస జరిగిందేమోనన్న 'వాసన' రాగానే కలకత్తా హైకోర్టు సీబీఐని పురమాయించింది. ఆఘమేఘాల మీద ఫోరెన్స్‌క్ నిపుణులతో సహా సీబీఐ బృందం రంగంలోకి దూకేసింది. మొన్న బోయిగుడాలో కాలి బుగ్గి అయింది వలస కూలీలు. తమ పదకొండు కోట్ల సోదరుల్లాగే ఆకలేవారిని నడిపిన చోదకశక్తి. ఆకలే వారి చలనశక్తి కూడా. ఊరుకాని ఊర్లోకి తమ వేదనల్ని, బాధల్ని దిగమింగుకుని, చిన్న పేగుల్ని, పెద్ద పేగులతో ముడేసి, మూటగట్టి వలసొచ్చిన కూలీ జనం వారు. వలస కార్మికుల జీవితాల్లో ఎన్నో 'బోయిగూడా'లుంటాయి. పైగా ప్రతి రాష్ట్రంలోనూ 'బోయిగుడా' లుంటాయి. ఢిల్లీ కామన్వెల్త్ క్రీడా గ్రామ నిర్మాణంలో చలిలో గడ్డకట్టిపోయినోళ్లను శ్రీకాకుళం కార్మికులంటే, పంజాబ్ ఇటుక బట్టీల్లో తుపాకీ గుళ్ళు బలితీసుకున్న వారిని బీహార్ కార్మికులంటారు. స్టీల్ రోలింగ్ మిల్స్‌లో, ఇతర ఫర్నేస్‌ల వద్ద ఆహుతయ్యే వారిని ఒడియా కార్మికులుగా పిలుస్తారు. గ్లౌజ్లులేక కళ్లకు పెట్టే ఫేస్ షీల్డులు సైతం ఇవ్వని యజమానుల వల్ల కళ్లు పోయే కబోదుల వార్తలు మీడియాకూ కనపడవు. దుబ్బలో, ధూళిలో మాస్కులు కూడా ఇవ్వని పెట్టుబడి పైశాచికత్వం దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధిగ్రస్థులను ఎగతాళి చేస్తూనే ఉంటుంది. ఇవేవీ దినపత్రికల్లో వార్తలు కావు. దేశానికి వారి అవసరం ఐదేండ్లకొకసారే కదా!
''సఖుల వలన పరిచ్యుతులు
జనుల వలన తిరస్కృతులు
సంఘానికి బహిష్కృతుల''నే కదా శ్రీశ్రీ వీరిని ''ఏడవకండేవకండి!'' అంటూ ఓదార్చింది.
సూట్కేసుపైనే అలసి సొలసిన బిడ్డను లాక్కెల్తూ తల్లి, చెప్పులు కూడా లేక రక్తమోడిన పాదాలు, అవ్వల్ని వీపుపై కెక్కించుకుని నడిచిన తాతలు, ప్రకృతిలోనే పురుడు పోసుకున్న నిండు గర్భిణీలు, రైలుపట్టాలపై తునా తునకలైన కార్మికుల శరీరాలను వగైరా చూసి, విని ప్రపంచం వలవల ఏడ్చింది. వలస కార్మికుల జీవితాలను దేశానికి పరిచయం చేసిన ఈ 'విజయ' గాధలే మోడీ సర్కార్ రాక్షసత్వాన్ని కూడా బహిర్గతం చేశాయి. ప్రజల స్మృతిపథాన్ని నిటారుగా నిలబెట్టాలంటే పునశ్చరణ తప్పనిసరి! 2020 జనవరి మొదటి వారంలో భారతదేశ మొదటి కోవిడ్ కేసు వచ్చింది. వెంటనే దేశంలోని 29 అంతర్జాతీయ విమానా శ్రాయాలను నియంత్రించి ఉంటే, సర్కారు వారి పాట నాలుగు లక్షల మరణాలు, డబ్ల్యూహెచ్ఓ లెక్క నలభైలక్షల మరణాలు మన దేశంలో ఉండకపోవు కదా! అక్షరాలా స్వామి కార్యం, స్వకార్యం కూడా పూర్తి చేసి మార్చి 24న లాక్డౌన్ ప్రకటించాడు మోడీసాబ్.
దాంతో వలస కార్మికుల సంఖ్యలు, చట్టాలు దేశంలో చర్చనీయాంశమైనాయి. 11కోట్ల మంది వెతలు కోవిడ్ పుణ్యాన ప్రపంచం దృష్టికెక్కాయి. లాక్డౌన్లో వారి ఉపాధి పోయింది. వందల కి.మీ. స్వగ్రామాలకు కాలిబాట పట్టారు. కరోనాలో లాభాలు తగ్గాయన్న సాకుతో కార్మిక చట్టాలను చట్టుబండలు చేశాయి ప్రభుత్వాలు. 2020 ఏప్రిల్‌లోనే పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు ఫ్యాక్టరీ చట్టాన్ని సవరించి పనిగంటలు పెంచేశాయి. యూపీలో అన్ని చట్టాల్ని పాడెమీదికి ఎక్కించింది యోగీ సర్కార్. పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేనిసమయంలో కోడ్‌లన్నీ ఉనికిలోకి వచ్చేశాయి.
బోయిగూడ ఘటన జరిగిన చోట ఆ షెడ్‌కి ఆస్తిపన్ను కట్టడం లేదు. అసలక్కడ జరిగే యాక్టివిటీకి ట్రేడ్ లైసెన్సే లేదు. లేబర్ లైసెన్స్ లేదు. కార్మికశాఖ, ఫ్యాక్టరీస్ శాఖలు మత్తులో జోగుతున్నాయి. ఘటన జరిగిన మర్నాడు మంత్రిగారి సమీక్షా సమావేశంలో కార్మికశాఖ అధికారులే లేరంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో తెలియడం లేదా? దేశంలో జరుగుతున్న ఘటనలకిదో శాంపిల్ మాత్రమే. పెట్టుబడి ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటుంది. దోపిడీ పద్ధతుల్ని మెగురు చేసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో వలస కార్మికుల దోపిడీ తీవ్రత 19వ శతాబ్దం చివరి రోజులు నాటి పరిస్థితికి చేరింది. చట్టాలే ఉండవు. ఉన్నా, వాటిని ప్రభుత్వాలు అమలు చేయవు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న దేశవ్యాపిత సమ్మెలో ఈ నాలుగు కోడ్ల రద్దు ఒక కీలక డిమాండ్.