Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ఐదు రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న బాలికపై జరిగిన లైంగికదాడి, హత్య... మరోసారి తెలంగాణ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. నిర్భయ, దిశ ఘటనలను ఇది మళ్లీ గుర్తు చేసి, గుండె తరక్కుపోయేలా చేసింది. భాగ్యనగరంలోని సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రపై జరిగిన అఘాయిత్యాన్ని మనం మరిచిపోకముందే... వికారాబాద్ ఘటన కలిచివేసింది. ఈ దాష్టీకాలను మనం పరిశీలిస్తే... ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, మీడియా హడావుడి చేయటం, నిందితులకు కోర్టులు శిక్షలు వేయటం, లేదంటే ఏదో ఒకసాకుతో వారిని ఎన్కౌంటర్ చేయటం... ఆ తర్వాత కథ ముగిసిందంటూ చేతులు దులుపుకోవటం షరా మామూలైంది. మహిళలపై అత్యాచారాలు, అఘా యిత్యాలు ఆగాలంటే ఎన్కౌంటర్లే పరిష్కారమన్నట్టు కొందరు భావోద్వేగాలకు గురవుతున్నారు.. కానీ అవి జరిగిన తర్వాత కూడా ఇవి ఆగటం లేదన్న విషయాన్ని మనం గుర్తెరగాలి.
ఈ క్రమంలో అసలు దోషులెవరు..? బాధ్యులెవరు..? వాటికి కారణాలేంటి..? పరిష్కార మార్గాలేంటి..? అనే ప్రశ్నలు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. బాధితుల జీవితాలు అంతులేని వేదనలతో ముగిసిపోతున్నాయి. వీటికి పెట్టుబడిదారీ వ్యవస్థలోని లోపాలే అసలు సిసలు కారణం. డబ్బే పరమావధిగా విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల వెబ్సైట్లు, అదే కోవలో వస్తున్న కొన్ని సినిమాలు యువతపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. వాస్తవానికి 80,90 దశకాల్లో సినిమాల్లో వ్యాంప్ పాత్రలు ఉండేవి. ఇప్పుడలాంటి క్యారెక్టర్లు లేకపోవటంతో నేరుగా అశ్లీలత అనేది యువత జీవితాల్లోకి ప్రవేశించి.. చెడు ఆలోచనలకు పురిగొల్పుతున్నది. దీంతోపాటు ఇలాంటి ఘటనలకు సమాజంలోని కుటుంబ, సాంఘిక, సామాజిక, రాజకీయ, శారీరక, మానసిక పరిస్థితులనేకం కారణమన్నది మనం గుర్తించాలి. దిశ ఘటనలో చూసినప్పుడు మద్యానికి బానిసలైన యువకులు ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. సింగరేణి కాలనీ విషయంలో అక్కడ పసిబిడ్డపై లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత ఎన్కౌంటర్కు గురైన యువకుడు.. మాదక ద్రవ్యాలకు బానిస. ఇప్పుడు వికారాబాద్ సంఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... బాధితురాలు ఒక మైనర్ బాలిక. ఫొటో ఆధారంగా నిందితుడికి కూడా 18 నుంచి 20 ఏండ్ల లోపే ఉంటుందని అంచనా. ఈ క్రమంలో జీవ, వైద్య, మానసిక శాస్త్రవేత్తలు, నిపుణుల విశ్లేషణల పరంగా కౌమార దశలో బాల బాలికల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్లలో వచ్చే విపరీతమైన తేడాల వల్ల వారు ఆ వయసులో తమ ఉద్వేగాలు, భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. ఈ క్రమంలో అవి అదుపుతప్పి... వారిని మరింత గందరగోళానికి గురి చేయటం సహజం. ఈ క్రమంలో వారిని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ, స్నేహితులుగా మెలుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేస్తూ ఉండాలి. తద్వారా వక్రమార్గాలకు అడ్డుకట్టవేయాలి. ఇక సమాజపరంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కుటుంబ, సామాజిక విలువలు, సమాజం పట్ల బాధ్యత తదితరాంశాలను పిల్లల మెదళ్లలోకి ఎక్కంచాలి. దీంతోపాటు రకరకాల జాఢ్యాల నుంచి అబ్బాయిలు, అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు వీలుగా స్కూళ్లు, కాలేజీల్లో సదస్సులు, చర్చాగోష్టులు నిర్వహించాలి. విస్తృత ప్రచారం చేపట్టాలి. ఇదే సమయంలో లైంగిక విద్యపై పిల్లలకు అవగాహన కల్పించటం ద్వారా అడ్డదారులు తొక్కకుండా మార్గదర్శనం చేయాలి. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వీటన్నింటినీ అమలు చేయించాలి.
సినిమాలు, సీరియళ్లు పెద్ద వారి బుర్రలనే చెడగొడుతున్న ప్రస్తుత తరుణంలో... వాటికి దూరంగా బాల బాలికలను ఉంచటమనేది మన తక్షణ కర్తవ్యం. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణలో సమాజానికి పనికొచ్చే, మానసిక వికాసాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే సినిమాలను, టీవీ కార్యక్రమాలను వారిని చూడనివ్వాలి. ఇలా చేసినప్పుడు పిల్లలో పెడధోరణులు ప్రబలకుండా కొంతలో కొంతైనా అరికట్టవచ్చు. వినియమ దారీతత్వం బీభత్సంగా పెరిగిన ప్రస్తుత సమాజంలో... సినిమా హీరోలను, సెలబ్రిటీలను అనుకరించటం కౌమార దశలోని బాల బాలికలను మామూలైపోయింది. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసుల పేరిట మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయిన విద్యార్థులు.. ఇప్పుడు అవి లేనిదే జీవించలేమనే స్థితిలోకి నెట్టబడ్డారు. అందువల్ల కుటుంబ, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశా లతో ముడిపడిన ఇలాంటి అంశాలను నిశితంగా పరిశీలించాలి. వాటి పరిష్కారానికి పాలకులు చిత్తశుద్ధితో కృషి చేసి, శాశ్వతంగా ఈ రుగ్మతలను పారద్రోలాలి. లేదంటే అవి పునరావృతమవుతూనే ఉంటాయి.