Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన నేలపైన ఉష్ణతాపం పెరిగిపోయింది. ఎండాకాలంలో ఎండలు మండటం సహజమే. కానీ ఈ మంట ఏడాదికేడాదికీ పెరిగిపోతున్నది. నిప్పులు కురుస్తున్నవి. ఇప్పుడు ఈ ఎండలకు కూడా పోటీ పెరిగింది. ప్రకృతి కోపోద్రిక్త నేత్రాల ఎర్రని సెగలకు ధీటుగా మేమూ మండగలమని సవాలు చేస్తున్నాయి సరుకులు. ఏ వస్తువునైనా పట్టుకుని చూడండి, ఏ కొట్టుకెళ్ళయినా చూపులు సారించండి, నిప్పులు కక్కుతూ, మండిపోతున్నాయి ధరలు. మంటలు... పప్పుకు పోతే మంట. ఉప్పుకు పోతే మంట. ఎటుచూస్తే అటు మంటలు. నేలపైన అరికాళ్ళలోన అంటుకొంటున్న మంటలు. తలలపై ఎగిరి పడుతున్న మంటలు.
నెత్తిమీద ఎండ మంట నుండి రక్షణ కోసం ఏదో ఓ చెట్టుకిందకో, పుట్టచాటుకో పోయి తలదాచుకుంటాము. ఈ ధరల మంటల నుండి ప్రజలు ఎక్కడికి పోయి దాక్కోవాలి. మంటల్ని ఎలా ఎదుర్కోవాలి! పెనం మీది మంట ఎండదైతే, పొయ్యిలోని మంట సరుకుల ధరలదై కాల్చుకుతింటోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి కుంభవృష్టిలా నిప్పుల్ని కురిపిస్తున్నాయి. వెయ్యి రూపాయలు దాటిన గ్యాసు ధర కడుపులో మంటలెగదోస్తున్నది. ఈ మంటకైనా, ఆ మంటకైనా బలయ్యేది సామాన్యులూ, పేదలు మాత్రమే.
ఎండలు మండితే ఏమవుతుంది. ముందు గొంతులు ఎండిపోతాయి. ఆ గొంతుల్లో ఇన్ని నీళ్ళు పోయాలి. 75ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నా నేటికీ అన్ని గ్రామాలకు మంచినీళ్లను కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురాలేకపోయాము. ముఖ్యంగా గూడేలు, గుంపులు, ఆదివాసీ నివాసాలు, తండాలు, కొండవాసులు.. తలలపై బిందెలు పెట్టుకుని మైళ్లు నడిచి నీళ్ల కోసం బతుకుదారులలో తిరుగుతూనే ఉన్నారు. ఎండిన, ఇంకిన నేలల్లోంచి ఏం చేదుకుంటారు. ఇక నీడకు తల దాచుకోవటానికి సరైన గూళ్లులేక, ఎండలు విసరగానే నిప్పంటుకుని మంటలు విసురుకుంటూ ఎన్ని పల్లెలు గుడిసెలు బూడిదవటం చూస్తలేము. కాలిన బతుకులను ఎన్ని కంటలేము. ఫైర్ ఇంజన్ హారన్ల మోతకు ఎండాకాలం దద్దరిల్లటాన్ని చిన్నతనం నుండీ వింటున్నాము కదా! ఎప్పుడు మారేను ఈ బతుకులు! ఎండకు గుట్టలంటుకొన్నట్లే, గుడిసెలూ అంటుకుంటాయి. నేలలో నీరింకి పోవటానికి, ఎండలు నిప్పులు కరిపించడానికి కారకులెవరు? ఏ మాయాజూదం ఈ విపత్తులకు కారణం..! అడవులను నరికిందెవ్వడు? గుట్టల్ని తొలిచిందెవ్వరు? నేల తల్లి కడుపుకోసి మోసుకుపోతున్న వ్యాపారిని పసిగట్టామా! ఎవరు చెబుతారు జవాబులు!
ఇక ఎండకాలం కన్నా ముందరే ధరల మండే కాలం మొదలయ్యింది. ఎండాకాలం ఓ మూడు నెలలే ఉండిపోతుంది. కానీ ఈ ధరలు మండే కాలానికి హద్దూలేదు, అదుపూలేదు. ఎన్నికల కాలం ముగిసే వరకూ ధరల కాలానికి అడ్డుపెడతారు. అంతే.. ఆ తర్వాత ఆపేవాడెవ్వడు ఉండడు. పెట్రోలు, డీజిలు, గ్యాసు, రోజింత చొప్పున పెరిగిపోతున్నవి. వాటి ప్రభావం అనేక వస్తువులపై పడి రెక్కలు తొడిగి ఎగురుతున్నవి. పదో పదిహేనో ధర పెరిగినప్పుడు, గ్యాసు బండ పట్టుకుని రోడ్లెక్కిన మహిళామణులు, నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మంత్రులుగా పరిపాలన చేస్తున్నారు. ఇక అప్పుడు ఒక బాబాగారైతే పెట్రోలు, గ్యాసు చౌకగా అందించే వారినే ఎన్నుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం గావించారు. ఇప్పుడు వేయిదాటిపోయినా, పెట్రోలు వందదాటి పరుగెడుతున్నా వీరెవరూ నోరు మెదపటం లేదు. మొన్నో విలేఖరి మొహం మీదనే బాబాను ప్రశ్నిస్తే, ముఖమంతా చిట్లించి నొర్మూయిమన్నాడు. అది బాబాల శాంతి సమాధానం.
ఇక మొన్నటిదాకా రోడ్లపై ఉద్యమం చేసిన రైతుల మీదా ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపెడుతున్నది. రైతులకు అత్యవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు పెంచేసింది. వారికి పెట్టుబడులు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, అతి సామాన్యులు ఎండకు శరీరం వేడెక్కితే, జ్వరం వస్తే వేసుకునే గోలీ బిల్లల ధరల్నీ పెంచారు. ఫార్మా కంపెనీల లాభాల కోసం సాధారణ మందుల ధరల్ని కూడా అమాంతంగా మండించేశారు. ఇది ప్రజల్ని కరకర కాల్చుకు తినటం కాదా! విద్వేషాలు రెచ్చగొట్టే, ప్రజల మధ్య చిచ్చుపెట్టే కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలకు వందల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తారు. సామాన్యులు వాడే మందుల ధరల్ని మంట మండిస్తారు. ఇదీ మనల్ని ఏలేవారి నైజం. నువ్వంత మండుతుంటే, నేనేమయినా తక్కువ తిన్నానా అని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్యు ఛార్జీలను పెంచి ప్రజల మీద పుట్టెడు భారాన్ని మోపింది. ఇవన్నీ మండుతున్న ఎండలకంటే చురుకు పుట్టిస్తున్నాయి.
ఒకవైపు సూర్యుని కన్నెర్ర జేసిన చూపు, మరోవైపు మన నాయకులు వేసే భారాల ఊపు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆదాయాలు, వేతనాలు పెరగకపోగా, మరింత పడిపోయిన తరుణంలో ధరలు చేసే గాయాలు భరించటం ఎంత కష్టం! ప్రశ్నించాలి! నిలదీయాలి! సమయం కోసం వేచిచూడాలి. మన చేతిలో ఉన్నది ఒకటే ఆయుధం. దాన్ని సరైన సందర్భంలో సరిగ్గా ఉపయోగించి సామాన్యుని సత్తా ఏమిటో నిరూపించుకోవాలి.