Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత్తుతున్నది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు-2022 మోడీ ప్రభుత్వ మరో నిరంకుశ చర్య. బ్రిటిష్ వలస పాలకులు ప్రవేశపెట్టిన ఖైదీల గుర్తింపు చట్టం(1920)ని రద్దు చేసి, దాని స్థానే తీసుకొచ్చే బిల్లు ఆధునిక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చేలా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు జీవించే హక్కును, మానవ హక్కులను మంట గలిపేదిగా ఉందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసినా లెక్క చేయకుండా లోక్సభలో తనకున్న బండ మెజార్టీని ఉపయోగించుకుని ప్రవేశపెట్టింది.
ఇప్పటివరకు అమల్లో ఉన్న ఖైదీల గుర్తింపు చట్టానికి ఇది మరిన్ని కోరలు తొడగడమే గాక, పరిధిని కూడా విస్తరింపజేసింది. పాతచట్టం ఒక పరిమిత కేటగిరీకి చెందిన దోషుల పాద ముద్రలు, వేలి ముద్రలు మాత్రమే నమోదు చేయాలని చెబుతోంది. కొత్త బిల్లు దోషులతోబాటు, విచారణలో ఉన్న ఖైదీలు, నేర విచారణ కాని నిందితులు, అరెస్టయిన వ్యక్తుల నుంచి కూడా శరీర, జీవ నమూనాలను సేకరించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు కట్టబెడుతున్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్ధం. దేశ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును బాహాటంగా ఉల్లంఘించడమే. విచారణలో ఉన్న ఖైదీలను, నేరం చేసి ఉంటారన్న అనుమానంతో అరెస్టు చేసిన వారి నుంచి ఈ కొలతలు, నమూనాలు సేకరించడమంటే వారిని అవమానించడమే. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును అనుమతించేది లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం లేవనెత్తితే దానిని బుల్డోజ్ చేశారు.
లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా దీనిని సమర్థించు కునేందుకు చేసిన వాదనలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నూట రెండేండ్ల క్రితం తీసుకొచ్చిన చట్టం వల్ల కేవలం వేలి ముద్రలు, కాళ్ల ముద్రలు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉందని, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు వల్ల వేలి, కాలి ముద్రలే కాకుండా అరచేయి ముద్రలు, ఫొటోలు, ఐరిస్, రెటీనా స్కాన్, శారీరక కొలతలు, జీవ నమూనాలు, చేతి రాత సంతకాలు సేకరించడానికి వీలు కలుగుతుందన్న మంత్రి మహౌదయుడు అంతటితో ఆగలేదు. దీనివల్ల శిక్షల శాతం కూడా పెరుగుతుందని ముక్తాయింపు ఇచ్చారు. చట్టాలు ఎంత కఠినంగా ఉంటే శిక్షల శాతం అంత ఎక్కువగా ఉంటుందన్న వాదన పసలేనిది. లఖింపూర్ ఖేరి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇదే మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా ఒక పథకం ప్రకారమే రైతులను కారుతో తొక్కించి చంపారని దీనిపై దర్యాప్తు జరిపిన సిట్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ అరెస్టయిన కొద్ది రోజులకే ఆ పెద్ద మనిషి బెయిలుపై బయటకొచ్చాడు. ఏ తప్పు చేయని హక్కుల కార్యకర్త స్టాన్స్వామికి బెయిలు పుట్టకపోవడంతో నెలల తరబడి జైలులోనే మగ్గి, అక్కడే అనారోగ్యంతో కన్నుమూయాల్సి వచ్చింది. హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, ఉద్యమకారులపై ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించడమే తప్పు. అటువంటి వారి నుంచి శరీర, జీవ నమూనాలు సేకరిస్తామనడం మరీ తప్పు.
బ్యాంకులను వేల కోట్ల మేర ముంచేసే ఆర్థిక నేరగాళ్లు, పన్నులు ఎగ్గొట్టి కూడబెట్టుకున్న నల్ల ధనాన్ని విదేశాలకు తరలించే ఘరానా మోసగాళ్లు దర్జాగా తిరుగుతుంటే... వారిని అరెస్టు చేయకుండా శిక్షల శాతం తగ్గిపోతుందని వగచి ఏం ప్రయోజనం? కఠినమైన చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని ఎవరిపై ప్రయోగిస్తున్నారన్నదే ముఖ్యం. దీని నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇటువంటి వాదనలను ముందుకు తెస్తున్నది. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసినంతగా స్వతంత్ర భారత దేశంలో మరే ప్రభుత్వమూ చేయలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మోడీ ప్రభుత్వ హిందూత్వ-కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఉపా చట్టం కింద జైళ్లలో కుక్కుతున్నది. నేర శిక్షా స్మృతి (ఐడెంటిఫికేషన్) బిల్లు రేపు చట్టంగా మారితే జీవించే హక్కును కూడా అది హరిస్తుంది. ఈ బిల్లును తిప్పికొట్టేందుకు పార్లమెంటులోపల, వెలుపలా వామపక్ష, ప్రజాతంత్ర ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలి.