Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోచుకోవడం వారికేం కొత్తకాదు. కాకపోతే కాలంతోపాటూ దాని రూపు మార్చారు! తరతరాలుగా వస్తున్న దోపిడీలకు ఆధునిక హంగులు అద్దారు. ఆన్లైన్ మోసాలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాలు కదపకుండానే లూటీలు చేయడంలో రాటుదేలారు. ఇప్పుడు ఆయుధాలకు బదులు వారి చేతుల్లోకి ఆధునిక ఫోన్లు చేరాయి. కరోనా సంక్షోభ సమయంలో వేతన జీవులు సహా అనేక మంది సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఇది.. ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన వారు, ఇంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితికి చేరారు. దీంతో చాలా మంది సత్వరమే రుణం అందించే యాప్‌ల ఊబిలో దిగబడ్డారు. ఇదే అదనుగా శవాలపై పేలాలు ఏరుకునే రాబంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చేసిన అప్పులను వారం, పదిరోజుల్లోనే తీర్చాలి. లేకుంటే వారు పెట్టే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. అలాంటి మానసిక వేధింపులు తాళలేక మనతెలంగాణలోనే 10మందికి పైగా బలవన్మరణానికి పాల్పడటం కలవర పరుస్తోంది.
గడువులోగా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ హైదరాబాద్ యువకుడిని, ఆ చిన్నారిపై లైంగికదాడి చేసింది ఇతనేనంటూ అన్యాయంగా నిందమోపి అతని బంధుమిత్రులందరికీ సందేశాలు పంపి వేధించారు. అప్పు తీసుకున్న నాలుగు రోజులకే ఓ మహిళా రుణగ్రహీత ఫొటోను నగచిత్రాలతో మార్ఫింగ్ చేసి బంధుమిత్రులకు పంపడంతో వారు ఆత్మహత్యే శరణ్యమకున్నారు. రుణయాప్ నిర్వాహకుల దురాగతాలకు ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ గత నెలరోజులలో వెలుగు చూసినవే. గతేడాదే సైబరాబాద్ పోలీసులు ఇలా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేశారు. అయినా ఈ ఘరానా మోసగాళ్లకు చీమకుట్టినట్టైనా లేదు. అందుకే ఏమాత్రం బెరుకు లేకుండా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డొల్లతనాన్ని వేలేత్తి చూపుతోంది.
అంతర్జాలం నిత్యావసరంగా మారిపోయిన దశలో, సాంకేతికత మాటున ఘరానా మోసాలు 'ఇంతింతై వటుడింతయై.. తానింతై' అన్నట్టుగా పెరిగిపోతున్నాయి. మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై గోరుచుట్టుపై రోకలిపోటులా అప్పులు, వడ్డీలు దాపురించాయి. కరోనా సమయంలో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు భారీ వడ్డీకి సైతం వెరవకుండా ఈ రుణ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నారు. ఇప్పటికీ తీసుకుంటున్న వారూ లేకపోలేదు. అవసరం ఎంతటి పనినైనా చేయిస్తుం దంటారు కదా! వాటి షరతులను గుడ్డిగా అంగీకరించాల్సిందే. ఆర్బిఐ నిబంధనల ప్రకారం అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడానికి కనీసం మూడు నెలల సమయం ఉంటుంది. అది కూడా ప్రభుత్వ ప్రమాణాల మేరకే వడ్డీ ఉండాలి. కానీ వారం పదిరోజులకే తిరిగి చెల్లించమని వెంటపడుతుంటారు. అయినా చెల్లించ లేకపోతే ఇకవారు రెచ్చిపోతారు. పైన చెప్పిన పద్ధతుల్లో మెసేజులు పంపుతారు. ఇలా రుణం తీర్చేవరకు వేధింపులు కొనసాగుతాయి. మరో వైపు భారీ వడ్డీలతో నడ్డి విరగొడతారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో వేయికిపైగా రుణ యాప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 600యాప్‌లు ఎలాంటి లైసెన్సు లేకుండానే అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్టు స్వయంగా రిజర్వ్ బ్యాంకే గత ఏడాది నవంబర్‌లో తేల్చిచెప్పింది. అయినా వాటిని నియం త్రించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంద మోడీ సర్కార్.
కొన్నాళ్ల క్రితం ఆర్బీఐ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రతి డిజిటల్ రుణ యాప్ ఆర్బీఐ లైసెన్సు పొంది ఉండాలి. సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని, ప్రలోభపెట్టే యాప్‌లే అధికంగా ఉన్నాయి. ఆ నిబంధనలు తుంగలో తొక్కి యాదేచ్ఛగా తన వ్యాపారాలు చేసు కుంటున్నాయి. భారత్‌లో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పటిష్ట వ్యవస్థను రూపొందించి, వివిధ దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర హౌం శాఖపైనే ఉంది. కానీ, వారు పట్టించుకోకపోవడంతోనే పదేపదే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. ఇకనైనా ఈ ఊదాసీన ధోరణి వదిలి ప్రాణాలు తీస్తోన్న నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా మార్గాల్లో సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తతంగా అవగాహన కల్పించాలి. అప్పుడే ఇలాంటి దారుణాలను జరగకుండా అడ్డుకోగలం. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట విమర్శిస్తే సైబర్ క్రైమంటూ జైళ్ళు నోరు తెరుచుకుంటాయే. మరి, ఆర్బిఐ అనుమతిలేని ఇటువంటి యాప్‌ల నిర్వాహకులను నియంత్రించలేరా? పైగా ప్రజల ధన, మాన, ప్రాణాలకు పెద్ద ఉపద్రువం సృష్టిస్తున్న రుణ యాప్‌లపై చర్యలు అనివార్యం.