Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నీ అభిప్రాయంతో నేను విభేదించినా, నీ అభిప్రాయాన్ని నీవు కలిగివుండే హక్కుని గుర్తిస్తాను, గౌరవిస్తాను'' అంటారు ఓతత్త్వవేత్త. నిజంగా ఇది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈ దేశంలో ''తమకు తప్ప మరెవరికీ అభిప్రాయమే ఉండకూడదన్న చందంగా ఉంది'' పాలకపార్టీ వ్యవహారం. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్య భారతంలోనే ఉన్నామా? అనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ దాడి ఘటన దీనికి పరాకాష్ట.
ఇది దాడి కాదు నిరసన అంటోంది బీజేపీ. తగుదునమ్మా అంటూ దానిని ధృవీకరిస్తోంది ఢిల్లీ పోలీసు. పోనీ కాసేపు అదే నిజమని అనుకున్నా, నిరసన తెలిపే పద్ధతి ఇలానే ఉంటుందా? రెండు వందల మంది మూక ఇంటి మీద పడి, గేట్లు ధ్వంసం చేసి, సీసీ కెమేరాలు పగులగొట్టి, గోడలకు కాషాయరంగు పులిమి నానా బీభత్సం సృష్టించి ఇది దాడి కాదు నిరసన అంటే ''కేంద్రం కనుసన్నల్లోని ఢిల్లీ పోలీసులు'' ఆమోదిస్తారేమోగానీ, పౌర సమాజం అంగీకరించగలదా?! ఇది దాడా, నిరసనా అన్నది అటుంచితే... ఈ ఘటన ఏ ప్రజా ప్రయోజనార్థమో అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటుండదు. ''ది కాశ్మీర్ ఫైల్స్'' అనే సినిమాకు ఢిల్లీ ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపునివ్వకపోగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలుపుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడమే బీజేపీ వారి ఈ ''అసహనానికి'' కారణం.
ఇంతకూ ఏమిటా అభిప్రాయాలూ, వ్యాఖ్యానాలూ అంటే... ఈ సినిమాకు రాష్ట్రంలో వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలంటూ బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు చర్చ లేవనెత్తారు. ఇప్పటికే ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మినహాయింపులూ, రాయితీలూ ఇవ్వడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకూ, పోలీసులకూ సెలవులిచ్చి మరీ సినిమాకు పంపిస్తున్నాయి. కాబట్టి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమూ అదే చేయాలన్నది వారి ఆకాంక్ష కాబోలు..! అందుకే ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దీనికి కేజ్రీవాల్ స్పందిస్తూ... ''నిజంగా మీకు సినిమాను ప్రజలకు చేరువ చేయాలనుంటే ఆ దర్శక నిర్మాతలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయమని చెప్పండి. అప్పుడు ప్రజలందరికీ ఉచితంగా సినిమా చూసే అవకాశం కలుగుతుంది'' అని అభిప్రాయం వ్యక్తం చేసారు. ''కాశ్మీరీ పండిట్ల పేరుతో సినిమా రూపకర్తలు డబ్బులు దండుకుంటే, బీజేపీవాళ్ళు దానికి పోస్టర్లు వేసే పనిలో నిమగమయ్యారని'' వ్యాఖ్యానించారు. అంతే.. తమదైన హింసా సంస్కృతికి తెరతీసారు. ఏకంగా ఓ ముఖ్యమంత్రి ఇంటిపైకే దాడికి తెగబడ్డారు! ఇదీ... ఇప్పుడు వీరి ఏలుబడిలో పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యం!!
ఇప్పటికే ఈ సినిమా అనేక వివాదాలూ, విమర్శలతో పాటు, కమలనాథుల ప్రమోషన్స్ పుణ్యమాని కొన్ని వందల కోట్లు మూటగట్టుకుంది, ఇంకా కట్టుకుంటోంది. ఇక చరిత్రను వక్రీకరిస్తూ ఇది ముందుకు తెచ్చిన అసత్యాలనూ, అర్థసత్యాలనూ, విభజన - విద్వేష భావాలనూ అటుంచితే, కాశ్మీరి పండిట్ల విషాదగాథ చూపి సొమ్ము చేసుకోవడమే తప్ప వారి సంక్షేమానికి ఈ సినిమా ఒరగబెట్టేదేమీలేదు. ''సర్! మీరు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు కదా! ఈ లాభాల్లోంచి బాధితులకి ఏమైనా సహాయం చేస్తారా?'' ఇది పాత్రికేయుల ప్రశ్న. ''అది నాపని కాదు, నా సినిమా ఎజెండా వేరు'' ఇది దర్శకుడు వివేక్ అగ్నిహౌత్రి సమాధానం. ఒకరిది కన్నీటితో రాజకీయం, మరొకరిది కన్నీటితో వ్యాపారం. ఇవి స్వయంగా కాశ్మీరీ పండిట్లే వెల్లడిస్తున్న నగసత్యాలు.
కాశ్మీరీ పండిట్ల పట్ల, వారి కన్నీటి గాథల పట్ల బీజేపీ వారు ఇంత కరుణ వొలకపోస్తున్నారే...! మరి ఈ ఎనిమిదేండ్ల ఏలుబడిలో వీరి పునరావాసానికి బడ్జెట్లో కేటాయింపులేమైనా చేశారా? పోనీ ప్రత్యేక పథకాలేమైనా రూపొందించి అమలు చేశారా? అంటే అదీ లేదు...! అందుకే ''ఈ ఏనిమిదేండ్ల పాలన బాగుంటే ఓ సినిమా దర్శకుడి శరణుకోరే అవసరముండేది కాదు కదా..!'' అంటున్నారు కేజ్రీవాల్. నిజానికి ఇటీవల ఈ కాశ్మీరీ పండిట్లలో రెండువందల మందికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలిచ్చి ఆదుకుంది ఢిల్లీ ఆప్ ప్రభుత్వం. దీన్ని అడ్డుకుంటూ కోర్టుకెక్కింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం నియమించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్. ఇంకా విచిత్రమేమిటంటే, కోర్టులో ఈ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరపున వాదించింది స్వయానా బీజేపీ లీగల్‌సెల్ అధిపతి. కమలనాథుల కపట నీతికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి? బీజేపీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో చూపిన శ్రద్ధ, కాశ్మీరి పండిట్ల జీవితాలపట్ల చూపలేకపోయింది. దీనిని ప్రశ్నిస్తే భరించలేకపోతోంది. లేదంటే కేజ్రీవాల్ నివాసంపై దాడికి అర్థమేమిటి? తమకు భిన్నమైన అభిప్రాయాలుంటే దాడులు చేస్తారా? ప్రజాస్వామిక యుగంలో ఒక ముఖ్యమంత్రి అభివ్యక్తికే ఈ దుస్థితి దాపురిస్తే, ఇక సామాన్యుల అభివ్యక్తికి అవకాశముంటుందా? స్వయంగా బీజేపీ పార్లమెంటు సభ్యులే ఈ దుశ్చర్యలకు దిగజారుతుంటే... ప్రజాస్వామ్య స్వేచ్ఛా సూచికలలో మన పతనం ఇంకెంత దిగజారుతుందో కదా...!